2283* వ రోజు....           25-Nov-2021

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎవ్వరమూ వాడం...

 

చల్లపల్లి స్వచ్యోద్యమ గ్రంథంలో ఇది 2283* వ పేజీ.

 

            గురువారం వేకువ సైతం అదే సమయం! 4.19 నిముషాలకే 3 రోడ్ల జంక్షన్ దగ్గర - పెట్రోలు బంకు ఎదుట 19 మంది స్వచ్ఛ ఉద్యోగుల తొలి సమావేశం! కొద్ది నిముషాల ఎడంలో మరి 9 మంది సంఘీభావం! ఇక - అక్కడి నుండి 6.15 సమయం దాక ఆ ఇంధన నిలయానికి, అటు నడకుదురు మార్గానికి, ఇటు బెజవాడ మార్గానికీ స్వచ్చోద్యమకారుల స్వచ్ఛ శుభ్ర - సౌందర్య పాఠం! అక్కడే డజను మంది ఆ రెండు మార్గాల బస్సులకై వేచి ఉన్న జనం! - ఐనా, స్వచ్ఛ కార్యకర్తల భగీరధ ప్రయత్నాన్ని వాళ్లు పెద్దగా పట్టించుకోని వైనం!

 

            ఓషో అనబడే విలక్షణ ప్రవచన కారుడు - ఆచార్య రజనీష్ ఒక సందర్భంలో మానవత్వాన్ని గూర్చి అన్న మాటలివి “When heart is heavy, eyes reply properly” (బరువెక్కిన హృదయానికి కన్నీళ్లే తగిన బదులిస్తాయి.) స్వచ్ఛ చల్లపల్లి ఉద్యమ గతాన్ని, వర్తమానాన్ని చూస్తుంటే ఆ మాటలు గుర్తుకొస్తాయి! స్వచ్ఛ - శుభ్రతల పరంగా ఈ గ్రామ దుశ్చరిత్ర గతం! అందుకు బాధతో కళ్లు చెమర్చడంతో ఆగిపోక రెట్టించిన పట్టుదలతో ఇన్ని వేల దినాల కార్యకర్తల స్వచ్చోద్యమం ఒక ఆశావహ వర్తమానం!

 

            ఇక ఈ ఊరి భవితవ్యమేమిటో వాట్సప్ మాధ్యమ చిత్రాల సాక్షిగా గ్రహించవచ్చు ఏ ఊళ్లో వేలాది రోజుల్నుండి తెగించి మురుగు తూముల్లో సైతం దూరి శుభ్రపరిచే స్వచ్ఛ కార్యకర్తలున్నారో, ఆ కార్యకర్తల వెన్నుదన్నుగానూ - గ్రామ సంక్షేమం కోసమూ డబ్బునూ, శక్తియుక్తుల్నీ ఫణంగా పెట్టే పెద్ద డాక్టర్లుంటారో - పారిశుద్ధ్య కార్మికుల్లో కలిసిపోయి, సకుటుంబంగా తడిపొడి చెత్తల్ని సేకరించే సర్పంచి ఉంటుందో - శానిటరీ ఇన్స్పెక్టరు, ఇతర అధికారులు నిత్యం కార్యక్షేత్రంలో కనిపిస్తారో ఆ ఊరి భవితవ్యానికి లోటేమి ఉంటుంది?

 

            వర్తమాన చరిత్ర ఎప్పుడూ స్పష్టంగా ఉండనే ఉండదు. ఉద్యమాల ఊపుల్తో, భావ సంఘర్షణల్తో అది గందరగోళం గానే ఉంటుంది! కడివెడుపాల మీద కాస్తంత మీగడ కట్టినట్లే - రకరకాల ఉద్యమాలు రాటుదేలి, నిగ్గుతేలి మంచేదో - నిజమేదో నిలబడిపోతుంది. చల్లపల్లి స్వచ్చంద శ్రమదాన ఉద్యమమైనా గతంలోని ఆటుపోట్లే కాదు - ఇకముందైనా కొన్నిటిని ఎదుర్కోవలసి రావొచ్చు!

 

            అందుకని సినిమా కవి కొసరాజు రాఘవయ్య చెప్పినట్లు – “జయమ్ము నిశ్చయమ్మురా! భయమ్ములేదురా! జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా....!అనుకోవడమే మన తక్షణ కర్తవ్యం!

 

            6.30 వేళ గ్రామ స్వచ్ఛ శుభ్ర - సౌందర్య భవితవ్యాన్ని ముమ్మారు నినదించిన యువకుడు గోళ్ల విజయకృష్ణ కాగా - నేటి కార్యకర్తల శ్రమశక్తిని గుర్తించినదీ, ప్రశంసించినదీ డాక్టరు DRK ప్రసాదు గారు.

            రేపటి వేకువ మన శ్రమదాన ఆవశ్యకతను గుర్తించిన చోటు మునసబు వీధిలోని ఇస్లాం నగర్ జెండాల దగ్గర.

 

            వైతాళికు లందరికీ.

ఆశావహ దృక్పధాన ఆత్మతృప్తి వెదకుకొనుచు

తమ సోదర గ్రామస్తుల తట్టి మేలు కొలుపబూను

కని - విని ఎరుగని ఉద్యమ కర్తలు - వైతాళికులకు

అందరికీ నమస్కృతులు ! అద్భుత సుమ చందనములు!

             

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త &

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

25.11.2021.