2256*వ రోజు.......           20-Oct-2021

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి ?

 

పాతిక మంది మదాన వీరుల 2256* వ నాటి ఆదర్శం.

 

అది బుధవారం – వేకువ. బ్రహ్మ ముహుర్తానికి ముందే - 4.23 సమయం! సమీకృతులైన స్వచ్ఛ సైనికులు 25 మంది! ఎక్కడో కాదు - అన్యులకు భీతి గొలిపే – చాలా గ్రామాల్లో భీభత్స రస ప్రధానంగా మిగిలిపోయే రుద్రభూమి! చిరకాలంగా తాము నమ్మిన సత్సంకల్పం కోసం - శ్మశాన, పరిసర పరిశుభ్ర – స్వచ్ఛ - సౌందర్య సమీకరణా కృషిలో పాటుబడింది సుమారు 50 పనిగంటలు. తమకు సంతృప్తికరంగా వాళ్లు సాధించినది –

 

1) ప్రేత భూమిలో మరింత పరిశుభ్రత,

 

2) చిల్లలవాగు వంతెన దాటి వక్కలగడ్డ దిశగా రహదారి స్వచ్ఛత!

 

            ఇందరు స్వచ్ఛతా ప్రియులతో వేలాది దినాలుగా సహచరించిన తర్వాత.. లక్షలాది స్వార్ధరహిత పనిగంటలకు సాక్షిగా ఉన్న నాకు అర్థమౌతున్నదేమంటే – ఈ స్వచ్చోద్యమకారులు ఇంకా ఎన్నేళ్లయినా ఉన్న ఊరి స్వస్తతా ప్రయత్నం మాననే మానుకోరనీ - అలామాని ఇంట్లో పడుకోవడం ఇక వాళ్ల వల్ల అయ్యే పని కాదనీ!

 

            ఎందుకంటే - వీరిలో తీరికలేని ఇంటి బాధ్యతల్ని ఏరోజుకారోజు కాస్త ప్రక్కకు పెట్టి - రెండు గంటలు కాకున్నా – ఒక్క గంటైనా ఇక్కడ శ్రమించి తొందరగా ఇంటికి చేరే గృహిణులున్నారు. తమ ఇతర వ్యాపకాలకన్న, దినచర్యలకన్న, కొన్ని రాచకార్యాలకన్న ఈ స్వచ్చంద శ్రమదానమే ముఖ్యమనీ – మేలనీ నిశ్చయించుకొన్న పెద్దలున్నారు. తమ పించన్లను, సంపాదనల్ని స్వచ్చోద్యమానికే  వ్యయిస్తున్న వ్యక్తులున్నారు. కనుక ఈ స్వచ్చోద్యమ చల్లపల్లి ప్రస్థానం మరొక దశాబ్దం కూడ ఇలా సాగగలదనే నా నమ్మకం!

 

ఇదేదో ఈ 30 - 40 మంది రోజువారీ  శ్రమదానమే అనుకొనేరు! స్వదేశీ విదేశీ హితాభిలాషుల అన్ని రకాల అండదండలూ ఈ ఉద్యమానికున్నవి. నిన్నటికి నిన్న - దివంగత వణిక్ప్రముఖులు - వరదా రామారావు గారి సాంవత్సరిక సంస్మరణ సందర్భంలో - అక్కడికక్కడ కుటుంబ సభ్యుల సద్యః సంకల్పంగా 32,001/- మనకోసం మనం ట్రస్టు నిర్వాహకులకు అందినవి! ఇలా ఇంకెందరి ప్రత్యక్ష - పరోక్ష సహకారాలతోనో గదా ఈ సుదీర్ఘ ఉద్యమం ముందుకు పోతున్నది!

 

- వేకువ సమయంలో ఇంటి నుండి బైటపడి, శ్మశానంలో - చెత్త కేంద్రంలో 15 రోజులుగా శ్రమిస్తున్న గృహిణీమతల్లులకూ-

 

- చిల్లలవాగు వంతెన దగ్గర చెట్లను నీటిలోనే పొడవాటి నిచ్చెనలెక్కి సుందరీకరిస్తున్న, సాహసిస్తున్న బాధ్యులకూ –

 

- వంచిన నడుమెత్తకుండ, వక్కలగడ్డ గ్రామ పరిధిలో - ముఖ్యంగా విజయవాడ రహదారి పడమర భాగాన్ని కత్తులతో - దంతెతో తీర్చిదిద్దిన ముగ్గురు రైతు మహాశయులకూ –

 

            ఒక్క మాటలో- పేరు పేరునా ప్రతి కార్యకర్తకూ - అమాయకులమైన, చేతనా రహితులమైన కొందరు గ్రామస్తులం బుణపడుతూనే ఉంటాం!

 

            6. 30 వేళకు నేటి కృషి సమీక్షకు ముందు - కొద్దిపాటి విరామం తర్వాత మరల నేడు శ్రమదానం పాటించిన కోడూరు వేంకటేశ్వరరావు గారు ముమ్మారు నినదించిన త్రివిధ సంకల్పాలతో నేటి కృషి పరిసమాప్తి!

 

            రేపటి వేకువ సైతం మన శ్రమ వేడుక గమ్యం చిల్లలవాగు వంతెనే !

 

          ఈ మహాత్ములకే ప్రణామం  30

 

తమవి సేవలు అసలు కావని - బాధ్యతలు మాత్రమే అనుకొని

వినమ్రంగా స్పష్టపరచి వివేక మార్గం అనుసరిస్తూ

శుభ్ర - సుందర సొంత గ్రామం చూచుటకు తహతహలు చెందే

స్వచ్ఛ సుందర కార్యకర్తల స్వచ్ఛ మనసుకి నా ప్రణామం!

                      

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

20.10.2021.