2245*వ రోజు ....           05-Oct-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!

 

పాగోలు బాటకు 14, చల్లపల్లి ప్రాంతానికి 2245* వ నాటి శ్రమ సందేశం.

 

            నమ్మక తప్పని యదార్ధం ఈ గ్రామ స్వచ్చంద శ్రమదాన ప్రస్థానం! మంగళవారపు (05.10.2021) వేకువ వేళ కూడ 4.21 కే పాగోలు దారిలో ప్రత్యక్షమైన ముకుళ హస్తాలతో సంసిద్ధులైన 17 మందీ, నాతో సహా తరువాత వచ్చిన ఆరుగురూ వెరశి 23 మందీ సాగించిన గ్రామహిత పరిచర్యలేమిటి? సాధించిన స్వచ్ఛ శుభ్ర సౌందర్యాలేమిటి? మాటల మర్మాలతో గాక, తమ క్రియాశీలక సందేశమేదైనా ఉందా? భ్రష్టు పడుతున్న సామాజిక చైతన్యానికీ, పరిసరాల స్వచ్ఛ శుభ్రతల లోపంతో అడుగంటుతున్న ప్రజారోగ్య దుస్థితికీ చల్లపల్లి స్వచ్చోద్యమం స్ఫూర్తి మంత్రం కాగలదా?...

 

            అసలిలాంటి అరుదైన సామాజిక చైతన్య ప్రబోధకమైన శ్రమదానానికి సమాజం నుండి, పంచాయితీల నుండి, ప్రభుత్వాల నుండి ఏపాటి అనుశీలన, ప్రోత్సాహం, గుర్తింపు లభిస్తున్నవి? ఎందరు సహృదయులు స్తబ్దతను వీడి, ప్రక్కింటి వాళ్లను కలుపుకొని తమ వీధి గ్రామ సంక్షేమానికి ముందుకొచ్చారు? ఏ అధికారుల, నేతల, దాతల, సామాజిక చింతనా పరుల క్రియాశీలక సహకారం ఏ మాత్రంగా లభించింది?... ఇవన్నీ ఇప్పటికి ప్రశ్నలే? సానుకూల స్పందన, సమాధానాలు దొరికినపుడే పరిష్కారాలు!

 

            స్వచ్ఛ కార్యకర్తలు ఈ పాగోలు బాటలో 14 రోజులుగా ఏమి సాధించారని కాక ఏమి చేయలేదని ప్రశ్నించుకోవడమే సబబు. నిల్వ మురుగు, దాని సిల్టు తోడి, లాగి మురుగును ముందుకు నడపలేదా? మోకాలి లోతు మురుగులో దిగి , వందలకొద్దీ తాటి టెంకల్ని బైటకు తీయలేదా? కరెంటు తీగలను సమీపిస్తున్న పెద్ద చెట్ల ఎత్తు కొమ్మల్ని తొలగించి, మహాగని 6, యర్ర తురాయి 12, అడివి తంగేడు 62, వేప 1 పూల మొక్కల్ని కొత్తగా నాటిందీ వీళ్లే!

 

            ఈ రహదారికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఆలోచించి, ప్రతి సూక్ష్మ లోపాన్ని సరిదిద్ది, స్వచ్ఛ శుభ్రతల్ని మప్పి, పూల పరిమళాన్ని, సౌకర్యాన్ని ప్రదర్శించి, పచ్చదనాల ఆహ్లాదాల్ని పంచేందుకు అంతకు ముందటి శ్రమ కాక క్రొత్తగా ఆరేడు వందల పని గంటలు శ్రమించింది స్వచ్ఛ కార్యకర్తలే!

 

            (ఐతే వీళ్ళకసాధ్యం ఒకే ఒక్కటి ఉండిపోయింది. ప్రతి వేకువ ఇన్ని చెమటలు కార్చి ప్రత్యంగుళాన్ని శ్రద్ధగా తీర్చిదిద్ది, ఏ పరిసర గ్రామస్తుల కోసం ఏ ప్రయాణికుల ఆహ్లాదం కోసం ఇంతగా తపించారో ఆ సమీప గృహస్థులు, బాటసారులు ఒక్కమారైనా చేతులు కలపలేదు!)

 

            6.20 వేళ మహాబోధి తొలి గేటు ఎదుట జరిగిన నేటి కృషి సమీక్షకు ముందు పలనాటి అన్నపూర్ణ ముమ్మారు ప్రవచించిన గ్రామ స్వచ్ఛ శుభ్ర సౌందర్య నీరాజన నినాదాలతోను, ఏలిన వారి చర్యలతో గ్రామ ముఖ్య చెత్త కేంద్రం కుంచించుకుపోతున్న వేదనతోను నేటి కార్యకర్తల 2 గంటల గ్రామ మెరుగుదల ప్రయత్నం ముగిసింది.

 

            ఇక రేపటి వేకువ మన పునర్దర్శన ప్రదేశం బండ్రేవు కోడు వంతెన.

 

 

            ఈ మహాత్ములకే ప్రణామం – 20

 

చల్లపల్లి స్వచ్ఛ చరితలు, కార్యకర్తల మనోరీతులు,

హరిత సుమ సుందర ప్రగతులు, అవార్డులు మరి ఆ రివార్డులు

మహానందపుటాది వారపు మంచి వార్తలు రాష్ట్రమంతట

వ్యాప్తి చేసిన స్వచ్ఛ సుందర కార్యకర్తకు నా ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

05.10.2021.