2246*వ రోజు .......           06-Oct-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!

 

చిన్న అవాంతరాల్ని అధిగమిస్తూ 2246* వ నాటి శ్రమవినోదం.

 

            స్వచ్ఛ కార్యకర్తలతో బాటే మేల్కొని, దబాదబా ఉనికి చాటుకొన్న వర్షం సాక్షిగా ముందనుకొన్నట్లు  కాక నాగాయలంక మార్గం బదులు నడకుదురు రోడ్డులో జరిగిన వేకువ కాల శ్రమదానం బాధ్యతగాను, ప్రయోజకంగాను, వేడుకగాను ముగిసింది. శ్రమదాన రంగస్థలం మార్పు వల్ల కొన్ని నిముషాలు వెనుకగా 24 మంది శ్రమదాతల కృషి మొదలయింది, 6.15 దాక విస్తరించింది.

 

            నడకుదురు బాటలో గ్రామ కేంద్రానికి కిలోమీటరు పైగా దూరాన - వాహనాలు నిలిపిన చోటు నుండి విజయవాడ మార్గం దిశగా కొనసాగిన స్వచ్చంద సేవల వివరాలు :

 

- రోడ్డుకు దక్షిణంగా పెద్ద చెట్ల కొమ్మలు కరెంటు తీగల్ని ముద్దాడబోతున్నాయని గ్రహించిన సుందరీకర్తలు బారు కత్తెరతో దంతెల సాయంతో కత్తిరించారు. ఆపనేదో ఒక ఉద్యోగ విధిగా కాక, మొక్కు బడిగా కాక సౌందర్యమయంగా నెరవేరడమే ఇక్కడ విశేషం!

 

- గత నాలుగైదు నెలల కాలంలో ఉత్తరం వైపున ఎంత గడ్డి, ఎన్ని పిచ్చి ముళ్ళ మొక్కలు, కంపలు, ప్లాస్టిక్ తుక్కులు, దిక్కుమాలిన చౌకబారు మద్యం సీసాలు, ఎక్కడివో ఎవరివో పాత గుడ్డ ముక్కలు ఇంకా ఎన్నెన్నో స్వచ్ఛ కార్యకర్తల కోసం ఎదురు చూస్తున్నాయి. 12 మంది కార్యకర్తలు 150 గజాల మేర గత నాలుగైదు మాసాల స్వచ్ఛ శుభ్రతా బకాయిలు తీర్చేశారు.

 

- పూల మొక్కల పాదులు సరిదిద్ది, అలవి మాలిన కొన్ని పెద్ద కొమ్మల్ని తొలగించి, గడ్డి చెక్కి, రహదారి అందానికర్ధం చెప్పారు మరికొందరు.

 

- దాని పాటి కది అడ్డదిడ్డంగా, అక్రమంగా పడి ఉన్న పెద్ద వృక్ష కాండాన్ని మోకులు కట్టి, లాగి, మరో పెద్ద చెట్టు కానించి, అరుగుగా మార్చారు(ఇది మందు బాబుల అడ్డా కాకుండు గాక!)

 

- రోడ్డుకడ్డంగా, లోతుగా గుంటపడి, చిన్న చెరువుగా నిల్చిన నీటిని ఒక కార్యకర్త శ్రద్ధగా ప్రక్కకు మళ్లిస్తున్న దృశ్యం చూశారా?

 

            ఇలా ఈ స్వచ్చంద శ్రమదాన విశేషాలు ఎంతగా చెప్పినా తరగవు. మరి ఈ నిస్వార్ధ నిర్వికల్ప పరోపకార పారీణతనే మన నుండి జాతిపిత ఆశించేది!

 

            ఈ శ్రమైక జీవన సౌందర్య సన్నివేశాన్ని ఈ గంటన్నర కాలపు కష్ట జీవుల చెమట సుగంధాన్ని మహాకవి శ్రీశ్రీ అత్యద్భుత కవితామయంగా కీర్తించింది!

 

            మన సమకాలంలో ఆసుమనోహర జీవన తత్త్వాన్ని ఈ మాత్రం ప్రదర్శిస్తున్న స్వచ్ఛ సైనికులకే నా సవినయ నివాళులు!

 

            నేటి ముగింపు సమావేశంలో మూడు మార్లు మనసా వాచా కర్మణా సొంత ఊరి పరిశుభ్ర స్వచ్ఛ సౌందర్య ఆకాంక్షా నినాదాలు పలికినది సజ్జా ప్రసాదు గారైతే ఈవానలో, బురదలో, నడకుదురు రహదారి సౌందర్య సాధకుల్ని అభినందించినది డాక్టర్ DRK. ప్రసాదు గారైతే హర్షామోదాలు తెల్పింది అందరూ!

 

            తన నెల చందా – 520/- సమర్పించినది కోడూరి వేంకటేశ్వర మహోదయుడు!

 

            రేపటి వేకువ మన కలయిక, శ్రమదాన వేడుక నడకుదురు మార్గంలోని రాజావెంచర్ దగ్గరే!

 

            ఈ మహాత్ములకే ప్రణామం – 21

 

దివారాత్రములదే చింతన గ్రామ సొగసుల కథే భావన

ఇందరిందరు కార్యకర్తలు సహకరించిన ఊరి పెద్దలు

ఉద్యమంబును నడపు నేతలు ఉండు గ్రామమె చల్లపల్లిని

పేరు తెచ్చిన వారి కెల్లను పేరు పేరున నా ప్రణామం! 

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

06.10.2021.

నడకుదురు రోడ్డు రాజా గారి వెంచర్ వద్ద