2285* వ రోజు....           27-Nov-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

2285* వ నాటి గ్రామ మెరుగుదలకై కార్యకర్తల కదన కేళి.

            శనివారం వేకువ కూడ అదే ముహూర్తం - 4.19. అప్పటికే వచ్చిన 15 మంది కాక అంతే మంది చేరికతో మొత్తం 30 మంది స్వచ్చంద శ్రామికుల వీధి పారిశుద్ధ్య ప్రయత్నం పై శీర్షికలో ఉటంకించినట్లు కదనం కాక మరేమిటి! నేటి 50 కి పైగా పని గంటల వ్యవధిలో బాగుపడి, 6.30 కు కనువిందు చేస్తున్న ప్రాంతం సాగర్ టాకీసు ఉప మార్గంలోని సామ్యవాద వీధి నుండి అటు విజయ్ నగర్, ఇటు అశోక్ నగర్ ల నడిమి 3 అడ్డ రోడ్ల మేర! కొసరుగా ఒక మురుగు కాల్వ, సజ్జా ప్రసాదు గారి బజారులో కొంత.

            మేధోశ్రమకన్న దైహిక శ్రమ కష్టం కావచ్చు. సదరు శరీర కష్టం మురుగు కాల్వల్లోనో, వీధి ఎంగిలాకుల ప్లాస్టిక్ తుక్కుల - కుళ్లి కంపుగొట్టే క్రిందటి రోజు ఆహారపదార్దాల త్రాగి పడేసిన ఖాళీ సారా సీసాల వంటివి ఎత్తి శుభ్రపరచేదైతే - పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు తప్ప ఎవరు ముందుకొస్తారు? ఎంత కష్టాన్నైనా ఇష్టపడి చేస్తే అలసటే ఉండదని మానసిక విశ్లేషకులు చెపుతారు! అందుకేనేమో - ఈ స్వచ్చ కార్యకర్తలు ఇన్ని వేల రోజులుగా అత్యధికులు అసహ్యించుకొనే ఇన్ని రకాల పనుల్లో కూడ సంతోషం మూటకట్టుకొంటున్నారు!

            కాకపోతే మరేమిటి? గ్రామస్తులు హాయిగా నిద్రాపరవశులైన వేళ - ఇందరు వాలంటీర్లు - గృహిణులు, డాక్టర్లు, పించనుదారులు, ఉద్యోగులు రహదారిని ఊడుస్తూ పిచ్చి, ముళ్ల మొక్కల్ని తొలగిస్తూ సమస్త వ్యర్ధాలను సేకరించి, ట్రాక్టర్ లో నింపుకొని, చెత్త కేంద్రానికి తరలిస్తూ - రోడ్ల వెంట పూల సోయగాల్ని, పచ్చదనాన్ని మెరుగుపరుస్తూ ఇప్పటికి ఏ 3 లక్షల పనిగంటలో ఎలా శ్రమిస్తారు?

            ఇక్కడ నా అజ్ఞానం, సందిగ్ధం ఒకటున్నది :

ఒకప్రక్క తమవీధిలో, ముంగిళ్లలో 30 మంది పదేపదే ఊడ్చి-  శుభ్రపరుస్తుంటే మైకు నుండి వినిపించే జేసుదాసు మంద్ర కంఠపు పాటల్తో శ్రుతికలుపుతూ శ్రమదానం చేస్తుంటే ఏ గృహస్థులు వీధి కశ్మల కారకులయ్యారో, వారికి మాత్రం సదరు జేసుదాసు శ్రావ్య గీతాలు మంచి జోలపాటలుగా పనిచేశాయా” – అని!

            నేటి వేకువ చలిగాలిలో కూడ ఒక యువ కార్యకర్త ముఖం మీద చెమట బిందువులు చూసినప్పుడు ఒక పాత సినిమా (స్వర్ణ కమలం) పాట

            “అందెల రవళులు పదములవా? అంబరమంటిన హృదయముదా...? అనేది గుర్తొచ్చి.

            “నీటి ముత్యములు మంచులవా శ్రమదానంతో స్వేదములా...?”

            అనే పాట స్ఫురించింది!

            నేటి శ్రమదాన విరమణ తర్వాత, గోళ్ళ వేంకటరత్నం ఊరి స్వచ్చ శుభ్ర సౌందర్యాకాంక్ష పిదప అర గంట పాటు అందరూ మన అత్యంత సీనియర్ కార్యకర్త వేమూరి అర్జునరావు దంపతుల్నే గుర్తు చేసుకొని ఆయన సమర్పిత వారి విందునే స్వీకరించి, తదుపరి వారం దావణగిరిలో - వారిని పరామర్శించే ప్రణాళికనే చర్చించారు.

            గోపాళం శివన్నారాయణ గారి వైద్య శిబిరం దృష్ట్యా రేపటి మన శ్రమదాన ప్రదేశం విజయా కాన్వెంట్ ప్రక్క వీధే అని గుర్తించమనవి!   

            గర్వపడుచు జైకొట్టుము

గర్వపడుము చల్లపల్లి కార్యకర్త సేవలకై 

జై కొట్టుము ఈ వేకువ శ్రమ విరాళ సంస్కృతికే

సిగ్గుపడుము ఇన్నేళ్లుగ చేయనందుకా కార్యం

అందించుము ఇంటింటికి స్వచ్చోద్యమ సందేశం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త &

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

27.11.2021.