2251* వ రోజు....           13-Oct-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!

 

2251* వ నాటి స్వచ్చోద్యమ కథనం.

 

బుధవారం (13-10-21) వేకువ 22 మంది సచ్ఛంద కార్యకర్తల 100 నిముషాల స్వేద పూర్వక శ్రమదానంతో చెత్త కేంద్ర రహదారి కిరువైపుల గల సిమెంటు రోడ్లు, వాటి పరిసరాలు మరి కొంత పరిశుభ్ర - సౌందర్య శోభను సంతరించుకొన్నాయి. వీటి దగ్గర కూడ ముఖ్యంగా దక్షిణపు రోడ్డు దగ్గర ఒళ్ళు జలదరించే దుర్గంధం లేకపోలేదు. ఈ కంపే కార్యకర్తలకు ఇంపనుకొనేరు, గ్రామ మెరుగుదల పట్ల వాళ్ల అంకితభావాన్ని ఏ పూతి గంధమూ అడ్డుకోజాలదని మాత్రమే ఈ సన్నివేశం చాటుతుంది!

 

          వందేళ్ల జీవన పరిధిలో మనిషి ఏం సాధించాడనీ, వేల యేళ్ల చరిత్ర ఉన్న చల్లపల్లి ఘనత ఏమిటనీ-యుగయుగాలుగా మానవ సమాజ పురోగమనం ఏం ఋజువు చేసిందనీ ఆలోచిస్తే, ఏ గర్వ కారణం కనిపిస్తుంది? పెద్దకడివెడు పాలమీద చిన్న పిడికెడు మీగడ చేరినట్లు - తప్పొప్పులు దాటి, వంకరటింకరల్ని సరిదిద్దుకొని, సామాజిక గమనం ఎంతోకొంత మంచి వైపే అడుగులేసిందనిపిస్తున్నది. మైలు రాళ్ళులాగా అప్పుడప్పుడు కొన్ని ఉద్యమాలు తలెత్తడమూ, ఆ అడుగుల్ని కొంత తొందరించడమూ చూడవచ్చు. అలాంటిదే ఇప్పటి 2251* దినాల చల్లపల్లి స్వచ్ఛ - సుందర ఉద్యమం!

 

          ఎందుకంటే ఈ నిర్నిబంధ స్వచ్చోద్యమానికి పునాది స్వార్థచింతన కాదు, త్యాగచింతన! రోజుకొకటి రెండు గంటలు గ్రామస్తుల సౌకర్యకల్పన కోసం, స్వస్తత కోసం చిత్తశుద్ధితో పాటుబడడమే దీని ప్రత్యేకత! దీనికి ఇవాళటి తాజా ఋజువులేమంటే :

 

- ఆటోనగర్‌ గేటు వైపున్న సిమెంటు బాటను, పరిసరాలనూ ఆరుగురు స్వచ్ఛవీరులు, ఇద్దరు మహిళా కార్యకర్తలు దారుణ దుర్గంధం నడుమనే గడ్డి కోసి, చీపుళ్లతో ఊడ్చి, “ఔరా!" అనిపించేంతగా బాగుచేయడం.

 

- చిల్లలవాగు గట్టుకు చేర్చే రెండో దారిని, దాని ప్రక్కలనూ 10 మంది గడ్డి, పిచ్చిమొక్కలు, తొలగించడం, డంపింగ్ వైపున్న ప్రహరీలాంటి వెదురు కుదుళ్ల కొమ్మల్ని అవసరంమేర నరికి, ఆ బాటకు మరింత శుభ్ర శోభను తేవడం.

 

          డంపింగ్ యార్డుకు ఇంత శ్రమ ధారపోయడం - చాల మంది దృష్టిలో నిరుపయోగ ప్రయత్నమనిపిస్తుందేమోగాని, 6.00 వేళలో అద్భుతమైన చెత్త సంపద పరిసరాన్నీ, 3 రోడ్ల కనువిందు చేస్తున్న దృశ్యాన్నీ ఒక్కసారి పరిశీలిస్తే - అలా అనిపించదు!

 

          నేటి కృషి సమీక్ష వేళ ముమ్మారు గ్రామ అభ్యుదయ సంకల్పాన్ని నినదించినది డాక్టరు మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారైతే - చల్లపల్లి ప్రధాన వీధుల గుంటల దుస్థితినీ, బాగుచేసే ప్రయత్నాన్నీ వివరించినది డాక్టర్ DRK ప్రసాదు గారు. గోపాలకృష్ణయ్య గారి 2,000/-  నెలవారీ విరాళానికి కృతజ్ఞతాపూర్వక స్వాగతం!

 

          రేపటి వేకువ మన శ్రమదాన గమ్యం ఈ చెత్త కేంద్ర – చెత్త సంపద కేంద్ర సమీపమే!

 

             ఈ మహాత్ములకే ప్రణామం – 26

 

ఒక వినోదమొ - ఒక ప్రచారమొ -  మరో లబ్దికొ ఆశ చెందక

సమాజం యెడ బాధ్యతగనే స్వచ్ఛ సంస్కృతికై తపించే -

స్వార్థ రహితోద్యమంలో తమ పాత్ర చక్కగ నిర్వహించే –

విజృంభించే – విక్రమించే - వీరులకు చేస్తాం ప్రణామం!

                          

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

13.10.2021.

గోపాలకృష్ణయ్య గారి 2,000/- నెలవారీ విరాళానికి కృతజ్ఞతాపూర్వక స్వాగతం!