2244*వ రోజు ....           04-Oct-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!

 

2244* వ నాటి 24 మంది తుది మెరుగులతో రహదారి స్వచ్ఛ శుభ్ర వైభవం.

 

            సోమవారం వేకువ కూడ 4.20 వేళకే 15 మంది ఔత్సాహికుల సంసిద్ధత! అతి త్వరలోనే నవ కార్యకర్తల చేరికతో అది 24 మంది బలగం  స్వచ్చోద్యమకారుల పాదస్పర్శకు నోచుకుకున్న ప్రదేశం కూడా నిన్నటిదే- అపార్ట్ మెంట్ల, బండ్రేవు  మురుగు వారధుల మధ్యస్తమే!

 

        తమకు పౌరహక్కులే కాక, బాధ్యతలు కూడ ఉన్నవని మరచిపోని రెండు డజన్ల మంది స్వచ్చంద శ్రమదాతలొకవైపు నిన్న, మొన్నటి శుభ్ర సుందరీకృత ప్రదేశంలో నిర్లక్ష్యంగా ఇంటి వ్యర్ధాల ప్లాస్టిక్ సంచుల్ని విసరగల బాధ్యతారాహిత్యమింకొక ప్రక్క! కనీసం ఈ ఒక్క రోజుకు గెలుపెవరిదంటే స్థిత ప్రజ్ఞత ప్రదర్శిస్తున్న సుదూర దృష్టితో అడుగులేస్తున్న సహనశీల స్వచ్చోద్యమానిదే! (అంతిమ విజయం మాత్రం ఇంకో మూడు నాలుగేళ్ల తదుపరి భవిష్యత్ కాలమనే వెండి తెర మీద చూడవలసిందే!)

 

చల్లపల్లి స్వచ్చోద్యమం ఎందరెందరికో స్ఫూర్తినివ్వడమే కాదు ఏ సంఘటన నుండైనా స్ఫూర్తి పొందగలదని కూడ తెలిసొచ్చింది. జనసైనికుల పిలుపుతో బస్టాండు ఎదుటి – 3 రోడ్ల కూడలోని రహదారి గుంటలను పూడ్చడంలో స్వచ్ఛ కార్యకర్త కూడ పాల్గొనడం, అందుకు సామాజిక మాధ్యమంలో కనిపించిన అభినందనలే ఋజువు. ప్రజాసౌకర్య రక్షణలో ప్రభుత్వాలు విఫలమైతే ప్రజలే ఆ బాధ్యత కూడ నిర్వహించక తప్పదు!

 

 ఇక, ఈనాటి కార్యకర్తల శ్రమదానరీతులెలా ఉన్నవంటే :

 

- ముగ్గురు కార్యకర్తలు ముందుచూపుతో బాటకు దక్షిణపు దిక్కున కరెంటు తీగలనందుకోగలవనిపించిన పెద్ద చెట్ల కొన్ని కొమ్మల్ని బారు గడకత్తులతోను, అవసారానుగుణంగా పెద్ద నిచ్చెన మీదకెక్కి కూడ తొలగించారు.

 

- సుమారు పది మంది రోడ్డు ఉత్తర దిశగా బాట కడ్డం వస్తాయనుకొన్న కొన్ని శాఖల్ని మాత్రమే కత్తిరించుకుంటూ పోయారు.

 

- ఇద్దరు ముగ్గురి పని బండ్రేవు కోడు కాల్వ వంతెన గోడల్ని శుభ్రపరిచి, తాము గతంలో శ్రమించి, వ్యయించి వేసిన రంగుల అందాన్ని మరొకమారు ప్రదర్శించడం.

 

- పనిలో పనిగా మురుగు కాల్వ పడమటి దక్షిణ గట్టులో కొంత మేర కూడ శుభ్ర పడింది.

 

- ఆకులలముల్నీ, కొమ్మ రెమ్మల్నీ, ఇతర వ్యర్ధాలనీ, చెత్తనీ పోగులు చేసి, ట్రాక్టరులో నింపుకొని చెత్త కేంద్రానికి తరలించినది మరికొందరు. 

 

- నలుగురు ఆద్యంతం చీపుళ్లతో ఊడ్చే సత్కార్యంలోనే ఉన్నారు. 

 

              6.00 వేళకు భానూదయ నేపధ్యంలో DRK గారు తీసి, వాట్సాప్ లో పెట్టిన పాగోలు రహదారి అందాన్ని అందరూ వీక్షింతురుగాక!

 

            దైనందిన కృషి సమీక్షా సమావేశంలో తమ స్వచ్ఛ శుభ్ర సౌందర్య సంకల్ప నినాదాలను ముమ్మారు వినిపించినది యువ కార్యకర్త రాజు గారు. 

 

            వీరబ్రహ్మం గారి గుడి, స్వచ్ఛ పరిశుభ్ర టాయిలెట్ల దగ్గరి పునః పారిశుధ్యం నిమిత్తం మనం రేపటి వేకువ కలువదగిన చోటు మహాబోధి స్కూలు మొదటి గేటు వద్ద.

 

            ఈ మహాత్ములకే ప్రణామం – 19

 

వేకువల స్వచ్చంద సేవలు బ్రహ్మ సమయపు సమావేశము -

హరిత వేడుక నిర్వహణలూ హ్లాదకర చర్చోపచర్చలు

అవసరార్ధమనేక చోట్ల విహార యాత్రల ప్రమోదమ్ములు

సాధ్యపరచిన స్వచ్ఛ సుందర సాహసికులకు నా ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

04.10.2021.