2289* వ రోజు.......           02-Dec-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

 

2289* వ (02.12.2021 - గురువారం) వేకువ కూడా.....

 

ఉన్న ఊరి మెరుగుదల ప్రయత్నం పాతిక మందిదే - ప్రారంభం 4.17 కే!  ఇంత మంచు, చలిలో సైతం 2 గంటల పాటు చెమటలు చిందినదీ, మానసిక - శారీరక స్వస్తతలు సాధించుకొన్న ప్రదేశం కూడ ఇస్లాంనగర్ టు కీర్తి హాస్పిటల్ మార్గమే! అందుమూలంగా తగుమాత్రం స్వచ్ఛ పరిశుభ్ర - సౌందర్యాలు సమకూడిన వీధి భాగం సుమారు 120 గజాల పర్యంతమే!

 

            నాల్గు రోజుల క్రితం ఇక్కడి ఇద్దర్ని మీ వీధి ఇంత మురికిగా - గలీజుగా - ఇసుక, దుమ్ములతో, పుల్లా పుడకల్తో  దుర్భరంగా ఉండడమేమిటి....?” అని అడిగితే – “ఆఁ..! మన చేతిలో ఏముందండీ? పంచాయితీ వాళ్ళు పట్టించుకోకపోతే....అని నసిగారు. కాని, నిష్కామ కార్మికులైన స్వచ్ఛ కార్యకర్తలు మాత్రం ఈ వీధి, ఈ చల్లపల్లి తమది కాకున్నా- పంచాయతీ వారి కన్న ముందే వచ్చి, మురుగులు తోడి, రోడ్లు ఊడ్చి, మార్జిన్లను చదును చేసి, రంగురంగుల పూల మొక్కల్ని నాటుతుంటే ఏ ఒక్క గృహస్తుడైనా తొంగిచూడక పోయెనే!

 

            కనీసం కార్యకర్తలు సుందరీకరించిన తమ వీధిలో ఆక్రమణలు రాకుండా, పరిశుభ్రత తగ్గకుండా, వాళ్లు  నాటి - పెంచుతున్న పూల మొక్కల విధ్వంసం జరగకుండా ఇక్కడి వారెవరైనా హామీ ఇస్తే ఎంత బాగుంటుందో! 30 వేల మందికి చెందిన ఈ చల్లపల్లి వీధుల్ని బాగుచేసే హక్కు, బాధ్యత ఎవరికైనా ఉంటుంది గాని చెరిపేందుకు ఏ ఒక్కరికీ ఉండదు!

 

            కార్యకర్తలు ఈ వేకువ తమ బాధ్యతలోకి దూకేముందు చూస్తే అక్కడ ఏం కనిపించింది?

బడ్డీ కొట్ల వల్ల, స్థానికుల బాధ్యతా రాహిత్యం వల్ల, ఆస్పత్రి పథికుల నిర్వాకం వల్ల, బండ్రేవు కోడు మురుగు కాల్వ, వంతెన పరిసరాలు ప్లాస్టిక్ సంచులతో ఎంగిలాకుల్తో - గోనె సంచుల్తో ఆకులలముల్తో పిచ్చి, ముళ్ల మొక్కల్తో - ఊరి కశ్మల దరిద్రమంతా అక్కడే పోగుబడినట్లుగా ఉన్నది.

           

            6.00 తర్వాత సూర్య భగవానుడు తొంగి చూసేవేళకు పాతికమంది శ్రమదానంతో ఎలా రూపొందింది? పెద్ద ట్రాక్టర్ నిండా వ్యర్ధాలు వచ్చి, ఖాళీ మద్యం సీసాల, పాలపాకెట్ల, గోనె సంచుల, ఎండు తుక్కులన్నీ తొలగి, కొన్ని చెట్లు సుందరీకరింపబడి, ముళ్లచెట్లు ఖండిపబడి..... పరిశుభ్రత ఇష్టపడేవాళ్లకి, అందాన్ని ఆస్వాదించేవాళ్లకి, ఏకొంచెమైనా సామాజిక స్పృహ ఉన్న వాళ్లకి మళ్లీ మళ్లీ చూడాలనిపించడం లేదూ?

 

- పై పనులు కాక, ఇద్దరు గౌడ వీధిని ఊడ్వడమూ

 

- నలుగురు మురుగు కాల్వ అంచుల దాక వెళ్లి, తీగల్ని తొలగించి, చెట్లను అందగించడమూ

 

- వెలుతురు వచ్చాక చాలమంది పాతిక గద్దగోరు పూల మొక్కలకు గోతులు త్రవ్వి నాటడమూ

 

- ఎక్కువ మంది ఆస్పత్రి వైపుగా మురుగు కాల్వ కట్టను బాగుచేయడమూ వంటివి నేటి శ్రమదాన ఫలితాలే!

 

            6.30 కి స్వచ్చోద్యమ ఆశయాల్ని మూడు నినాదాలుగా చాటి చెప్పినది తూములూరి లక్ష్మణరావు! మధ్యాహ్నం 3.30 సమయానికి ప్రయాణ సన్నద్దులు కావాలని కార్యకర్తలకు గుర్తుచేసినది దాసరి రామకృష్ణ ప్రసాదు!

 

            దావణగెరే కన్నడ యాత్ర దృష్ట్యా మన శ్రమదాన పునః ప్రారంభం బుధవారం వేకువనే! కలయిక చోటు - 1 వ వార్డులోని బాలికల వసతి గృహం ఎదుట!

 

             సమర్పిస్తాం మా ప్రణామం – 52

 

మీది స్వచ్చోద్యమ వినోదం - నాది ఒక భావుక ప్రమోదం

మీది శ్రామిక సుప్రభాతం - నాది మీ స్ఫూర్తి ప్రచారం

ఉభయులది స్వగ్రామ ప్రగతుల కూత మిచ్చే సదుద్దేశం

అంతిమంగా ప్రజాభ్యున్నతి - కట్టి వారికి సత్ర్పణామం!

             

ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

02.12.2021.