2260* వ రోజు.......           24-Oct-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి?

 

2260* వ నాటి స్వచ్చోద్యమ చల్లపల్లి చరిత్ర:

 

నిన్నటి అందరి నిర్ణయానుసారం ఈ ఆదివారం వేకువ గ్రామ ముఖ్య కూడలికి చేరుకొన్న 30 మంది (జీతం, భత్యం లేని) స్వచ్ఛ - సుందరోద్యోగులు అవనిగడ్డ దిశగా ఇంచుమించు బస్ స్టాండు మలుపు దాక ప్రస్థానించారు. బాట మీది దుమ్ము, ఇసుకల్ని, టీ కొట్ల, జలేబి అంగళ్ల, అరటి తోపుడు బళ్ల సకల విధ కశ్మలాల్నీ, నిర్మాణంలో ఉన్న దుకాణాల వ్యర్థాల్ని, ఊడ్చి, లాగి గుట్టలు చేసి, ఆ రెండు రకాల పోగుల్ని డిప్పలతో ట్రక్కులో కెత్తి - రెండు గంటల పాటు నిష్కామ కర్మ నిర్వహించారు.

 

            ఎవరెవరివో ఉచ్చిష్టాల్ని ఊడ్చి ఎత్తుతున్న మహిళలు, ఎంగిలాకుల్ని నికృష్ట ఖాళీ మద్యం సీసాల్ని, చుట్ట - బీడీ పీకల్ని సభర్తృకంగా వచ్చి ఏరుతున్న సర్వంచి తదితర స్వచ్చోద్యమ కారులు కాక ఇంకా స్థిత ప్రజ్ఞులెవరు?

 

ఏ రాజ్యం ఎన్నాళ్లుందో - ఆముట్టడికైన ఖర్చులూ

ఈ రాణీ ప్రేమపురాణం - మతలబులూ కైఫీయతులూ

ఇవి కావోయ్ చరిత్రకర్ధం - ఇవి కావోయ్ చరిత్ర సారం...

 

అని ఒక మహాకవి పాఠకుల్ని దబాయించినట్లే

 

ఏ గ్రామ చరిత్ర చూసినా ఏముంటది గర్వకారణం?

ప్రతి గ్రామ చరిత్ర మొత్తం - ధూళి దూసరం - కశ్మల ఘోరం

ఏ గ్రామం ఏ కాలంలో - సాధించినదెంత స్వస్తత......?”

 

అని మనం కూడ ప్రస్తుత కాలంలో సింహావలోకనం చేసుకోవాలి!

 

అలాంటి సందర్భంలో మాత్రం మన ఊరి ప్రతి స్వచ్ఛ కార్యకర్తా - 

 

నేను సైతం చల్లపల్లికి చెమట చుక్కలు ధారపోశాను..

నేనుసైతం వీధి ప్రక్కన మురుగు కాల్వకు నడక నేర్పాను..

నేను సైతం స్వచ్ఛ సైన్యం నీడలోనె పురోగమిస్తాను...”       

           

            అని సగర్వంగా కాదుగాని - సహర్షంగా జవాబివ్వగలడు!

 

            6.25 సమయంలో కాఫీ పానీయానంతర సమీక్షా సందర్భానికి ముందు తనది కాని ఊరి స్వచ్చ - శుభ్ర - సౌందర్య సాధనా సంకల్పాన్ని ఎలుగెత్తి చాటినది కొత్తపాలెం పశు సంవర్ధక ఉద్యోగి శాయిబాబు గారు.

 

            బుధవారం వేకువ మన స్వచ్ఛ సంకల్పాన్ని అమలు చేయదగినచోటు RTC ప్రాంగణమే!

 

            ఈ మహాత్ములకే ప్రణామం – 34

 

మంచి కొక ప్రోత్సాహముంటే - కృతజ్ఞతన్నదే మిగిలి ఉంటే

భవితపై విశ్వాసముంటే - స్వచ్ఛతకు తాంబూలమిచ్చే

నిరంతర శ్రమదాత లిరుగో! నిర్నిబంధ గ్రామ ప్రగతికి

కర్తలిరుగో - స్వచ్ఛ - సుందర కళాకారుల కిదె ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

24.10.2021.