2270*వ రోజు....           07-Nov-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు

 

ఆదివారానికి 2270* వ రోజుకు చేరిన స్వచ్చోద్యమ ప్రస్థానం.

 

            ఆది తప్ప ఇప్పట్లో అంతం కనిపించని స్వచ్చ - సుందరోద్యమంలో 7-11-21 వేకువ 4.18 నుండి 6.18 దాక స్వచ్ఛ పతాకం రెపరెపలాడుతూనే ఉంది. బాధ్యతాయుత సంఘజీవులైన కర్తవ్య పరాయణుల కృషి నిత్య నూతనంగాను, సృజనశీలంగాను గ్రామ సమాజానికి ఎంతగా అంకితమౌతుందో మరొకమారు గమనించాను. ఏతత్కార్య సాధకులు 30 మంది. గంగులవారిపాలెం బాటలో తామున్న 2 గంటల్లో - ఎక్కడ ఏపనిముట్టుతో - ఎలా వీధి పారిశుద్ధ్య - భద్రతలు సాధించాలో అవగాహన ఉన్నవాళ్లు గదా మరి!

 

200 గజాలకో విస్తరించిన కృషిలో నేటి శ్రమదాన వివరాలు:

 

- శాయినగర్ తొలి వీధిలో ఉభయ దరుల్లో పిచ్చి చెట్లు పెరిగి, గడ్డి బలిసి, పూలమొక్కల, రహదారి అందాలను మ్రింగేయకుండా కత్తులతో - పారలతో చేసిన పనులు

 

- పద్మాభిరామం ఎదుట - ముఖ్యంగా మా ఇంటి ఎదర పూలతోటల్ని కలుపు పెరికి, అదుపు తప్పిన తీగల్ని, కొమ్మల్ని కత్తిరించి, కొన్నిటికి త్రాళ్లు కట్టి క్రమశిక్షణ మప్పిన ఉదంతం. ఈఏడెనిమిది మంది నిర్వాకంతో నిన్నటిదాక బవిరి గడ్డాల మహర్షుల్లా జుట్లు విరబోసుకొని కనిపించిన మొక్కలు ఇప్పుడు సుశిక్షితులైన విద్యార్థుల్లా మారిపోయినవి!

 

- సప్లవర్ వీధి ప్రజల సౌకర్యార్థం - వాళ్ల అనుమతి లభించినా, భాగస్వామ్యం కోసం వేచివేచి, ఈ వేకువ గంటన్నర పాటు ఆరేడుగురు కార్యకర్తలెలా శ్రమించారో, మురుగు కాల్వ మీది సిమెంటు రోడ్డు మన్నిక కోసం ఎంత ప్రణాళికా బద్ధంగా పాటుబడ్డారో జై స్వచ్చ చల్లపల్లి సైన్యంవాట్సాప్ మాధ్యమ చిత్రంలో ససాక్ష్యంగా పరిశీలించండి!

 

- ఏ రోడ్డు ప్రక్కన రంగు రాళ్ల నడుమ పెరిగిన గడ్డినెలా చెక్కి పునర్నవీకరిచాలో - ఎక్కడి వ్యర్థాలను ట్రక్కుల్లోకి ఎత్తాలో కొమ్మ రెమ్మల్ని, రాయిరప్పల్ని, ఏ రోడ్డుకు దన్నుగా పేర్చి దాని మన్నిక నెలా పొడిగించాలో ప్రతి కార్యకర్తకూ తెలుసు!

 

            ఈ లోకంలో శక్తియుక్తులున్న ప్రతి మనిషీ ఏదో ఒక పనిలో నిమగ్నమౌతుంటాడు - రాజకీయాల్లో తిరుగుతాడు - ప్రేమల్లో పడతాడు - అక్రమంగానో, సక్రమంగానో అస్తులు కూడబెడతాడు - రక్తిలోనో, భక్తిలోనో పీకల్దాక మునిగి తేలతాడు.... ఈ స్వచ్ఛ కార్తలెందుకోగాని - ఎన్ని వేల రోజుల్నుండో ఒకే దీక్షగా - ఒకే మాటగా - ఒకే బాటగా - ఒకే త్రాటి మీద -  ఒకానొక సమున్నత లక్ష్యం కోసం ఇలా అంకితమౌతారు! లక్ష్యం గొప్పది కావడంవల్లేమో గాని వాళ్లకు అలుపూ సొలుపూ ఉండనే ఉండదు!

 

            6.30 తరువాత నేటి శ్రమ దీక్షా ముగింపు వేడుకైతే - అదొక ప్రత్యేక స్మరణీయ మధుర దృశ్యం - ఒక పెళ్లి సందడే! ఊరి ప్రథమ పౌరురాలి స్వచ్చ - పరిశుభ్ర సౌందర్య సాధనా సంకల్ప నినాదాలు, తన నివాస గ్రామంలో విధిగా వికసిస్తున్న స్వార్ధరహిత స్వచ్ఛంద శ్రమదాన పండుగను చూసి మురిసిపోతున్న ఉద్యమసారధి ఆశ్చర్యాలు, తమ బిడ్డ పెళ్లి నాటి గుర్తుగా అల్లు వాడి జన్మదినోత్సవంగా తాతినేని లీలా - రమణుల అనల్ప భోజన భాజనాలు, ల్యాబ్ రవీంద్ర ఇంటి వైవాహికాహ్వానాలూ .... ఇలా ముగిసినది శుభసందడి కాక మరేమౌతుంది?

 

            బుధవారం నాటి వేకువ మనం కలువవలసిన చోటు - నిన్న మనం నడకుదురు బాటలో అర్థాంతరంగా వదలి వచ్చిన రైస్ మిల్ ప్రాంతమే!

 

            ఈ మహా దీక్షలకే ప్రణామం – 43

 

ఉపన్యాసం భలే సులభం - ఆచరించుటె కష్టసాధ్యం

ఎదుటి వారికి చెప్పు నీతులు ఎవరికైనా పెద్ద కష్టం!

అందునా - ఒక ఊరి మేలుకు అంకితులు అగుటెంత చిత్రం

కష్టసాధ్యం నిరూపించిన కారకర్తకె మా ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త,

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

07.11.2021.