2276* వ రోజు....           14-Nov-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం

 

ఆదివారం - 14-11-21 నాటి (2276*) శ్రమదాన నివేదిక.

 

            వేకువ 4.18 కే 14 మంది పూనిక - అనతి నిముషాల్లోనే - ఇంతింతై... అన్నట్లుగా ఆ సంఖ్య కాస్తా 35 కు చేరిక - ఇక అక్కడి నుండి 2 గంటల సమయం గంగులవారిపాలెం మలుపుకు కుడి - ఎడమలుగా, బండ్రేవు కోడు మురుగు కాల్వగట్టు మీద శ్రమదాన విన్యాసాలకు ఈ నాటి నా నివేదిక!

 

            30 మందికి పైగా వృద్దులు, గృహిణులు, సర్పంచులు, ఉద్యోగులు, వృత్తి జీవులు, దివ్యాంగులు, ఒక సామాజిక సామూహిక సద్వివేకంతో ఏకోన్ముఖంగా ఊరి స్వస్తతా భవితవ్యం తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైతే ఆరమణీయ - కమనీయ దృశ్యమే వేరుగా ఉంటుంది! వీధి శుభ్ర సౌందర్యారాధనలో ఆక్షణాల్లో వినిపిస్తున్న కత్తుల రాపిళ్లు, గోకుడు పారల గరగరలు, దంతెల గురగురలతో బాటు ఒకరిద్దరి పని మెలకువ హెచ్చరికలు చూస్తుంటే - వింటుంటే - అసలిదంతా ఎవరి మేలుకో కాక ఊరి మొత్తం బాగు కోసం జరిగే ఉమ్మడి కృషి అని గుర్తు చేసుకొంటే - నాకు శ్రీ శ్రీ వేరే సందర్భంలో

 

            వ్యక్తికి బహువచనం శక్తి...

 

            అన్న కవిత గుర్తుకొస్తున్నది! అంతకు చాల ముందే కారల్ మార్క్స్ మహాశయుడు కమ్యూనిస్టు ప్రణాళికలో నినదించిన

 

            “Workers of all countries! Unite!

            we have nothing to loose except slavery...” అనే దార్శనికత కూడ కనిపించింది!

 

నిజమే మరి! ఏడెనిమిదేళ్ల శ్రమదానంతో చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలు రోజూ వేకువ గంటన్నర కృషితో కోల్పోయిందేమున్నది? ఏవైనా ఉంటే మానసిక శారీరక జాడ్యాలు తప్ప? పొందిందేమైనా ఉంటే - అది మానసిక సంతృప్తి - తద్వారా ఆరోగ్యాల మెరుగుదల!

 

            అసలింత మంది కార్యకర్తలకు - ఇన్ని వేలదినాల - ఇన్ని లక్షల పనిగంటల - ఇంత మానసిక సంతృప్తి మిగిలిస్తున్న చల్లపల్లి స్వచ్చోద్యమాన్ని అనాలి! ఆ మాటకొస్తే ఇప్పటికీ స్వచ్చ సౌందర్య పాఠాలు వంటబట్టక, ఇందరు శ్రమదాతలకు పని కల్పిస్తూనే ఉన్న గ్రామ సోదరుల్ని మాత్రం మెచ్చుకోవద్దా?

 

            అన్ని రోజుల్లాగే ఈ ఆదివారం కూడ కార్యకర్తలు కురుస్తూ వెలుస్తున్న వాననో, చలి గాలినో అస్సలు పాటిచేయక ఒక క్రమపద్ధతిలో :

- కొందరు బాటను ఊడ్చి మరింత శుభ్రపరిచారు,

 

- కొందరు ఆ తడి లోనే కూర్చొనీ, ఒంగొనీ గడ్డి కోశారు, పిచ్చి చెట్లనూ, రోడ్డు దాక విస్తరిస్తున్న పురుగుడు వంటి తీగల్ని నరికారు

- తారు రోడ్డు రెండు ప్రక్కల గడ్డినీ, మట్టినీ గోకుడు పారల్తో చెక్కారు, విశాల పరిచారు.

- ఎన్ని వ్యర్తాలుంటే అన్నిటినీ ఏరి, దంతెలతో లాగి, పోగుల్ని ట్రాక్టర్లో నింపి, చెత్త కేంద్రానికి చేర్చారు.       

            ఏమంటే - ఎవరి ప్రారబ్దం వాళ్లది మరి! (అంటే శుభ్రపరిచే కార్యకర్తల బాధ్యత Vs బాటల మీద చెత్తను విరజిమ్మే కొందరి తెంపరితనం!)

 

            నేటి సమీక్షా సందర్భంలో :

1) తూము వేంకటేశ్వరరావు గ్రామ మెరుగుదల నినాదానందం,

2) పైడిపాముల కృష్ణకుమారి - రాజేంద్ర ల అల్పాహార ప్రదాన సౌకర్యం,

3) స్వచ్చ యార్లగడ్డ సర్పంచి గారికి స్వచ్చ చల్లపల్లి తరపున 200 అడవి తంగేడు పూలమొక్కల వితరణం,

4) ఎప్పటిలాగే ఈ చల్లపల్లిని మరింత మెరుగుపరచే ప్రణాళికా మధనం....

 

            బుధవారం వేకువ మన సామాజిక బాధ్యతా నిర్వహణ గంగులవారిపాలెం మూల దగ్గరే (ఈ రోజు ఆపిన చోట)!

 

       ఈ మహా దీక్షలకే ప్రణామం  47

శుభ్ర సత్కృతి నాచరించిరి - స్వచ్ఛ సంస్కృతినే వరించిరి

వెక్కిరింపులు, కొక్కరింపులు వేటి నెంతగనో భరించిరి

స్వచ్చ సుందర గ్రామ ప్రగతికి సాహసించిరి - నిలిచి గెలిచిరి

మీకు గాకింకెవరి కయ్యా! మేము చేసే సత్ప్రణామం?

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త &

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

14.11.2021.