2250 *వ రోజు ....           10-Oct-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!

 

ఊరి శుభ్ర-సుందరీకరణ ప్రక్రియలో 2250* వ ప్రయత్నం.         

            ఆదివారం (10.10.2021) నాటి చెత్త కేంద్ర క్రమబద్ధీకరణకు 4.30 వేళ 17 మంది, కొద్ది వ్యవధిలో అంతేమంది – (ఇందులో ఇద్దరు ట్రస్టు సంబంధీకులు) చూపిన 2 గంటల తెగువతో అంతకు ముందు మూసుకుపోయిన సిమెంటు బాట, దాని పార్శ్వాలు ఒక కొలిక్కి వచ్చినట్లే. 34 మంది శ్రమదాతలకు సమస్యల్లా – ముక్కులు మూసుకొన్నా ఊపిరితిత్తుల్లో చొరబడుతున్న దుర్మార్గపు దుర్గంధమే! కేవలం ఈ 2 గంటల పనికి మనిషికి వెయ్యి రూపాయిలిచ్చినా ఈ రోజుల్లో ఎవరైనా సిద్ధపడతారా అనేది చెప్పలేం! వస్తే గిస్తే-ఇంత ఇష్టపడి, ఇంత శ్రద్ధగా చేయరనేది నిజం!

            ఇక్కడ డబ్బును కాదు-అంతకన్న విలువైన సమయాన్నీ, శారీరక శ్రమనూ ఉన్న ఊరి కోసం దానం చేయడమే విశేషం! ఇన్ని వేలరోజులుగా-రెండు లక్షలకు పైగా పని గంటల శ్రమ త్యాగం ఈ సాధారణ వ్యక్తులు ఏ తాత్త్విక సంపదతో చేసేస్తున్నారో ఆలోచించదగిన విషయం! రికార్డుల కోసం- మీడియాలో ప్రచారం కోసం-సమాజంలో గుర్తింపుకోసం- ఇంకా ఇతర మెర మెచ్చుల కోసం ఆశించేదైతే – ఈ గ్రామ శుభ్ర-స్వచ్చోద్యమం ఏ వంద రోజులకో చాప చుట్టేసేది. కాల పరీక్షకు నిలిచి, అర్థం లేని అవహేళనల నెదుర్కొని, ఇంత కాలం ఇది నిలిచింది మరి!

            నిన్న జె.సి.బి. రోడ్డు ప్రక్కల పెద్ద చెత్త గుట్టలు కొన్నిటిని కదిల్చింది గాని, వాటిని మరింత ప్రక్కలకు జరిపి, కంటికింపుగా, చెత్త బళ్ల రాకపోకలకనువుగా సర్దింది మాత్రం స్వచ్చ కార్యకర్తలే. అందు కోసం కొందరు దంతెల్ని ప్రయోగిస్తే, కొందరు చీపుళ్లకు పని చెపితే, మరికొందరు గోకుడు పారలతో బాటను గోకి, అది సిమెంటు రోడ్డే అనిపించారు. చేతుల్తోనే ఆ దుమ్మును, తడి మట్టిని డిప్పల కెత్తి, కొందరు రోడ్డు ఆకృతికి మెరుగులు దిద్దడం కూడ గమనించాను.

            అసలిదేమన్నా వాళ్ల ఇల్లా? ఇంటి ఆవరణా? నిత్యం నడిచే ఇంటి ముందరి రోడ్డా? కనీసం ఇరుగుపొరుగు వారి శుభ కార్యపు ఇల్లైనా కాదే!  కేవలం శ్మశానం ప్రక్కన డంపింగ్ కేంద్ర మార్గం! ఇందులో ప్రతి కార్యకర్తా స్వయం ప్రేరిత-స్వయం నిర్ణయం తో ఇంతటి మురికి పనికి రావడం తప్ప, ఎవరూ బొట్టు పెట్టి పిలవ లేదు-చల్లపల్లి స్వచ్చ-సుందరోద్యమ మంటే ఇదే మరి!

            6.25 నుండి జరిగిన సమీక్షా సందర్భంలో:

 

- నిన్న మన స్వచ్చోద్యమ సారథులు కలెక్టరు గారికి డంపింగ్ కేంద్రాన్ని ఆనుకొని కట్టుతున్న ఇళ్ల గురించి చేసిన విన్నపము,

- ఈనాటి కార్యకర్తల కష్ట సాధ్యమైన చెత్త కేంద్ర క్రమబద్ధీకరణమూ చర్చకు వచ్చాయి.

 

             దురదృష్టవశాత్తు నిన్న మరణించిన 68 ఏళ్ల పిన్నిగంటి సీతారామయ్య గారి  సంతాప ప్రస్తావనా,

 

            స్వచ్చ కార్యకర్త లక్ష్మణ రావు గారికి జరిగిన శస్త్ర చికిత్స, అతనికి కార్యకర్తలందరి అనునయపూర్వక అభినందనలూ,

స్వచ్చ యార్లగడ్డ కార్యక్రమం నాటి వేముల శ్రీనివాస్ గాయం నుండి కోలుకుంటున్న మంచి వార్తా, వంటివి తెలిశాయి.

 

            గత నెలకు గాను మనకోసం మనం ట్రస్టు జమా ఖర్చులు, లోటు సంగతి నివేదించబడ్డాయి.

 

            బాల కార్యకర్త దేసు జాహ్నవి పరిణతి సందర్భంగా ప్రభాకర రావు గారు కార్యకర్తలకు జ్ఞాపికలందజేశారు.

 

            తన కుటుంబం పక్షాన పల్నాటి అన్నపూర్ణ ట్రస్టుకు అందించిన 5000/- విరాళానికి మన అందరి కృతజ్ఞతలు.

 

బుధవారం నాటి వేకువ మనం కలుసుకోవలసింది కూడ చెత్త సంపద నిర్మాణం దగ్గరే!

 

       ఈ మహాత్ములకే ప్రణామం – 25

 

వారు వీరను భేద మెంచరు- వ్యర్థ ప్రస్తావనలు చేయరు

రాజకీయపు రంగు లుండవు- రచ్చ రాచ్చా వేశముండదు

కేవలం గ్రామాభ్యుదయమే- కేవలం ఒక మనః తృప్తికె

కట్టుబడి కృషి చేసి గెలిచిన కార్యకర్తకు తొలి ప్రణామం!                       

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

10.10.2021.