2249*వ రోజు.......           09-Oct-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!

 

గ్రామ స్వచ్చోద్యమ ప్రస్థానంలో 2249* వ అడుగు.

 

            శనివారం బ్రహ్మ ముహూర్తానికి ముందే 4.20 సమయం! అది నీరవ నిశ్శబ్ద శ్మశాన ప్రాంగణం! ఉభయ దిశల్లో చక్కటి దహన వాటికలు! మరి, 24 మందికి ఇక్కడ ఏ రాచకార్యం తటస్థించి వచ్చి చేరారు? ఇంకో ప్రక్కన కీర్తి శేషించిన వాళ్లకు వీడ్కోలు పలుకుతున్న అంతిమ సమయ వాహనం! అప్పుడు అక్కడ 2 గంటల పాటు ఈ కార్యకర్తలు సాధించినదే పరమార్థం? శుష్క ప్రసంగాలు కాక - ఆదర్శ క్రియా పూర్వకంగా చాటినది ఏ సందేశం?...

 

            ఈ ప్రశ్నలకు సమాధానం వెదకే ముందుగా ఏడేళ్ళ నాటి ఈ చిల్లల వాగు గట్టుమీది దుర్భర – దుర్గంధ - చిట్టడవిని గుర్తు చేసుకుంటే - ఒళ్ళు గగుర్పొడుస్తుంది! కాలం చెల్లిన తమ బంధు మిత్రుల్ని చేర్చే శ్మశానమూ అదే, సిగ్గుమాలిన బహిర్భూమీ అదే! ఆరేడువేల పని గంటల కార్యకర్తల నమ్మ శక్యంగాని కఠోర శ్రమదానంతో లక్షలాది వ్యయంతో గదా-ఇంతటి సుమసుందర – సుస్యందన - సుమనోహర రుద్రభూమి ఈ చల్లపల్లికి దక్కింది?

 

            మళ్ళీ ఈ వారంలో అదే సన్నివేశం పునరావృతం! పాతికమంది స్వచ్ఛ కార్యకర్తలు శవాల దిబ్బల నడుమ, పైన పిచ్చి మొక్కల్ని పీకి, చుట్టూ చెట్లను సుందరీకరించి, కంచె వెదుళ్లను క్రమ బద్ధీకరించి, తమ లోగిళ్ళను సుభ్ర పరచినంత శ్రద్ధగా నలుగురు మహిళలు చీపుళ్ళతో ఊడ్చి, పూల మొక్కలకు కూడా క్రమశిక్షణ మప్పి, ఆ అరెకరం శ్మశానంలో 100 నిముషాలకు పైగా చేసిన స్వచ్ఛ – శుభ్ర - సౌందర్య విన్యాసాలు ప్రశంసనీయాలు.

 

            బూడిద కళ్ళాల నడుమ, హైందవేతర శవాల దిబ్బల మధ్య, వీళ్ళేమైనా భయంతో-బెరుకుతో-ఆ బాల్యంగా మనస్సులో గూడు కట్టుకొన్న సెంటిమెంట్ల తో పని చేశారనుకునేరు! - మన ఈ కృషి ఈ గ్రామం నుండి నిష్క్రమించిన ఆ పెద్దలకు మన పునర్నివాళిఅని ఒకరూ, “ ఈ దిబ్బ క్రింద నిద్రించిన వ్యక్తి యొక్క స్వర్గంలోని అడ్రెస్ కనుక్కొని ఇంకోమారు వీడ్కోలు పలుకుతున్నాం గదా!అని మరొకరూ జోకులు పేల్చుకుంటూ, సరదాగా సాగిన స్వచ్ఛ – శుభ్ర - శ్మశాన క్రీడ ఇది!

 

            ఈ మహత్కృషికి సమాంతరంగా దక్షిణ భాగంలోని స్వచ్ఛ - శుభ్రదహన వాటిక ప్రాంగణాన్ని మళ్ళీ చూడాలనిపించే విధంగా సుందరీకరిస్తున్న-కత్తెర్లతో - పారలతో - డిప్పలతో కృషి చేస్తున్న సన్నివేశం సైతం గమనార్హమే !

 

            వెనకటికి - (950 ఏళ్ల క్రితం) తాళ్ళపాక అన్నమయ్య అనే స్వచ్ఛ తెలుగు వాగ్గేయ కారుడు - చిన్ని కృష్ణ భగవానుణ్ణి ఇలా వర్ణించాడు:

 

ముద్దు కారే యశోద ముంగిటి ముత్యమూ వీడు...

మరి అలాంటిది-ఇన్నివేల రోజులుగా ఊరి వీధుల్ని, కార్యాలయాల్ని, బడుల్ని,గుడుల్ని, బస్ ప్రాంగణాల్ని, ఊరి చుట్టూ 7 రహదారుల్ని, మురుగు కాల్వల్ని, పంట కాల్వల్ని, రోడ్ల గుంటల్ని ఊడ్చే బాగు చేసే- సుందరీకరించే - ఆఖరికి శ్మశానాన్ని, చెత్త కేంద్రాన్ని సైతం తీర్చిదిద్దే స్వచ్ఛ కార్యకర్తను

ఎప్పుడో ఈ చల్లపల్లి చేసుకొన్న పుణ్యము వీడు

గ్రామ బాధ్యత నిత్యం మోసే కర్మ వీరుడు కాడా ఇతడు...

అని నేను కీర్తించకూడదా?

 

6.25 వేళ - బడిలో పిల్లలకు పాఠాలు, గ్రామ సామాజికుల కేమో స్వచ్ఛ బాధ్యతలూ నేర్పగల ఒక పంతులమ్మ - లంకే సుభాషిణి ముమ్మారు ఊరి స్వచ్ఛ – శుభ్ర - సౌందర్య సంపాదక నినాదాలు ప్రకటించడంతో మన శ్మశాన బాధ్యతలు రేపటికి వాయిదా పడ్డాయి.

 

కనుక-రేపటి వేకువ సైతం మన పునర్దర్శన వేదిక చిల్లలవాగు దగ్గరి రమణీయ శ్మశానమే!

 

         త్యాగ మహితులకే ప్రణామం 24

 

యువక మిత్రులు - ఉపాధ్యాయులు - యువతులూ, విద్యార్ధులిందరు

కలిసి కట్టుగ - ఊరి మెరుగుదలకై శ్రమించుట కనుల పండుగ

ఐక మత్యమె మహాబలమని - కలిసి సాగితె గెలుపు సులువని -

ఋజువు చేసిన స్వచ్ఛ సుందర వీరులకు నా తొలి ప్రణామం!

              

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

09.10.2021.