2265*వ రోజు....           31-Oct-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి?

 

ఆదివారం (31.10.2021) 2265* వ నాటి స్వచ్ఛ సుందర- వీర విహారం.

 

          ఔను మరి- ఈవేకువ 2 గంటలపాటు సుమారు 50-60 పనిగంటల్లో  RTC ప్రాంగణం లోతట్టులో - 35 మంది సమష్టిగా జరిపింది స్వచ్చోద్యమ వినోదమే!  అది మంచో- ఇవాళే మొదలైన చలి గాలో-మంచులో తడిబారి కాలు నిలవని ఎగుడు దిగుడు చోటో- ఏదైనా స్వచ్ఛ కార్యకర్తలది మాత్రం నిర్వికార-నిరంతర నిబ్బర పోరాటమే!  ఇందుమూలంగా నేటి హర్షణీయ స్వచ్ఛ- శుభ్ర-సుందరీకృతమైంది సుమారు అరెకర వైశాల్యమే!

 

 సకాలంలో వచ్చి, నడుం వంచింది పాతికమందేగాని, అప్పటి కప్పటి సద్యః స్ఫూర్తితో  వచ్చి చేరిన 10 మందితో చివరికి 35 మంది బలగం విజృంభించి, గ్రామ స్వచ్ఛ – శుభ్రతా  వ్యవసాయం ఉత్సాహ ఉద్వేగాలతోనే ముగిసింది. కొత్త కార్యకర్తల్లో ముఖ్యులు 10-12 ఏళ్ల- మన గ్రామేతర చుట్టం చూపుగా వచ్చిన గౌరుశెట్టి వంశోద్భవ, వేంకట సాయి, రమ్యలు.  

 

బస్టాండులో ద్విధా జరిగిన నేటి ఊరి స్వస్తతా ప్రయత్నాలకేం - ఎన్నైనా ఉంటాయి. పెద్ద డాక్టర్లు, సహృదయ వ్యాపారులు, పడుచు, ముసలి జీవులు, రైతులు- ముఖ్యంగా ఊరి ప్రప్రథమ మహిళే సభర్తృకంగా పాల్గొని చెమటలు చిందించే శ్రమదానంలో విశేషాలెందుకుండవు?  ఇన్నిరకాల వ్యక్తులు ఇన్ని వేలదినాలుగా 2లక్షల పనిగంటలపైగా ఒక సముచిత-సామాజిక – సామూహిక లక్ష్యం కోసం అహం వదలి, ఊరి ఉమ్మడి సౌఖ్యంలోనే తమ సంతృప్తిని వెదుక్కొనే సన్నివేశమే పెద్దవిశేషం కాదా?

 

-ఒకబృందం పాత మూత్రశాల ప్రక్కన కంపును భరిస్తూ గడ్డి కోసి, నేలను చదును చేసి, అడ్డదిడ్డంగా పెరిగి వంగిన రెండు వేప మొక్కల్ని నిటారుగా నిలిపి బాదుళ్ల కు కట్టి ఊతమిచ్చి, బుజ్జగించడంలో ఎంత సానునయ దృక్పథం ఉండాలి?

 

- కొత్త మూత్రశాలల దగ్గర గత 3 రోజుల శుభ్ర- సుందరీకరణంతో తృప్తి పడక - నేడు సైతం పూనుకొన్న బృందం యొక్క స్వగ్రామ సౌందర్య తృష్ణ నా కర్థమౌతూనే ఉన్నది!

 

-20 మందికి పైగా స్వచ్ఛ కర్మిష్టులు ఇద్దరు ముగ్గురుగా చెల్లాచెదురై , ఎక్కడెక్కడి పిచ్చిమొక్కల్ని, ఎంగిలాకుల్ని, ముళ్లమండల్ని తొలగించి, కొసరుగా ఖాళీ మద్యం సీసాలను పోగులు పెట్టి శ్రమించడం కాస్తంత భావుకత ఉన్న వాళ్లకేమనిపిస్తుంది.

 

కనుక ఊరి మెరుగుదల పూర్తయేదాక- వేలమంది గ్రామస్తులు విథిగా- విరివిగా పాల్గొనేదాక- ఇదొక నిరంతర ప్రక్రియ!  అందాక మన 30-40-50 మందిది భల్లూక పట్టు!

 

6.30 సమీక్షా సమయంలో సావకాశంగా-సాధికారికంగా కాక, సత్వరంగా తన గ్రామ స్వచ్ఛ సుందర సౌభాగ్య నినాదాలిచ్చింది సర్పంచి గారైతే, కార్యకర్తల డిమాండు మేరకు... పాటనూ-పద్యాన్నీ ఆలపించి, ఉత్తేజపరచింది స్వచ్చోద్యమ ఆస్తాన గాయకుడు నందేటి శ్రీనివాసుడు!  

 

బుధవారం నాటి మన శ్రమదాన పునః ప్రయత్నం బస్ ప్రాంగణం వెలుపల జాతీయ రహదారి మీదనే!

         

       ఈ మహాత్ములకే ప్రణామం – 38

 

అహంకారము వీడి ఊరికి ఆలంకరణము చేసి చూపిరి!

విమర్శకు ప్రత్యుత్తరంగా స్వచ్ఛ- శుభ్రత తెచ్చి పెట్టిరి!

 మౌనరీతిని- ఉన్న ఊరిని మురిపముగనే తీర్చి దిద్దిరి!

చరిత పుటలో నిలిచిపోయిన సాహసికులకు నా ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త,

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

31.10.2021.