2274*వ రోజు....           11-Nov-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు

 

ఇంకా నడుస్తున్న ఏడేళ్ల గ్రామ సామాజిక - సామూహిక శ్రమదాన భిన్న చరిత్ర - @2274*.

 

            గురువారం (11-11-21) వేకువ 4.19 వేళ చెదురుమదురు చినుకులకు తోడైన చలిగాలి గజగజ వణికిస్తున్న వాతావరణంలో - శ్రమదాన సంసిద్ధులైన 14 మంది, 3 - 4 కిలోమీటర్లు గడిచి వచ్చిన సుమారు పదిమందీ – 2 గంటల పాటు తమ ఊరి జనులకేది ప్రయోజనమనుకొన్నారో అదే చేశారు. నడుమన వర్షం ప్రకోపించినప్పుడు కాఫీలు సేవించారు. మరి, ఇదంతా గ్రామ పొలిమేరలో చిల్లలవాగు గట్టు మీది శ్మశానం దగ్గరి సంగతి!

 

            సెంటిమెంట్లకు వెనక్కి తగ్గని - చలి భీభత్సానికి జంకని ఈ కార్యకర్తల్లో ఐదారుగురు మహిళలు రుద్రభూమి పచ్చని కంచెను సుందరీకరించారు, చెత్త ట్రాక్టర్లు నిత్యం తిరుగాడే సిమెంటు బాటను ఊడ్చి, పూలమొక్కల్ని పలకరించి, చక్కబెట్టుతూ వానలో తడిసే సన్నివేశం ఇన్నేళ్ల తరువాత సైతం ఎవరికైనా బడాయిగానో - ఎబ్బెట్టుగానో తోస్తున్నదేమో!

 

            ఊరి రోడ్ల ప్రక్కన ఎక్కడెక్కడి నుండో సేకరించిన తారుపెచ్చుల్ని, గులక రాళ్లనీ దాచి ఉంచిన కార్యకర్తలు 10 మంది చిల్లలవాగు వంతెన దగ్గర పడిన లోతైన గుంటల్ని వాటితో పూడ్చి, సర్ది ఎన్ని వందల వాహనాలకు భద్రతనిచ్చారో గదా! తమకు చాతనైనంతగా మురుగు కాల్వల్ని సంస్కరించి, రహదార్లను మెరుగుపరచి, శ్మశానాల్ని నవీకరించే స్వచ్చ సైనికుల్లో కర్తవ్వపరాయణత్వం తప్ప ఏనాడూ ఏస్వాతిశయమూ నేను గమనించలేదు!

 

            ఎక్కడో - ఎప్పుడో - తోటి వారికి అసౌకర్యం, బాధ కల్గినప్పుడు - ఒక తటిల్లతలాగా ఏ ఆలోచనాపరుడికో భరించరాని కష్టమౌతుంది. వాటిని సరిదిద్దే తపనలో, మధనంతో క్రొత్త కార్యాచరణం ఒకటి మొదలౌతుంది - అది క్రమంగా ఉద్యమ రూపమెత్తుతుంది! 2600 ఏళ్లనాటి బౌద్ధ జీవన విధానం కాని, అంతకు ముందు ధర్మ సంస్థాపన కోసం కృష్ణ పరమాత్మ సంకల్పించిన భారతయుద్ధం కాని, రామానుజా చార్యుని మత సంస్కరణంగాని - ఏసుక్రీస్తు బలిదానం కాని వీరేశలింగం, కారల్ మార్క్స్, గాంధీ, అంబేత్కర్ ల ఉద్యమాలు కాని - బహుశా ఇలాంటివే ఐ ఉండాలి!

 

            అంతటిది కాకపోవచ్చు గాని. చల్లపల్లి స్వచ్చోద్యమానిది సైతం ఒక ప్రత్యేకతే! దీని వెనక ఏడెనిమిదేళ్ల శ్రమత్యాగ చరిత్ర ఉంది, లక్షలో - కోట్లో వ్యయం ఉంది, అడ్డంకుల్ని అధిగమించిన స్థైర్యం ఉంది నిస్వార్థముంది - నిజాయతీ ఉంది! గ్రహించగలిగితే స్ఫూర్తి కూడా ఉంది!...

 

            6.30 సమయంలో కోడూరు వేంకటేశ్వరరావుగారు ముమ్మారు స్వగ్రామ స్వచ్ఛ శుభ్ర - సౌందర్య నినాదాలను దిక్కులు పిక్కటిల్లేలా గర్జించగా, DRK గారు కార్యకర్తల శ్రమత్యాగ సంకీర్తన చేయగా - వానలోనే అందరూ గృహోన్ముఖులయ్యారు.

 

            ఈ రోజు 12:00 కు స్వచ్ఛ కార్యకర్త ల్యాబ్ రవీంద్ర గారి కుమారుని, కోడలి (దినేష్ చంద్ర మోనిక) వైవాహికానంతర వేడుకలో మనం కలుద్దాం!

 

            ఎడతెగని వర్షసూచన దృష్ట్యా రేపటి వేకువ మన శ్రమదాన ప్రదేశం గంగులవారిపాలెం రోడ్డుగా నిర్లయించడమైనది.

 

            ఈ మహా దీక్షలకే ప్రణామం  – 45

 

ఏమతం - నీదేకులం నీ ప్రాంతమేదను ప్రశ్నలడుగక

ఊరి సఖ్యత ప్రోది చేస్తూ - స్వస్తతకె తాంబూల మిస్తూ

ఏకదీక్షగ - ఏకవీక్షగ ఇంత ఊరును అందగిస్తూ

కదం త్రొక్కిన స్వచ్ఛ - సుందర కార్యకర్తకు మా ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త &

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

11.11.2021.