2273*వ రోజు.......           10-Nov-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు...

 

గ్రామ సుందర - స్వచ్చోద్యమంలో ఇది 2273* వ తరంగం.

 

            సమయం వేకువ 4.25, ఔత్సాహికులు 17+10 మంది, స్థలమేమో నడకుదురు వైపుగా రహదారి, వాళ్ళ పోరాటం ఇతర కులమతాల ద్వేషంతోనో రోడ్డు ప్రక్కల జాగాల కబ్జాల కోసమో కాదు - ఏడెనిమిదేళ్లుగా వేలదినాలుగా గ్రామ కాలుష్యం మీద, అసౌకర్యాల మీద, రోడ్డు భద్రతల మీద వాళ్లదొక నిత్య సాత్విక యుద్ధం! గాంధేయమార్గం! ఇక వాళ్ల ఆశయం గ్రామ సహోదరుల ఆహ్లాదం, భావితరాల స్వస్తతా భవితవ్యం!

 

            లక్షల పనిగంటలు శ్రమిస్తూ - అనూహ్య ధనవ్యయం చేస్తూ - శారీరక మేధోశ్రమతో ఈ కార్యకర్తలదొక సుదీర్ఘ సు వ్యవస్థిత ప్రయాణం! ప్రతిఫల నిరపేక్షగా స్థిత ప్రజ్ఞగా ప్రణాళికా బద్ధంగా - 50-60-70 మందే కావచ్చు గాని - రాష్ట్రంలో, దేశంలో, కనీసం ఈ ఒక్క చల్లపల్లి గ్రామంలో తెరతీస్తున్నది ఒక వినూత్న - ఆదర్శ శ్రమ సంస్కృతి కాదా?

 

            ఈ శ్రమదాతల ఏ ఒక్కనాటి పని తీరునైనా గమనించినా, నిర్నిబంధంగా - నిర్వికారంగా మురుగు గుంటల, శ్మశానాల రహదార్ల పారిశుద్ధ్య చర్యల్ని పరిశీలించినా నేను ప్రతి రోజూ నివేదిస్తున్నది అతిశయోక్తి కాదనీ, పోగేసిన గాలి కానే కాదనీ అంగీకరిస్తారు!

 

            ఈ 2273* వ అడుగునే సావకాశంగా కనిపెట్టండి - నేటి వాట్సాప్ చిత్రాలలో వెతకండి:

 

- ఆ మధ్య ఒక వేకువ వీధి శుభ్రతా ప్రయత్నంలో కాళ్లకు తగిలిన స్వల్ప కత్తి వేట్లను లెక్క చేయక - కట్టుకట్టుకొనే - మరుసటి వేకువనే శ్రమదాన సంసిద్ధులైన ముగ్గురూ

 

- ఇంటి పనులు పదే పదే చప్పట్లు కొట్టి పిలుస్తున్నా, గబగబా వచ్చి, గంటసేపైనా గ్రామ మెరుగుదలకై పాటుబడే ఒకరిద్దరు మహిళలూ -

 

- నాలుగైదు రోజుల దూర ప్రయాణం వల్ల శ్రమదానం కుదరక - ఈ వేకువ వచ్చి, రెట్టించిన ఉత్సాహంతో - బకాయి తీర్చుకొంటున్న ఇద్దరు పెద్ద (సజ్జా, జాస్తి) ప్రసాదులూ

 

- 6.15 కు శ్రమదాన వేళ ముగిసినా, చెట్లకొమ్మల్ని - పాదుల్ని కత్తిరిస్తూ, సరిజేస్తూ 6.30 దాక సుందరీకరణను విరమించని నలుగురైదుగురు ఊరి అందగింపుల బృందమూ

 

మన వాట్సాప్ లో సామాజిక సూక్ష్మ గ్రాహులకు తప్పక కనిపిస్తాయి.

 

ఒక గమనిక ఏమంటే - 8 వ తేదీ సోమవారం చల్లపల్లి కార్యకర్తలు నలుగురైదుగురూ, స్థానిక పెద్దగూడెం, ఘంటశాల పంచాయితీ వారు ఐదారుగురు చేసిన వీధి పరిశుభ్రతా కార్యక్రమాలు.

 

మంగళవారం (9.11.21) వేకువ విజయవాడ రోడ్డులోని అపార్టుమెంట్ల దగ్గరి రాళ్ళ, పెంకుల మిశ్రమాన్ని ఆరేడుగురు రెస్క్యూ దళం ట్రాక్టర్ లో నింపుకొని మూడు కిలోమీటర్ల దూరంలోని సన్ ఫ్లవర్ వీధి మురుగు కాల్వ మీది సిమెంటు బాటను బలపరచి దాని జీవితాన్ని పొడిగించడం.

 

            సొంత కుటుంబ సంక్షేమంతోబాటు తాము పుట్టి పెరిగిన గ్రామ సమాజ శ్రేయాన్ని కూడ ఇంతదీక్షగా పట్టించుకునే ఇందరు ఆదర్శ కార్యకర్తలు ఈ చల్లపల్లిలో కాక మరే గ్రామంలోనైనా ఉన్నారేమో నాకు తెలియదు!

 

            6.30 తరువాత కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతూ - ముమ్మారు స్వగ్రామ శుభ్ర సౌందర్య నినాద పాఠం చెప్పింది భోగాది వాసుదేవ మాస్టరు. నేటి స్వచ్చోద్యమ ఘట్టాల్లో పాల్గొని, బాటలు ఊడ్చి, ట్రాక్టరు నడిపి, సమీక్షించినది డాక్టరు DRK ప్రసాదు గారు!

 

            విశ్రాంత ఉద్యోగి కోడూరు వేంకటేశ్వరరావు గారు క్రమం తప్పని తమ నెలవారీ చందాను మనకోసం మనంమేనేజింగ్ ట్రస్టీకి 520/- సమర్పించారు.

 

రేపటి వేకుక మనం ద్విగుణీకృతోత్సాహంతో కలువదగిన చోటు చిల్లలవాగు ఒడ్డున తరిగోపుల ప్రాంగణం వద్ద.

 

            ఈ మహా దీక్షలకే ప్రణామం  44

 

మాట బదులుగ చేతతోనే మంచి చూపుట సర్వశ్రేష్టం

వింత వింతల మయ సమాజం వీరనటనకె ప్రథమస్థానం

సొంత లబ్దికి కాక గ్రామం సుఖం దృష్టితొ మీ ప్రయత్నం

అందుకే ఓ స్వచ్ఛ సైనిక! అందుకో ఈ మా ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త &

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

10.11.2021.