2263* వ రోజు....           29-Oct-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి?

 

27 మంది గ్రామ సామాజిక హితకారుల 2263* వ నాటి. సంఘటిత కృషి.

 

          పైన పేర్కొన్న సంఖ్యలో 15 మంది వేకువ (శుక్రవారం) నాలుగుంబావుకే RTC ప్రాంగణంలో సంసిద్ధులైతే మిగిలిన వారు నిముషాల క్రమంలో వచ్చి కలిశారు. ఇక తదాదిగా – 2 గంటల పాటు వాళ్ల స్వచ్చోద్యమ విహారం ముఖ్యభవన దక్షిణ భాగంలో 3 చోట్ల జరిగి, వారి సదుద్దేశం నెరవేరడమూ - నేనేగాదు, ఏ వంద మందో చూశారు. (మరి సంస్పందించిన వాళ్ళో?)

 

          ఊహా ప్రపంచంలో కాదు - ఒక ఆదర్శ క్రియాశీలక - ఆచరణాత్మక స్వచ్ఛ చల్లపల్లి గ్రామమొకటీ, ఏ నదురూ -  బెదురూ లేక యథేచ్ఛగా రోడ్లనూ, డ్రైన్లనూ, బస్టాండు వంటి బహిరంగ ప్రదేశాలనూ మలిన పరచి - సొంత ఊరును స్వస్తతారహితంగా కళావిహీనంగా క్షణాల్లోనే మార్చగల కొందరు అమాయక అయోమయ గ్రామస్తుల పేరు గొప్ప చల్లపల్లి ఇంకోటీ నాకు విస్పష్టంగా కనిపిస్తూనే ఉన్నవి!

 

          నేను నివసించే చారిత్రాత్మక చల్లపల్లి పౌర సమాజాన్ని తట్టిలేపి, స్ఫూర్తి నింపే స్వచ్ఛకార్యకర్తల ప్రత్యక్ష చర్య ఇప్పటికీ విజయవంతం కాదా?

         

          “యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతః

          అభ్యుత్థానమ్ అధర్మస్య తదాత్మానామ్ సృజామ్యహమ్

 

అని ద్వాపరయుగాంతాన ప్రకటించిన కృష్ణ భగవానుడే దిగి నడచి వచ్చి, స్వచ్చోద్యమ ఆశయాల్ని పరిపూర్తి చేయాలా?

 

          ‘ఎవరి పిచ్చి వాళ్ల కానందంఅన్నట్లు ఈ దైనందిన సుప్రభాత వేళ సొంత ఊరి నిరంతర మెరుగుదల దీక్షే 30 - 40 మంది శ్రమదాతల కెనలేని సంతృప్తి!

 

ఎప్పటిలాగే తామెన్నుకొన్న బస్టాండు అవరణలో :

 

1) ఒకప్పటి రమణ నర్సరీ లోపల 10 మంది కార్యకర్తలు అద్దంలా రూపొందించి, చుట్టూ తామే పెంచిన బోగన్ విలియా వంటి పూల తీగల్ని కత్తిరించి, కొన్ని మెరుగులు దిద్దారు. 

 

2) అతిపెద్ద వేప చెట్టు ఎత్తైన గుబురు కొమ్మలు - ఆకుల నడుమ చుక్కల్లో చంద్రుడులా కనిపిస్తూ - ఆ వృక్షాన్ని సుందరీకరిస్తున్న రిటైర్డ్ ఉద్యోగి వాట్సాప్ చిత్రంలో కనిపిస్తున్నాడా?

 

3) దక్షిణపు ఖాళీ భాగంలో నలుగురు కత్తులు, గొర్రు, చీపుర్లుపయోగించి, పిచ్చి మొక్కల్ని, ప్లాస్టిక్ కంగాళీని సేకరిస్తున్న వైనం గమనించారా?

 

4) మల మూత్రశాలల చుట్టూ కలుపు పీకి, పూదోటను సంస్కరించి, ఊడ్చి ఆనందించిన సుందరీకరణ బృందమే నాకత్యంత ఆకర్షణీయ దృశ్యం!

 

          నేటి 6.30 సమయపు సమక్షా సంగతుల్లో అవనిగడ్డలో నిన్న మండలి బుద్ధప్రసాద్ మహోదయుని ఇంటి విందు కూడ ఒకటి. గోళ్ల విజయ కృష్ణ మూడు కాదు - నాల్గు మార్లు నినదించిన ఊరి స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలు కార్యకర్తలందరికి ఆనందప్రదమైన విశేషమొకటి.

 

          మన రేపటి వేకువ పునర్దర్శనం RTC ప్రాంగణంలోనే.

 

          ఈ మహాత్ములకే ప్రణామం – 36

 

గ్రామ మంతా హరిత విస్తృతి - వీధివీధిన స్వచ్ఛ సంస్కృతి

శ్మశానపు సౌందర్య సత్మృతి బాటలన్నిట పూల ఉధృతి

కార్యకర్తల శ్రమావృతితో- కుఢ్య చిత్ర ప్రదర్శనతో

ఊరి ఆకృతి మార్చి వేసిన ఉద్యమానికి నా ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త,

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

29.10.2021.