2247*వ రోజు....           07-Oct-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!

 

నడకుదురు రహదారి శుభ్ర – సుందరీకరణలో - 2247* వ నాడు.

 

            ఈ గురువారం వేకువ వేళ కూడ పాతిక మందికి పైగా స్వచ్ఛ – ప్రయత్నీకులు గుంటలు పడిన – డ్రైన్లలో ప్లాస్టిక్ దరిద్రాలు ప్రోగుబడిన – తమ కోసం నాల్గునెలలుగా ఎదురుచూస్తున్న – ఊరికి కిలోమీటరు దూరంగా ఉన్న నడకుదురు మార్గంలో చేసిన పరిశుభ్ర – సుందరీకరణం గుర్తుంచుకోదగినదే! తెలిసో – తెలియకో ఇంత అందమైన రహదారిని ప్లాస్టిక్ సంచుల్తో – ఇంట్లో పనికిరాని చెత్తలతో చెడగొట్టే సోదర గ్రామస్తులు తప్పక చూడదగిందే!

 

చక్కగా మురుగుపారవలసిన డ్రైన్లలో, రంగురంగుల పూలతో, పచ్చదనాలు పందిళ్ళువేస్తున్న రోడ్డు మార్జిన్లలో ఇంతటి ఆహ్లాదాన్ని – అందాన్ని ఆటంకపరుస్తూ – స్వచ్ఛ కార్యకర్తలకేరోజుకారోజు సవాలు విసురుతున్న చంఢాలపు కశ్మలాలింతగా రావడం వింతగా లేదూ? మన వంటింటి వ్యర్ధాల మొదలు ఫ్లెక్సీలకు, పాత గుడ్డలకు, తీసేసిన పరుపులకు గమ్యస్థానం రహదారులోలూ, మురుగు కాల్వలేనా?

 

రాష్ట్రం గర్వించదగిన, ఉదాహరణగా తీసుకోదగిన స్వచ్చోద్యమకారులీ చల్లపల్లిలో ఉండబట్టి సరిపోయింది. ఇంతకన్నా ఘోరమైన, భీభత్సమైన ఊరి మురుగు కాల్వల్నీ, శ్మశానాల్నీ వాళ్ళెన్ని మార్లు సంస్కరించలేదు గనుక! అందుకని వాళ్ళు వేలాది రోజులుగా పాటుబడుతున్నట్లే ఈ వేళ కూడ :

 

- కరెంటు తీగలకు తగిలే అవకాశమున్న కొన్ని చెట్ల ఎత్తు కొమ్మల్ని సౌకర్యకరంగాను, సుందరాకృతిగాను కత్తిరించిన వాళ్ళు,

 

- తామే నాటి పెంచి, పూయించిన వివిధజాతుల – రంగురంగుల పూల మొక్కల్ని పరామర్శించి, అవసరమైతే కంపకట్టి, పాదుల్ని సవరించి, అక్కడి కలుపు తీసిన శ్రమదాతలు,

 

- మురుగు కాల్వ నుండి ఎన్నెన్నో వ్యర్ధాలను, ఫ్లెక్సీలను, కొబ్బరి బొండాల మిగుళ్ళను, ఇతర ముదనష్టాలను పంతంగా బైటకు లాగి కుప్పలు పెట్టిన స్థిత ప్రజ్ఞులు,

 

- బాటను, దాని అంచుల్నీ చీపుళ్లతో ఊడ్చి ఆనదించినవారు,

 

- ఠంచనుగా ఎప్పటి కసవును, ఖాళీ సీసాల గుట్టల్ని, అప్పుడే ట్రాక్టర్ లోకెక్కించిన బాధ్యులు....  

 

        ఇవన్నీ నిత్య నూతన కథలే గాని, జవహర్ యువ కేంద్రానికి చెందిన యువతి మౌనిక  ఇక్కడి పర్యావరణ శత్రువులైన ప్రతి ప్లాస్టిక్ వస్తువును, కట్టలు కట్టి, కార్యకర్తల సాయంతో చెత్త కేంద్రానికి చేర్చిన వైనం ఇవాల్టిదే!

 

        6.20 సమయంలో ఈ విశిష్ట గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సాధనా సందేశ నినాదాలను ముమ్మారు నినదించిన స్వచ్చోద్యమ ధీరురాలు డా. పద్మావతి గారు.  

 

        రేపటి వేకువ మన అవసరం చెత్త కేంద్రానికున్నందున మన పునర్దర్శనం శ్మశాన స్థలి ప్రక్క చెత్త సంపద కేంద్రమే!

 

            ఈ మహాత్ములకే ప్రణామం – 22

 

ముక్కు మూసీ – కనులు వాల్చీ – మొకం త్రిప్పుచునడుచు దారులు

హరిత సంభృత – పుష్ప నిర్భర – హ్లాదకారక బాట లైనవి

ఊరిలోనివి ప్రవేశించే ఏడు దారులు పూల వనములె

ఈ మహత్పరిణామ కారకు లెల్లరకు మా తొలి ప్రణామం!

  

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

07.10.2021.