2267*వ రోజు....           04-Nov-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి?

 

దీపాల పండుగ శుభాకాంక్షలతో – 2267* వ నాటి శ్రమానందం

 

            శ్రీమత్ ప్లవనామ సంవత్సర ఆశ్వయుజమాస - (శాలివాహన శక – 1943 - చిత్త అంతాన) గురువాసర -  4.21 సమయాన – “అయం ముహూర్తోసుముహూర్తఃఅనుకొని - నడకుదురు బాటలో చిరుజల్లులో స్వగ్రామ స్వచ్ఛ - సుందర పూజకు దిగిన కార్యకర్తలు 22 మంది. అక్కడి డ్రైన్ గణపతి సాక్షిగా వడ్లమర దిశగా వాళ్లు మెరుగుపరచిన రహదారి 125 గజాలు! ఆ నిత్య నైమిత్తిక పారిశుద్ధ్య కర్మకాండలకు సాక్షులు సూర్యచంద్రులు కాదు తమ కళ్ళెదుటే స్వచ్చోద్యమ విలాసాన్ని రోజూ చూస్తూ కూడ తమ నివాస వీధి స్వస్తతను పదే పదే అపహాస్యం చేస్తున్న కొందరు వింత మనుషులు!

 

            తమ ఆహ్లాదం, ఆరోగ్యం కోసం వానలో తడుస్తూ స్వచ్ఛ కార్యకర్తలు తమ ఇళ్ల పరిసరాల్ని ఊడ్చి -  మొక్కలు పెంచి - ఇన్నేళ్లుగా పాటుబడుతుంటే - అందులో పాల్గొనకపోగా - రహదారిని మలినపరిచే చర్యలింకెన్నాళ్లు?

 

            ఒక ప్రక్క నభూతో నభవిష్యతిఅన్న చందంగా గ్రామ మెరుగుదల కృషి! సుచిర కాలంగా ఆ ఉద్యమానికి సమాంతరంగా - గొడ్లను కట్టేసి, పెంటపోగులు పోసి, అన్ని విధాల కంగాళీచేసి, “రహదారిని ఇన్ని రకాలుగా కూడా వాడుకోవచ్చా!  ఇంతగా చెడగొట్టవచ్చా!...అనే సంభ్రమాశ్చర్య కారణాలొక ప్రక్క! ఐతే ఈ బాట మీదనే చల్లపల్లి స్వచ్చోద్యమ శకటం ఒక్కోమారు కుంటుతూ సాగాలి!

 

            గ్రామ స్వచ్చంద శ్రమదాతల ఉడుం పట్టునూ - తద్భిన్నంగా సదరు ఉద్యమ అపహాస్య బ్రహ్మల్నీ చూస్తుంటే :

            “సరసము విరసము కొరకే - పరిపూర్ణ సుఖంబులధిక బాధల కొరకే

                                                       .....  - ధర తగ్గుట హెచ్చుకొరకె తధ్యము సుమతీ!

అనే నీతి పద్యం గుర్తొస్తున్నది.

 

            చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమ మహా గ్రంథంలోని ఈ నాటి 2267* వ పుట తెరిస్తే - కన్నవీ, విన్నవీ విశేషాలు :

 

- అటు విద్యుత్ శాఖ వారి బాధ్యత నెరవేరుస్తూ, ఇటు రహదారి ఆహ్లాదాన్ని సాధిస్తూ మరి కొన్ని చెట్లను ట్రిమ్ చేసిన సుందరీకర్తలు

 

- తడిలో, బురదలో ఎలా కూర్చుని - ముందుకు జరుగుతూ పనిచేస్తారో గాని,

   ముళ్ల పిచ్చి మొక్కల్ని, గడ్డినీ నరికి, చెక్కిన 10 మంది శ్రమదాతలు

 

- దంతెలతో, చీపుళ్లతో ఖాళీ సీసాల్ని, ప్లాస్టిక్ తుక్కుల్ని లాగి, ఊడ్చి, ట్రక్కుల కెత్తి, చెత్త కేంద్రానికి చేర్చిన బాధ్యులు....

 

            ఇక సమీక్షా సమయపు సంగతులు : - ఏడాదికొకటి కాక, ఎక్కువ పుట్టిన రోజుల మిషతో శంకర శాస్త్రీయ అల్పాహార పంపకం,

 

- పండుగ వేళ సుభాషిణీ వితరణగా కార్యకర్తలకు కదళీఫల పందేరం,

 

- గంధం బృందావన సుకుమార ప్రవచిత గ్రామ శుభ్ర - సౌందర్య స్ఫోరక నినాదాలు....

 

            రేపటి శ్రమదాన అవసర ప్రదేశమూ, వేకువనే మన కలయిక ప్రాంతమూ నడకుదురు బాటలోని వినాయక దేవాలయమే!

 

            ఈ మహాత్ములకే ప్రణామం – 40

 

అడ్డు వస్తే నమస్కరించిన గడ్డు కాలం దాటుకొంటూ

ఊరి వీధుల నొక్కటొకటిగ ఉద్ధరిస్తూ - మెరుగు పరచుచు

పూల తోటగ మార్చి వేసిన - పుష్కలంగా స్ఫూర్తి నింపిన

విక్రమించిన స్వచ్ఛ - సుందర వీరులకు నా తొలి ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త,

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

04.11.2021.