2266*వ రోజు.......           03-Nov-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి?

 

03.11.2021 బ్రహ్మ ముహూర్త 2266* వ నాటి స్వచ్ఛ - సుందరీకరణం.  

 

బుధవారం - నరక చతుర్దశి - 4.28 నిముషాలకే ఊరికి 1 కిలోమీటరు దూరాన - నడకుదురు త్రోవలో స్వచ్చోద్యమ ఉద్యుక్తులైనది అష్టాదశ కార్యకర్తలే కావచ్చు!

 

సర్వాంగ సుందరంగా ఈ వేళ - 2 గంటల సమయంలో మారింది 120 గజాల బాటే అనుకొండి! నిర్భీతుడైన వేమన కవి చెప్పినట్లు : 

            నిక్కమైన మంచి నీల మొక్కటె చాలు - తళుకుబెళుకు రాళ్లు తట్టెడేల?...”

 

            ఇంతటి విశాల గ్రామ సచ్ఛ - పరిశుభ్రతల సవాలును అధిగమిస్తూ ఈ పండుగవేళ - చిరుచినుకుల చలిగాలిలో - రహదారి అస్తవ్యస్తత మీద, అభద్రత మీద, శుభ్ర - హరిత సౌందర్య పరిపూర్ణత కోసం ఈ కొద్ది మంది సాగించిన పెను సమరం దేన్ని సూచిస్తున్నది? “ఇది నా సొంత ఊరు - నేను పుట్టి, బ్రతుకుతున్న గ్రామం మంచి - చెడుల బాధ్యతనాకున్నది” - అనే సదుద్దేశ్యంతో ఈ కార్యకర్తల శ్రమ పరిత్యాగం నేడు కాకుంటే మరొకనాడైనా జనహృదయాల్ని తట్టకపోతుందా? 

            శాస్త్రమైనా, సంప్రదాయమైనా, పండగల పరమార్థమైనా - అవగాహన లేని ఆచారంగా మార్చి, పాటించడమే చూస్తున్నాం! చతుర్దశి - దీపావళి పర్వదిన వాస్తవ సందేశాన్ని కేవలం బాణాసంచాల ఆడంబరంగా - ఉత్సాహంగా జరుపుకోవడం ఒక పద్ధతి! ఇంత పెద్ద ఊరికి - పాతిక వేలమంది స్వస్తతకు ప్రమాదకరమైన కాలుష్య నరకాసురుణ్ణి ఎదిరించి, ఈ ఏడెనిమిదేళ్లుగా పోరాడే స్వచ్ఛ సైనికులు వీధుల్లో జరుపుకొంటున్న పండుగ - ఇదొక కొత్త సంప్రదాయం!

 

            వందేళ్ల క్రిందట - ఆంగ్లపాలన మీదకి వినాయక గణచతుర్థినే బ్రహ్మస్త్రంగా ప్రయోగించిన బాలగంగాధర తిలక్ మహాశయుని దూరదృష్టిని మనం గ్రహించాలి! ఈ నాటి కార్యకర్తల వీధి కాలుష్య పోరాటం కూడ ఆ కోవలోదే!  

- నిచ్చెన మీది కెగ బ్రాకి, కరెంటు తీగల్ని ముద్దాడబోతున్న చెట్ల కొమ్మల్ని కత్తిరించే ఒక సుందరీకర్తగాని,

- తన గృహస్థ బాధ్యతల్ని గంటన్నర పాటు ప్రక్కన పెట్టి, పూలమొక్కల మెరుగుదలకు ప్రయత్నిస్తున్న గృహిణి, ఉపాధ్యాయిని గాని, 

- రోడ్డు అంచుల గడ్డిని, ప్లాస్టిక్ భూతాన్ని, పనికిమాలిన మొక్కల్ని కూర్చొని, వంగొని నరికి, ఏరి, దంతెలతో ప్రోగులు చేసి, ట్రక్కుల్లో నింపి, చెత్త కేంద్రానికి చేరుస్తున్న ధన్యులు గాని - సప్రయత్నంగానో, అప్రయత్నంగానో ఇస్తున్న సందేశమదే!

            కాఫీ సమయంలో సుస్పష్టంగా ముమ్మారు ఊరి స్వస్తతా భవితవ్యాన్ని నినదించినది ఆకుల దుర్గాప్రసాదు.

            గురువారం - దీపావళి వేకువ సైతం మన సమష్టి స్వచ్ఛ సంకల్పం కోసం కలిసి, ప్రయత్నించదగిన చోటు - నడకుదురు దారిలోని వినాయక మందిరమేనని ఉమ్మడి నిర్ణయం!

            ఈ మహాత్ములకే ప్రణామం 39

స్వచ్ఛ భారత తయారీకై ఎవ్వరెవరో పిలుపు నిచ్చిరి -

ఎప్పుడో అది మరచిపోయిరి! ఇచట మాత్రం కార్యకర్తలు

అహోరాత్రములూ శ్రమిస్తూ అది నిజం చేస్తుండి పోయిరి!

మంచి మార్పునకై శ్రమించిన మార్గదర్శులకే ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త,

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

03.11.2021.