2272*వ రోజు....           09-Nov-2021

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు...

 

గ్రామ సుందర - స్వచ్చోద్యమంలో ఇది 2272* వ కెరటం.

 

          ఈ మంగళవారం సైతం శ్రమదాన విరామమే కానీ గ్రామ రక్షకదళానికి మాత్రం కాదు. అంది వచ్చిన ఏ రహదారి భద్రతా అవకాశాన్ని కూడా వాళ్ళు వదులుకోరు. ఈ క్రమంలో వీళ్ళకు విజయవాడ రోడ్డులో బాలాజీ భవన విభాగ సముదాయం సమీపాన పెన్నిది లాగా తారు రోడ్డు పెచ్చులు, రాతి ముక్కల మిశ్రమం కనిపించింది. ఇకేం – ఒక ట్రక్కుతో అప్పటికప్పుడు ఏడెనిమిది మంది కార్యకర్తలు సిద్ధమైపోయి అక్కడికి రెండు మూడు కిలోమీటర్ల దూరాన గంగులవారిపాలెం బాటాలోకి దాన్ని రవాణా చేసేశారు.

 

          సన్ ఫ్లవర్ కాలనీ సిమెంటు రోడ్డు మొదట మురుగు కాల్వ పై భాగాన సదరు రోడ్డుకు ప్రమాదమేర్పడి అది కాస్త విరిగిపడే అవకాశాన్ని ముందే ఊహించి తాము తెచ్చిన తారు పెచ్చుల మిశ్రమాన్ని మొన్న బాకిన చెక్కల మీదుగా పరిచిన తాటి బొందుల మీదుగా రోడ్డు ఖాళీలోనికి ఎక్కించి దాని భద్రతకు పూచీ పడ్డారు.

 

          ఇలాంటి పని ఎవరి బాధ్యతో, ఏ వీధి ప్రజల సౌకర్యార్ధమో, ఎన్నాళ్ల క్రితం చేయదగినదో ఈ వీధి నివాసులకందరకూ తెలుసు. కార్యకర్తలు బ్రతిమాలినా పట్టించుకోని – కనీసం వచ్చి సహకరించని కాలనీ వాసుల కోసం ఈ రెస్క్యూ దళం వారి గంటన్నర శ్రమత్యాగం ఎవరి మెప్పు కోసమూ కాదు. అది తమ సామాజిక కనీస బాధ్యత గానే వాళ్ళు భావిస్తారు.   

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త &

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

09.11.2021.