2279* వ రోజు ....           18-Nov-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

 

ఊరి మంచి కోరి 24 మంది కార్యకర్తల 2279* వ నాటి కర్తవ్యదీక్ష

 

జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం వాట్సప్ పాఠక మిత్రులకు శుభోదయం! (వర్షోదయం అని కూడ చెప్పాలి!) అసలు గత నాలుగైదు రోజులుగా వర్షం శీలాన్ని శంకించ బట్టే - కారకర్తలు వానలోనైనా పని కనువుగా ఉంటుందని తమ శ్రమ వేడుకను నడకుదురు రోడ్డు నుండి గంగులవారిపాలెం బాటలోకి మార్చుకొన్నారు! ఈ వేకువ కూడా అది ఠంచనుగా వచ్చి, కురిసిందిగాని - మరీ ఇబ్బందిగాకాక, పూలవానగానే - ఈశ్రమ దాతల సామాజిక స్పృహకు మెప్పుదలగానే కురిసింది!

 

          నేటి చల్లపల్లి గ్రామ మెరుగుదల కృషికారులు 24 మంది – శ్రమదాన కేంద్రాలు మాత్రం 4! గ్రామ రెస్క్యూ దళం వారు కోట మలుపు నాగాయలంక రోడ్డులోని, బెజవాడ బాటలో కస్తూరి ఉద్యానం దగ్గర రోడ్డు గుంటల్ని తారు పెచ్చులతో పూడ్చి, ప్రభుత్వ బాధ్యతల్ని నెరవేర్చారు.

 

          వీళ్లే 5.30 తరువాత క్రొత్త బైపాస్ రోడ్డు వంతెన దగ్గర వందలాది వాహన రాకపోకల భద్రతకై నడుం బిగించారు! అటుగా పొలాలకు వెళ్లి వచ్చే గ్రామ రైతులుగాని, ద్విచక్ర - చతుశ్చక్ర వాహన చోదకులు గాని సదరు సౌకర్యకారకుల్ని తలవనూ తలవరు, స్ఫూర్తినీ పొందరు!

 

          వంతెన మలుపుదాక అన్ని రకాల మొక్కల, పూలమొక్కల, వాటిపాదుల - కొమ్మల- రెమ్మల సవరింపులు, కత్తిరింపులు, అందగింపులు యదావిధిగా జరిగిపోయాయి! ఇదంతా చల్లని తూర్పు గాలి వీచినట్లు గాను, తరువాత సూర్యుడుదయించినంత సహజంగాను ఏ తొట్రుపాటూ లేకుండానే!

 

          చినుకులు పడుతున్న రోడ్డు మీది దుమ్మును, ఆకుల్ని, చెత్తను చీపుళ్లతో ఊడ్వడమంటే - ఫొటోల్లో కనిపించేంత సులభం కాదని మనవి! ఆ బాధ్యతను పూర్తి చేసిన శ్రమైక జీవన మహిళామణులకు సదరు బాటపై నిత్యం నడచే చల్లపల్లి గ్రామస్తుల తరపున కృతజ్ఞతలు!

 

          ఈ కొద్ది మంది స్వచ్యోద్యమ శీలురే - వేకువ మాత్రమే కాదు - సాయంత్రాలు ఇళ్ల గడపలెక్కి దిగుతూ, తడి పొడి చెత్తల విభజన విషయంలో గృహస్తులకు అవగాహన కల్గిస్తుంటారు! ఇవన్నీ చూస్తూ ఊరుకోలేక ఉత్సాహంగా రాయాలనుకొన్నప్పుడేమో నాకు కాస్త సందేహం - ప్రత్యక్షంగా వీటిని చూడని వాళ్ళు నమ్మరనీ, అపార్థం చేసుకొంటారన్న సంకోచం!

 

          నేటి ఉషోదయ సూర్యకిరణాల సాక్షిగా తన ఊరి స్వచ్చ - పరిశుభ్ర – సౌందర్య సాధనా సంకల్ప నినాదాలను ముమ్మారు ప్రవచించిన వారు సజ్జా ప్రసాదు గారు, స్వచ్చంద శ్రమజీవుల పని పూర్వాపరాలను అభినందన పూర్వకంగా సమీక్షించిన వారు డి.ఆర్.కె ప్రసాదు గారు.

 

          ఈ సాయంత్రం మరికొన్ని ఇళ్ల వారికి తడి - పొడి చెత్తల వింగడింపును వివరించేందుకు బందరు రహదారి ప్రక్క ఉప్పల వారి వీధి మొదట్లోనూ,

 

          రేపటి వేకువ నడకుదురు మార్గంలోని శ్రమదాన లక్ష్యం కోసమున్నూ మనం మరల మరల కలువవలసి ఉన్నది.

 

       ఈ మహా దీక్షలకే ప్రణామం  49

 

మీ వినోదం - మీ ప్రమోదం - మీ పురస్కృతి మీ చమత్కృతి

సొంత గ్రామం మెరుగుదలకై చొరవ చూపిన మీ వివేకం

చిందు స్వేదం - శ్రమ విలాసం చిర యశోభూషణములైనవి -

మీకు గాకింకెవరి కండీ! మేము చేస్తాం సత్ప్రణామం?

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త &

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

18.11.2021.