2275*వ రోజు.....           13-Nov-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడవద్దు

 

సుందరోద్యమకారుల అవిరళ కృషి - @2275*వ మారు.

 

            శనివారం (13-11-2021) వేకువ చలిలో యధాప్రకారం - ముందస్తు సమాచారానుసారంగా - గంగులవారిపాలెం బాటలో 4.16 కే పారిశుద్ధ్య సంసిద్ధులైన ముప్పయ్యిన్నొక మంది కార్యకర్తలు తమ 60 పనిగంటల శ్రమదానంతో ఏం సాధించారో చూద్దాం - అసలే స్వచ్ఛ శుభ్ర - సుందర మనోజ్ఞంగా ఉన్న ఈ ఆదర్శ రహదారి 6.30 వేళకల్లా ఇంకెంత దర్శనీయంగా తయారయిందో కూడ పరిశీలిద్దాం! ఈ దృశాలన్నీ వాట్సప్ సాక్ష్యంగా ఎవరైనా గమనించదగ్గవే!

 

            సుదీర్ఘ సువ్యవస్థిత చల్లపల్లి స్వచ్చోద్యమ గమనంలో ఈ శనివారం ప్రత్యేకత ఏమంటే - గడచిన కాలాన్ని బట్టి ఇది 8 వ మైలురాయి! అసలు గ్రామ శుభ్ర - సుందర కృషి అంటే - ఈ కార్యకర్తల్లో ఏ ఒక్కరి ఇంటి శుభకార్యమో కాదు; ఎవరి అహానికో కీర్తి కాంక్షకో - స్వార్దానికో అండదండలు కానే కాదు; ఇప్పటి సమాజంలో పేట్రేగిపోతున్న కుల మత - ప్రాంత విద్వేషాల ధోరణులకు ఈ రెండు గంటల శ్రమదాన సన్నివేశం పూర్తిగా భిన్నం! పరిగ్రాహక స్వభావం ఉండే గ్రామస్తులకైతే స్ఫూర్తిమంతం!

 

            ఈనాటి కార్యకర్తల శ్రమదాన కథనానికి కొన్ని ఫొటోల సాక్ష్యం ఉన్నది :

 

1) సన్ ఫ్లవర్ కాలనీ రోడ్డు నుండి దక్షిణంగా 150 గజాల దాక డజను మంది కత్తులతో బాటకు రెండు మార్జిన్ల గడ్డినీ, అక్కడక్కడా పిచ్చి మొక్కల్ని, పనిలో పనిగా సారా సీసాల్నీ, ప్లాస్టిక్ కవర్లనీ తొలగించిన వైనం

 

2) దంతెలతో ఐదారుగురు సదరు వ్యర్థాలను ఊడ్చి, పోగులు చేసిన సంగతీ -

 

3) ఒక మారుకాదు రెండు మూడు దఫాలుగా చీపుళ్ల వారు దంతెలతో రాని దుమ్మునూ, ఆకుల్నీ, రెమ్మల్నీ సేకరించిన శ్రమనూ

 

4) మిగిలిన వారు డిప్పల్తో వ్యర్ధాల గుట్టల్ని ట్రాక్టర్‌ ట్రక్కులోకి, దానితో దూరంగా ఉన్న చెత్త కేంద్రానికి చేర్చిన బాధ్యతనూ -

 

5) అప్పటికే సుందర మనోహరంగా దారి కిరుప్రక్కలా కొలువు తీరిన పూలమొక్కల్నీ, హరిత వృక్షాల్ని మరింత కనువిందుగా మారుస్తున్న సుందరీకర్తల ఒడుపునూ......

 

6) పై విశిష్ట కృషి ఘట్టాల్ని కెమేరా నేత్రంలో దాస్తున్న స్వచ్ఛ వైద్యుని ముందుచూపునూ,

 

7) దేశంలో ఇంకెక్కడా కనిపించని అరుదైన, ఆవశ్యకమైన గ్రామ మెరుగుదల కృషిలో ప్రతికార్యకర్త ప్రయత్నాన్నీ మనస్సులో నింపుకొంటున్న నాబోటిగాళ్ల ఆనందాన్ని...

 

            ఈ ఉద్యమంలో పాల్గొనలేని స్వచ్చోద్యమాభిలాషులెవరైనా జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యంమాధ్యమంలో గమనించగలరు!

 

            6.40 కి బొమ్మిశెట్టి ఆత్మపరబ్రహ్మ ప్రాయోజిత త్రివిధ - స్వచ్ఛ - పరిశుభ్ర - సౌందర్య సంపాదక నినాదాలతోనూ, కేకు ముక్కల విందుతోనూ, దాసరి రామకృష్ణ ప్రవచిత సుదీర్ఘ గ్రామ మెరుగుదల ప్రతిపాదనలతోను నేటి శ్రమదాన పరిసమాప్తి!

 

            గంగులవారిపాలెపు మార్గం తరువాయి శుభ్ర సుందరీకరణ కోసం రేపటి వేకువ సైతం మనం పద్మాభిరామం దగ్గరే కలుద్దాం!

 

   ఈ మహా దీక్షలకే ప్రణామం  – 46

 

ఆలోచన ఒక్కరిదై - ఆచరణము పెక్కురిదై

అది పర్యావరణమునకు ఆమెత యై - విస్తృతమై

స్వచ్చోద్యమ చల్లపల్లి జాగృతమై దేశానికి

దిక్సూచిగ మార్చినట్టి ధీశాలురకు ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త &

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

13.11.2021.