2280* వ రోజు....           20-Nov-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

 

తుఫానుల్ని లెక్కచేయని 2279* వ నాటి విభిన్న శ్రమదానం

 

20-11-21 - శనివారం వేకువ నడకుదురు మార్గంలో శ్రీనగర్ కూడలికి తూర్పు పడమరలుగా - 19 మంది కార్యకర్తల వీధి పారిశుద్ధ్య కృషితో 100 గజాల మేర వందలాది మందికి సౌకర్యవంతంగా మారింది. ఎందుకు మారదు? ఒక్క కార్యకర్తైతే 30 - 35 గంటల పాటు నిర్విరామంగా జరిపిన పోరాటం మరి! ఇంకొక లెక్కలో డజన్ల మంది గృహస్థులు రోజుల తరబడి విరజిమ్మిన ఎన్నెన్నో కశ్మలాలను వదిలించేందుకు చేసిన ప్రయత్నం!

 

          ఆమధ్య ఎప్పుడోగాని ప్రతిరోజూ పండగేఅనే సినిమా ఒకటి వచ్చింది. చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తలు ఇలాంటి తుఫాన్ల రీత్యా 20 మందే కావచ్చు, ఆదివారాలలో 40 -50 మందైనా కావచ్చు - తమ ఊరిని శుభ్రంగా అందంగా ఆరోగ్యప్రదంగా తీర్చిదిద్దే ప్రతి ప్రయత్నమూ - ప్రతిదినమూ వాళ్లకీ పండగే మరి! ఏ పండగల వెనక ఏపరమార్థముందో -  సదరు పండగ చేసుకొనే వాళ్ల చిత్తశుద్ధి ఏమిటని అడిగితే - అది వేరే కథ!

 

చల్లపల్లి మాతృభూమిగా గల అదృష్టవంతులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఉన్నవాళ్లలో నిత్యం జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యంవాట్సప్ అనుయాయులు, అభిమానులు చాలమంది ఈ అరుదైన - అబ్బురమైన స్వచ్చోద్యమాన్ని చూసి మురిసిపోయేవాళ్లున్నారు. తమ ఊరి అభ్యుదయోద్యమాన్ని కంటి పాపలా చూసుకొనే స్వచ్ఛ రాయబారులూ ఉన్నారు. మరి - ఇక్కడే జీవిస్తూ - 2279* నాళ్ల కార్యకర్తల దీక్షను చూస్తున్న గ్రామస్తుల్లో ఎందరు సహకరిస్తున్నారు?

 

ఈ నాటి స్వచ్చోద్యమ నివేదికను చదువుతున్నవారు ముఖ్యంగా చల్లపల్లి నివాసులు దయచేసి స్వచ్ఛ శుభ్ర కృషీవలుర నేటి చర్యల్ని సామాజిక మాధ్యమ చిత్రాలలో పరిశీలించాలి. రోడ్డు ప్రక్కల అక్కడి నివాసులు ఎక్కడికక్కడే సృష్టించిన మినీ డంపింగ్ లనూ, విసుగూ - విరామం లేక వాటిని దంతెలతో, చేతులతో లాగి, ట్రాక్టర్లో నింపుకొని, చెత్త కేంద్రానికి తరలిస్తున్న దృశ్యాలనీ చూడాలి తమ ఏమరుపాటు, నిర్లక్ష్యం తమ వీధి వారికీ, గ్రామస్తులందరికీ ఎంతగా చిరాకునీ, అస్వస్తతనీ కుమ్మరిస్తుందో కాస్తయినా ఆలోచించాలి.

 

          తమ మేలుకోసం ఎవరెవరో వచ్చి, ఎంతెంతో పాటుబడుతున్నదెందుకో, కొద్ది మంది ప్రమత్తత పాతిక వేల మందికి ఏ చేటు తెస్తుందో గుర్తించాలి. అంతవరకూ ఆ శుభ ముహూర్తం ఆగమించేంత వరకూ - ఇదిగో ఈ పాతిక ముప్పై ఏభై మంది స్వచ్ఛ కార్యకర్తల సంకల్పం ఒక అంతులేని కథే!

 

నేటి కృషి ముగింపు వేడుక సంగతి కొస్తే:

 

- యజమానిగా తన కుటుంబాన్నీ, ఉద్యోగిగా తన పాఠశాలనీ, పౌరుడుగా తన సమాజాన్నీ చక్కదిద్దే తపన గల ఒక వర్మ గారు - మోపిదేవి వాస్తవ్యులు – ‘మనకోసం మనంట్రస్టుకు  5,000/- విరాళమీయడమూ, (అతని దాతృత్వానికిది మొదలూ కాదు, చివరా కాదు) ఈ ఊరి కల్లుడైన జ్ఞాన ప్రసాదు గారు గ్రామ స్వచ్చోద్యమ సంబంధ త్రివిధ నినాదాలిచ్చి, ఆరేడు నెలల తన అనుభవాన్ని రంగరించి, సహకార్యకర్తలకూ, గ్రామస్తులకూ కొన్ని సూచనలు చేయడమూ విశేషాలు.

 

          రేపటి వేకువ మన కర్తవ్య పాలన కోసం బైపాస్ మార్గంలో కమ్యూనిస్టు వీధి దగ్గర కలుసుకొని, అవసరానుగుణంగా అడుగేద్దాం!

 

          స్వచ్ఛ ధన్య చల్లపల్లి

 

వర్తమాన దుస్థితిపై స్పందించిన దొక హృదయం

అందుకు అనుకూల ప్రతి స్పందనతో ఒక బృందం

చల్లపల్లి స్వస్తతకై సాగు మహాజ్జ్వల యజ్ఞం

నిరీక్షణా రహితంగా నెరవేరిన ఒక స్వప్నం...

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త &

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

20.11.2021.