2268*వ రోజు....           05-Nov-2021

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను మనం ఎందుకు వాడాలి?

 

ఒక ఆదర్శ - అపూర్వ స్వచ్ఛ - సుందరోద్యమం వయస్సు 2268* రోజులు!

 

            నిన్నటి దీపాధిక్య పర్వదినానంతర శుక్రవారపు (5-11-21) వీధి పారిశుద్ధ్య శ్రమ కోసం - 4.19 కే తరలి వచ్చిన సామాజిక బాధ్యతామూర్తులు 12 మందైతే - ఇంకొన్ని నిముషాల వ్యవధిలో ఠంచనుగా వచ్చి కలిసింది 19 మంది. వెరసి ఈ ముప్పై మంది మేధో - కాయ కష్టాలతో తీర్చిదిద్దబడిన రహదారి నడకుదురు దిశగా - పెద్ద వడ్లమర దగ్గర.

           

            ‘30 మంది 2 గంటల పాటు స్వచ్ఛ – శుభ్ర - నవీకరించింది 150 గజాలేనాఅని కాదు - కొలవవలసింది; చేసిన పని స్వభావమేమిటో - దాని దీర్ఘకాల ప్రభావమెంతో - స్వీకరించగల్గిన వాళ్లకు ఆ చర్య నుండి స్ఫూర్తి ఏదో పరిశీలించాలి! 2268* దినాలుగా స్వచ్ఛంద శ్రమదాతల లక్ష్యం తమ కృషి ఫలిత పరిమాణం కాదు - పరిణామం మాత్రమే! 2 లక్షల పైగా పని గంటల ఆశయం తాము సాధించిన గొప్ప గురించి కాదు, పరుల మెప్పూ కాదు! తాము నమ్మిన ఆదర్మాన్ని ఆచరిస్తున్న సంతృప్తి మాత్రమే!

 

            ఈ వేకువ - 5.30 వేళ – నడకుదురు దారికి ఉత్తరపు డ్రైన్ మీది గుడికి వచ్చిన ఒక భక్తురాలు ఎంతదీక్షగా - భక్తిగా - శ్రద్ధగా ఆవరణను శుభ్రపరిచిందో - స్వచ్చకార్యకర్తలు ఏడెనిమిదేళ్ల నుండి తమ గ్రామ సమాజాన్ని దేవాలయంగా నిశ్చయించుకుని, ఆమెకన్న మిన్నగా ప్రతి వీధి - ప్రతి అంగుళాన్ని ఊడ్చి, పచ్చదనాలు నింపి, పుష్పాలంకృతం చేసి, గ్రామ సహోదరులకు ఆహ్లాదం పంచే ప్రయతం చేయడం లేదా? అందుకుగాను తమ సమయాన్నీ, శ్రమనూ, కష్టార్జిత ధనాన్ని ఇతోధికంగా త్యజించడం లేదా?

 

            అడపాదడపా వర్షంతో సహచరిస్తూనే కొనసాగిన నేటి శ్రమదాతల కృషి ఎట్టిదనగా :

 

- డజను మందికి పైగా కత్తుల - దంతెల వారు గుడి నుండి మర దాకా బాటకు రెండు అంచుల్లో వానలకు ఏపుగా పెరుగుతున్న గడ్డిని, అవాంఛిత ముళ్ల – పిచ్చి చెట్లనూ - వాటి నడుమ దాగిన ఖాళీ మద్యం సీసాలతోబాటు ప్లాస్టిక్ తదితర దరిద్రాలనూ తొలగించి, ఖండించి, ఏరి, పోగులు చేయడం.

 

- తడి - పొడి రోడ్డుమీద అంటుకొన్న ఆకులలముల్ని, దుమ్ము – ధూళినీ నలుగురు ఊడ్చిన వైనం.

 

- ఒక సుందరీకర్త ఈ వేళ రాకుంటె, మరొక ప్రసాదు ఆ ఖాళీని భర్తీ చేస్తూ చెట్లను, పూల మొక్కల్ని మనసారా సుందరీకరించిన పద్దతి...

 

            నేటి కార్తీకమాస ప్రథమ దివస సందర్భంగా అటేమో దేవాలయాల దగ్గర భక్తుల సందడి, ఇటేమో సమాజ దేవాలయంలో 30 మంది స్వచ్చోద్యమకారుల అలజడి!

 

            నేటి సమీక్షా సమయంలో – విశ్రాంత BSNL ఉద్యోగిని ఉత్తేజపరుస్తూ కార్యకర్తల జోకుల మీద జోకులు, శ్రమదానానికి మరొక మారు పునరంకితుడౌతున్న RMP శేషు గారి మూడంచెల గ్రామ శౌచ – సౌందర్య సంకల్ప నినాదాలు, తదనంతర స్వచ్చ వైద్యుని అభినందన పూర్వక ప్రసంగమూ!

 

            రేపటి మన స్వచ్ఛ - పరిశుభ్ర ప్రణాళిక అమలు ప్రదేశం కూడ నడకుదురు త్రోవలోని వడ్లమర ఉభయ దిశలే!

 

            ఈ మహాత్ములకే ప్రణామం – 41

 

ఊరి మేలుకె ఓటు వేస్తూ - ఉడత భక్తిగ పాటుబడుతూ -

దొడ్డ మనసుల ననుసరిస్తూ - ఎడ్డె జనులను సంస్కరిస్తూ

ఇన్ని లక్షల గంటలుగ - ఇంతింత స్వస్తత పాదు కొలుపగ

విప్లవించిన స్వచ్ఛ సుందర వీరులకు సవినయ ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త,

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

05.11.2021.