2259* వ రోజు....           23-Oct-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి?

 

ఊరి శుభ్ర సౌందర్య స్వస్తతా సాధనలో 2259* వ నాడు

 

గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమానికి గర్వకారణంగా (?) –

 

28000 వేల ప్రజలకు గాను 28 మంది - వేకువ 4.20 కే ప్రధాన వీధి పారిశుద్ధ్య సౌందర్యాల కోసం సంసిద్ధులయ్యారు. తదాదిగా - 6.10 వేళ దాక చిన్న కార్ల షెడ్డు - 3 రోడ్ల సెంటరుల నడుమ నెలకొన్న పరిశుభ్రతకూ, రేపు చేయవలసిన రహదారి భాగానికీ వ్యత్యాసాన్ని వాట్సాప్ ఛాయా చిత్రంలో గమనించండి. వీలైతే ఈ ఏడెనిమిదేళ్ల స్వచ్చోద్యమ సుందర చల్లపల్లికీ - వందల, వేల ఇతర గ్రామాలకూ ఏ తేడా ఉందో కూడా గుర్తించండి!

 

            ఔను - నిజం! విజ్ఞతా - చైతన్య గ్రామమనే పేరున్న - 28 వేల సంఖ్యాబలమున్న మన మహత్తర గ్రామం నుండి కర్తవ్య నిర్వహణకు కదలివచ్చింది 28 మందే! మళ్ళీ ఇందులో పొరుగు గ్రామాల నుండి, జిల్లా నుండి ప్రాతినిధ్యం ఉంది సుమా! ఐతే - మరో కోణం నుండి చూస్తే ఈ కొద్దిమందే అసంఖ్యాక గ్రామాల మీద చూపిన ప్రభావము కూడా తక్కువేం గాదు!

 

            పిట్టకొంచెం - కూతఘనం. ఈ అల్ప సంఖ్యాక కార్యకర్తల అభినివేశం, చాకచక్యం, ఉత్సాహం, ఈ నాటి 50 పనిగంటలలో సాధించిన గ్రామ పారిశుద్ధ్యం తక్కువేమీ కాదు! అందుకు సాక్ష్యం ట్రక్కుల కొద్దీ ఉడ్చి, డిప్పలతో నింపిన దుమ్ము ఇసుక - ఖాళీ సీసాలు రకరకాల ప్లాస్టిక్ తుక్కులూ!

 

            దీన్నే కాస్త తిరగేసి ఆలోచిస్తే నిత్యం మనం నడిచే ఈ అందమైన గ్రామ రహదారుల్ని ఇంతగా కశ్మలమయం చేసి, పాతిక మందికి పైగా కార్యకర్తలకు ముమ్మరంగా పనికల్పించే సత్తా, సామర్థ్యంలో మన చల్లపల్లి మాత్రం ఏ ఇతర గ్రామం కన్న బొత్తిగా వెనుకబడి లేదే! పొరుగూళ్ల నుండి - ఎక్కడో తణుకు నుండి - వచ్చి, తమ ఊరి శుభ్ర -సౌందర్యాలకు వేలాది దినాలుగా పాటుబడుతున్న వాళ్లను చూసి కూడ తాము మాత్రం ప్రయత్నించని నిబ్బరం ప్రస్తావనార్హం కాదా?

 

            అదేపనిగా గూళ్ళునొప్పి పట్టేంతగా చీపుళ్లతో ఇన్ని షాపుల - బంకుల గుడుల - బేకరీల మట్టినీ, ఇసుకనూ, ఇతర వ్యర్ధాలనూ ఊడ్చే ఇందరు శ్రమదాతలను చూస్తున్నప్పుడు - ముఖ్యంగా బ్యాంకు ముంగిటి మురుగు కాల్వను బాగుచేసే దృశ్యంతో నాకు మాత్రం తనువూ మనసూ పులకిస్తున్నది!

 

                        ఎందరెందరో గ్రామ పారిశుద్ధ్య పర్యవేక్షకులకు భిన్నంగా చల్లపల్లి జనం స్వస్తతకు ఎంతగానో అంకితుడైన సుధాకర్ 6.25 సమయంలో ఊరి స్వచ్ఛ శుభ్ర సౌందర్య స్ఫోరక నినాదాలు ప్రకటించారు.

 

            ఈ నాటి కార్యకర్తల శ్రమదాన వేడుకకు ఒక సీనియర్ పాత్రికేయుడు సాక్ష్యంగా నిలిచారు.

 

            రేపటి గ్రామ సామాజిక బాధ్యతా నిర్వహణకై మూడు రహదార్ల కేంద్రం దగ్గరే మనం కలుసుకోవలసి ఉన్నది.

 

            ఈ మహాత్ములకే ప్రణామం – 33

 

గతం తెలిసీ, వర్తమానపు గంద్రగోళం గుట్టెరింగీ,

పూర్వ పరములెరింగి, వాస్తవ పరిస్థితులు సమన్వయించీ,

భావి తరముల మేటి బ్రతుకుకు బాట పరచు మహోద్యమంలో

మమేక మయ్యే స్వచ్ఛ సుందర మాన్యతకు చేసెద ప్రణామం!

                         

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

23.10.2021.