2253* వ రోజు....           15-Oct-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు!

 

విజయ దశమి - 2253* నాటి శ్రమదాన వీరం!

 

సాంప్రదాయకమైన పెద్ద పండుగ వేకువ కాలాన గూడ 24 మంది స్వగ్రామ హితకారులు తమ సామాజిక కర్తవ్యాన్ని మరువలేదు. అదెక్కడంటే - కంపు గొట్టే ఊరి చెత్త కేంద్రం దగ్గర! ‘Cleanlyness is next to Godlyness’ అని ఇంగ్లీష్ వాళ్లనానుడి. ‘దైవం మానుష రూపేణ' అని భారతీయుల నమ్మకం. దైవత్వానికి ప్రతిరూపం స్వచ్ఛ శుభ్రతలైతే – 2253* రోజుల ఒరవడిలోనే - ఈ పెనుపండుగ బ్రహ్మముహుర్తాన ఊరి పరిశుభ్ర సౌందర్యారాధన చేసిన స్వచ్ఛ కార్యకర్తల్ని దైవ ప్రతినిధులని సమన్వయించగూడదా?

 

            అసలు డంపింగ్ కేంద్రాన్ని సైతం సంస్కరించబూనుకొనే తెగింపో - కఠినతర బాధ్యతో- కొందరనుకొనేట్లుగా  స్వచ్చోద్యమ వ్యసనమో - వీళ్ళ కెలా వచ్చింది? ఏ తాత్త్విక సంపద వీళ్ల వెనకాల నుండి నడిపిస్తున్నది? ఎంత అమూల్యమైన రోజువారీ ప్రతిఫలం వీళ్లందుకొంటున్నారు? దూషణ – భూషణ -  తిరస్కార - పురస్కారాల కతీతంగా ఈచెత్త కేంద్ర దుర్గంధంలో, మురుగు కాల్వల కంపులో ఇన్నేళ్లు పనిచేసే మానసిక స్థిరత్వం ఎలా సాధించారు?

 

            సుమారు 2 గంటల - అందరూ కలిపి 45 పనిగంటల పాటు ఈ శుభోదయంలో వీళ్లేమి సాధించారంటే:

 

- చెత్త కేంద్రానికి పడమర 10 - 15 సెంట్ల ఖాళీ స్తలాన్ని - రాతిముక్కలు ఏరి, ప్లాస్టిక్ తుక్కులు ఊడ్చి, ఎగుడు దిగుడులు సమం చేసి, దాన్నొక సాగు మడిచెక్కగా మార్చింది ఏడెనిమిది మంది. ఐతే ఇది చెప్పినంత సులభసాధ్యం కాలేదు. కొన్ని కాంక్రీటు దిమ్మెల్ని మలాటుతో పగలగొట్టి, రాతి ముక్కల్ని ఏరితే ఇప్పుడు కంటికి కనిపిస్తున్న ఈ ప్రతిఫలం!

 

- నాడెప్ పిట్ల రెండు ప్రక్కలా - మాస్కుల్లో దూరుతున్న కంపుకు వెరవక సుందరీకరణ బృందం ఎంతగా పాటుబడితే ఆ పరిసరం ఇంత చూడచక్కగా ఉందో ఊహించండి.

 

- దీనికి దక్షిణంగా పలుగుల్తో - పారల్తో - దంతెలతో - కత్తులతో గడ్డినీ, పిచ్చి కంపనూ తొలగించగా ఇప్పుడున్న ఈ స్వచ్ఛ - శుభ్ర - పొందికల వెనుక ఎంత శ్రమ దాగిఉన్నదో గమనించాలి.

           

            విజయదశమి నాటి స్వచ్ఛ - సుందర కృషిలో ఒక అపశృతి - శివ బాబు ఎడమ కాలికి కత్తి తగిలితెగిపోవడం. (అతని దృష్టిలో ఇదొక ఆటంకమేకాదు, కట్టు కట్టించుకొని, ఇంటికెళ్లి పడుకోలేదు – వెంటనే పనిలోదిగి చివరిదాక బాధ్యత వదల్లేదు!)

 

            6.25 కు హీరో షోరూం అధినేత దాసరి శ్రీనివాసరావు కార్యకర్తల ద్విచక్ర వాహన నిర్వహణా మెలకువలు తెలిపి, ఊరి స్వచ్ఛ – పరిశుభ్ర – సౌందర్య సంకల్పాన్ని ముమ్మారు ప్రకటించారు. ప్రస్తుతం గుజరాతు నివాసి – ప్రాతూరి శంకర శాస్త్రి గారి తరపున అందరూ కేకు సంచులందుకొన్నారు.

 

            రేపటి వేకువ కూడ మన బాధ్యతా నిర్వహణకు పూనుకోవలసిన చోటు చెత్త సంపదకేంద్రమే'.

 

             ఈ మహాత్ములకే ప్రణామం 28

ఎందరెందరొ మహామహులిట ఇతః పూర్వమె వెలసి నారని –

మార్గ దర్శన చేసినారని - మహత్తర కృషి సల్పినారని

వారి అడుగుల జాడలందే మనం ముందుకు సాగుదామని

తెలివి గలిగిన స్వచ్ఛ సుందర ధీరులకు ఈ తొలి ప్రణామం!

                         

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

15.10.2021.