2281* వ రోజు....           21-Nov-2021

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

 

తుఫాను ప్రశాంతతలోనే 2281* వ నాటి వీధి పారిశుద్ధ్య సంస్కరణ.

 

            వెయ్యిమందో 100 మందో కాదు - ఈ సువిశాల, చారిత్రాత్మక చల్లపల్లి స్వస్తతకు కంకణం కట్టుకొన్న శ్రమ త్యాగధనులు 28 మంది మాత్రమే! అది కూడ జివ్వున చలి గాలి వీస్తున్న - ఆదివారపు బ్రహ్మ సమయం కన్నా ముందే – 4.25 వేళకే! స్థలం సాగర్ ప్రదర్శనశాల ఉపమార్గంలోని సామ్యవాద వీధి తిన్నగా! మరి – 2 గంటలపాటు ఈ ధ్యానమండల, వ్యాపార, గృహిణీమతల్లుల, యువక, వృద్ధ సామూహిక కృషి సంరంభంతో ఎవరికేం ఒరిగిపడిందో - ఈ సువ్యవస్థివత, సుదీర్ఘ స్వచ్ఛ - సుందర అభినివేశం ఏ ఫలితాన్నిచ్చిందో గమనిద్దాం!

 

            ఒక మహదాశయంతో మొదలైన ఏడెనిమిదేళ్ల అలుపెరుగని ఈ శుభ్ర - సుందరోద్యమ పరమార్థమేమిటనే ప్రశ్న స్వచ్ఛ కార్యకర్తలు కాదు - సగానికి పైగా గ్రామస్తులు వేసుకోవాలి. ఇప్పటికైనా తర్కించుకొని, ఇళ్లనూ - పరిసరాల్ని - వీధుల్ని, తమ సమీప మురుగుకాల్వల్ని ఆరోగ్యప్రదంగా నిర్వహించుకొనేందుకు కదలాలి! ఎప్పటికప్పుడు - ఎక్కడికక్కడ స్వచ్ఛంద గ్రామ సేవకులతో, పంచాయితీతో సంఘీభవించాలి! అప్పుడు గదా ఈ స్వచ్చోద్యమ సఫలత?

 

            ఈ ఊరు, మండలం, జిల్లా కాదు - సుదూర ప్రాంతీయులైన నలుగురు మనీషులు - శేఖర్, శ్రీదేవి, మురళి, శారదలు -  వామపక్ష నేపథ్యం కలవాళ్లు, రకరకాల ప్రజోపయుక్త ఉద్యమాల్లో రాటుదేలిన అనుభవజ్ఞులు నిన్నంతా చల్లపల్లిలో స్వచ్ఛ కార్యకర్తల శ్రమదాన ఫలితాలను పరిశీలిస్తూ, పరవశిస్తూ, శ్రమదాతల్ని అభినందిస్తూ గడిపి వెళ్లిన ఉదంతం చల్లపల్లి గ్రామస్తుల్లో ఎందరికి తెలుసు? పొరుగు రాష్ట్రాలదాక వెదజల్లుతున్న స్వచ్ఛ సుందరోద్యమ సుగంధం చల్లపల్లి గ్రామ ప్రజల్లో సగం మందికి సోకనే సోకదా?

 

            ఈ ఆదివారం 6.10 వేళ - ఇంకా వీధి వ్యర్ధాల తరలింపు జరుగుతుండగానే హడావిడిగా సందడించిన వర్షంలో సగం మంది కార్యకర్తలు తడవనే తడిశారు. వానో ఎండో చలో - మంచో, తమ పాటికి తాము స్వచ్ఛ సుందరీకరణను వదలి పెట్టక ముందుకు సాగే కార్యకర్తలు మాత్రం వానరాకడకు ముందే : 150 గజాల మేర - కస్తూర్బా శిధిల ఆస్పత్రి భవనం దాక - ఊడ్చారు, రహదారి సౌకర్య కల్పనలో భాగంగా పనికిరాని మొక్కల్ని తొలగించారు, సుమ సుందర మొక్కల సంరక్షణ చేశారు, గోకుడు పారలతో రోడ్ల మార్జిన్ లను వెడల్పు చేశారు, దుమ్ము - ధూళి - ఇసుకల్ని - ప్లాస్టిక్ దరిద్రాల్నీ తొలగించి ట్రాక్టర్ లో నింపారు. (వ్యర్ధాలతో నిండిన ట్రాక్టర్ ను ఫొటోలో గమనించండి!)

 

            అరగంటపాటు తుఫాను వర్షం కార్యకర్తలతో దోబూచులాడుతూనే ఉంది. 6.40 కి ఉద్యమ సీనియర్‌ కార్యకర్త - కొన్నాళ్లు చెన్నైలో ఉండి తిరిగి వచ్చిన 83 ఏళ్ల డాక్టర్ మాలెంపాటి గోపాలకృష్ణయ్య చాలా కాలంగా ప్రతి నెలా 2 వేలు స్వచ్చోద్యమ ఖర్చులు భరిస్తున్నట్లు గానే ఈ రోజు కూడా మేనేజింగ్ ట్రస్టీ కి సదరు మొత్తాన్ని అందించి సహర్షంగా ముమ్మారు గ్రామ స్వచ్ఛ శుభ్ర - సౌందర్య సంకల్ప నినాదాలు ప్రకటించాక, మరొక డాక్టర్ గారి సమీక్ష ముగిశాక, సుందరీకరణ ప్రతిభాశాలి దేసు మాధురి ట్రస్టుకు నాణ్యమైన కత్తెర బహూకరించాక – చిరుజల్లుల్లోనే ఇంటి ముఖం పట్టారు!

 

            బుధవారం వేకువ మరల మన పునర్దర్శనం నడకుదురు బాటలోని శ్రీనగర్ దగ్గరే గాని, వాన అరాచకాన్ని బట్టి బైపాస్ లో - కమ్యూనిస్టు వీధి కూడ కావచ్చు! అందుకోసం మన జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యంమాధ్యమాన్ని ఆశ్రయిద్దాం!

 

            సంకుచితత్త్వం జిందాబాద్.

 

వేల నాళ్లుగ కార్యకర్తల కృషికి ఫలితం అందునప్పుడు

స్వచ్ఛ - సుందర కలల గ్రామం స్వస్తతలు కనుపించునప్పుడు

నిజం తెలిసీ భుజం కలిపీ నిలువ వలసిన గ్రామ వాసులు

అంటి - ముట్టక తప్పుకొనుటలు అహో ఎంతటి విచిత్రమ్ములు!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త &

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

 21.11.2021.