2269*వ రోజు....           06-Nov-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దూ

 

ఏడేళ్ల సుదీర్ఘ ప్రస్థానానికి 5 నాళ్ల దగ్గరలో స్వచ్చోద్యమం- @2269*

 

 నేటి వేకువ 4.22 సమయమే- ఈ సుస్థిర వార - నడకుదురు రాదారిలో ధాన్యం మర నుండి తూర్పు దిశగా విజయవంతమైన శ్రమదాన ముహూర్తం!  నేటి వినూత్న- విశేష శ్రమదాతలు 27 మందికాగా- శుభ్ర నవీకృత భాగం- మరొక 120 గజాలు!

 

 ఏం పర్వాలేదు- గ్రామ స్వచ్ఛ-స్వస్తతలకు పూచీపడే వాళ్లం 1: 1000 నిష్పత్తి లో నైనా ఉన్నందుకు ఊరి తరపున గర్విద్దాం.  మనం స్వచ్చంద సేవకులం కనుక - మన శ్రమ దానాన్ని మెచ్చి, వచ్చి, పాటుబడ లేదని గ్రామస్తుల్ని వంకబెట్టలేం; ఏడేళ్లైనా, పదేళ్ళైనా ఈ సుదీర్ఘ  స్వచ్ఛ- సుందర కార్యక్రమాన్ని ఆపనూ లేం! ప్రతిఫల నిరపేక్షంగా పాటుబడే వాళ్లకు నిరాశానిస్పృహ లసలే ఉండవు!

 

మన RMP డాక్టరు శేషు గానం చేసినట్లు- మన అభిమాన గ్రామ, సుందర భవితవ్య ఊహతోనే మన సంతృప్తి !  ఆ ఊహలను యదార్థం చేసే వరసలో ఈనాటి వీధి స్వచ్ఛ- శుభ్ర సాధనలో కొన్ని విశేషాలివి:

 

1) నిన్న అనివార్యంగా - అరగంటకు పైగా విశ్రాంతి పొందిన BSNL బక్క కార్యకర్త

ఈ పూట అదే కత్తితో ఒక దిబ్బమీది కాలుష్యాన్ని తుత్తునియలు చేయడం-

 

2) గొర్రుతో, మరొకరు చీపురుతో, గెడ కత్తితో ఒకరు, కత్తెర ధారుడొకరు విద్యుత్తీగల్ని సమీపిస్తున్న చెట్ల కొమ్మల్ని తొలగించి, పూల మొక్కల్ని మరింత సుందరీకరించిన గ్రామ సౌందర్య బృందం –

 

3) నేటి కృషితో పుట్టుకొచ్చిన, నిన్న మిగిలిన కశ్మలాల గుట్టల్ని చకచకా డిప్పల్లో నింపి, ట్రక్కుల కొద్దీ చెత్త కేంద్రానికి తరలించిన ఆరేడుగురూ-

 4)  “మేం గనుక పనిలోకి దిగితే రహదారి రెండు గంటల్లోనే ఎలా మారిపోతుందో చూపిస్తాం అన్నట్లుగా గడ్డిని గోకుడు పారల్తో చెక్కి, పనికిమాలిన దరిద్రపు మొక్కల్ని ఖండించి, పర్యావరణ ప్రామాదిక వ్యర్ధాల్ని ఏరి, ఊడ్చిన 10 మందీ-

- ఇలా నేటి ఉషోదయ శ్రమదానంలో ఎన్ని కమనీయ దృశ్యాలో !

 

6.30 వేళ - సమీక్షా కార్యక్రమంలో కొన్ని విశేషాలు:

 

1) ఇద్దరు స్వచ్చోద్యమ గాయకుల సామాజిక స్ఫూర్తిదాయకమైన పాట,

 

2) ఇటు కార్యకర్తలకూ, అటు విన్న గ్రామస్తులకూ పునః పునరుత్తేజకరంగా స్వచ్చోద్యమ కారుడైన కృషీవలుడు...  మల్లంపాటి ప్రేమానందం మూడుమార్లు స్వచ్చ- శుభ్ర సంకల్పాన్ని నినదించడమూ......

 

3) రేపటి కార్యక్రమానంతరం తన అల్లుని జన్మదిన సందర్భంగా అనల్పాహార విందుకు తాతినేని- మొక్కల రమణుని ఆహ్వానమూ....

 

 శ్రమదాన ముగింపు 6.00 తరువాత పావుగంట పాటు చెలరేగిన కార్యకర్తల శ్రమ జీవన నైపుణ్య ప్రదర్శనను డాక్టరు రామకృష్ణ గారు మళ్లీమళ్లీ ప్రస్తావించకుండలేక పోవడమూ...వగైరా!

 

రేపటి అదివారపు వేకువ మన పరస్పర పునర్దర్శన వేదిక గంగులవారిపాలెం బాటలోని పద్మాభిరామ సమీపమని గమనిక!

 

          ఈ మహా దీక్షలకే ప్రణామం – 42

న్యాయమునకే  ప్రథమ స్థానం - ధర్మమునకే చివరి విజయం!

 మంది క్షేమం కోరి నడచిన మహాత్ములకే చిరస్థానం !

 ఊరి బాగున కుద్యమించే ఉరుకు- పరుగుల మీ ప్రయాణం!

చరితలో ఇక నిలిచి పోయే సాహసికులకు నాప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త@

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

06.11.2021.