2262* వ రోజు.......           28-Oct-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి?

 

2262* వ నాటి గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ ఘట్టం.

 

          గురువారం (28.10.21) బ్రహ్మముహూర్తానికి ముందే 14 మంది సార్ధక శ్రమదాతలు RTC ప్రాంగణంలో – క్రమ శిక్షణ గల సైనికుల్లా ఎందుకు నిలబడ్డారో? కొద్ది నిముషాల వ్యవధిలో మరో 10 మంది వివిధ వయసుల వాళ్ళు కూడ వచ్చి చేరి – ఇలా ఈ ఒక్క రోజనే కాదు – వేలాది దినాలుగా – తమకోసం కాక - ఊరంతటి మేలుకోసం 2 గంటల సమయాన్ని, శ్రమను ఎందుకు వెచ్చిస్తున్నారో! .... ఇలాంటివి పదే పదే నా మనస్సును తొలిచే ప్రశ్నలు!

 

          గ్రామస్తుల్లో ఎక్కువ మంది సుఖ నిద్రాపరవశులయే వేళ ఈ గృహిణులు, వైద్యవృత్తికారులు, కర్షకులు, అధికారులు, వృద్ధులు ఇంతగా వీధి పారిశుద్ధ్యం కోసం, నిలవ మురుగుల తొలగింపుకోసం, రోడ్లగుంటల బాగుచేత కోసం, ఎందుకు చెమటలు చిందించాలో నాలాగే సోదర గ్రామస్తులు సైతం పట్టించు కొంటే బాగుండును!

 

          “రోజులో 23 గంటలూ మన ప్రయోజనానికి, కుటుంబ - వృత్తి బాధ్యతలకూ కేటాయించుకొందాం - ఒకే ఒక్క గంటను తోటి వారి కోసం, గ్రామస్తుల ఉమ్మడి మేలుకోసం మినహాయిస్తే - మన ఇంటికీ, వంటికీ, సమాజానికీ మంచిదిఅనే కదా స్వచ్ఛ కార్యకర్తల ఆలోచన?

 

          ఈ ద్వైధీ భావమేమిటో అర్థంకాదు - అందమైన శుభ్రమైన మూత్రశాలలున్నా సరే మహిళల ఎదుటే బస్టాండులో అల్పాచమానం చేసే వాళ్ళొక ప్రక్క – ఆ ఉచ్చ కంపులోనే ప్లాస్టిక్ తుక్కులు ఏరి, మద్యం సీసాలు గుట్టలు పెట్టి, అక్కడి పచ్చదనాన్ని, పూల సోయగాన్ని, పరిశుభ్రతను కాపాడే ప్రయత్నంలో స్వచ్చోద్యమకారులింకో ప్రక్క!

 

ఇవేమీ లెక్క చేయని ఒక తాత్త్విక చింతనతో నేటి 100 నిముషాల అర్థవంతమైన శ్రమదానం నా దృష్టికి వచ్చినంతలో :

 

- నానా కశ్మలాల కంగాళీని గుట్ట చేసి, సాలోచనగా దాన్నే గమనిస్తున్న ఒక కర్షక కార్యకర్త,

- మానవ మూత్రంతో పదునెక్కిన నేల నుండి పిచ్చి – ముళ్ళ మొక్కల్ని తేలికగా పీకేస్తున్న నలుగురు స్వచ్చంద శ్రామికులు,

 - మూత్రశాల చుట్టు పట్టున శౌచ – సుందరీకరణంలో నిమగ్నులైన నలుగురు,

 - బస్ ప్రాంగణాన్ని చీపుళ్లలో ఊడ్చి ప్రయాణికుల నయనానందం కోసం మరో నలుగురు

 - గత ఐదేళ్లకు పైగా వేలాది ఇతర బస్టాండ్ల కన్న భిన్నంగా గుర్తించబడిన చల్లపల్లి RTC ప్రాంగణ ప్రత్యేకతనెలా కాపాడాలని ఆలోచిస్తున్న ఈ 24 మంది ....

            6.25 కు అంజయ్య గారు ముమ్మారు గర్జించిన గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలతో అక్కడి 100 మందీ ఉలికిపడి జాగృతులు కాగా, “మనకోసం మనం” ట్రస్టు గౌరవాధ్యక్షులు - బుద్ధప్రసాద్ గారి ఇంటిట ఆతిధ్యాన్ని గుర్తు చేసినది డాక్టరు DRK గారు.

 

          రేపటి వేకువ కూడ మన కర్మక్షేత్రం ఈ బస్ ప్రాంగణమే!

 

    ఈ మహాత్ములకే ప్రణామం 35

పదాడంబర ఉపన్యాసం గౌరవించే పిచ్చిలోకం

పూత మెరుగులు చూసి బ్రమసీ పొంగిపోయే పాడులోకం

నిప్పువంటి నిజాన్ని చెప్పే స్వచ్ఛ సంస్కృతి నాదరించెను!

అందుకే ఓ స్వచ్ఛ సైన్యం! అందుకొమ్మిక మా ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

28.10.2021.