2290* వ రోజు....           03-Dec-2021

ఒక్కసారికి మాత్రమే వాడి పారేసే వస్తువులను వాడనే వాడము.

2290* వ నాటి సంఘటిత కన్నడ యాత్ర.

గురువారం సాయంత్రం 3.30 కు చల్లపల్లిలో మొదలైన ఆ యాత్ర ఉదయం 6 గంటలకు కన్నడ దేశంలో ప్రవేశించింది. హోస్ పేట లో రైలు దిగి దావణగిరెలోని వేమూరి అర్జునరావు ఇంటికి 12 గంటలకు చేరుకుని 3, 4 గంటల పాటు పరామర్శగా - స్వచ్చోద్యమ సంధానంగా ఆతని కుటుంబ ఆత్మీయ ఆతిథ్యంగా - భావోద్వేగ వీడ్కోలుగా కొనసాగిన ఒక ప్రత్యేక సన్నివేశమది.

మరి అతడేమో 85 - 86 ఏళ్ళ ద్వితీయ బాల్యంలో ఉన్న చల్లపల్లి స్వచ్చోద్యమ కారుడు 83 ఏళ్ల ఆయన జీవన సహచరి - శకుంతలమ్మకు రెండు వారాల క్రితం మృత్య రూపంలో జీవన సాఫల్యం పురస్కారం లభించింది. సదరు సంఘటన తాలూకు ఉద్వేగాల, సహానుబూతుల నెమరువేతలే ఈ 29 మంది చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల 3, 4 గంటల కార్యక్రమమైపోయింది.

అక్కడి రోడ్డుపైన కూడా చల్లపల్లిలో సన్నివేశమే. 85 ఏళ్ల స్వచ్ఛ బాల వృద్ధుడు మూడు మార్లు తనివితీరా ప్రకటించిన గ్రామ స్వచ్ఛ పరిశుభ్ర సౌందర్య సంపాదక నినాదాలే! అది చూసి, విని ఆ వీధి కన్నడిగుల ఆశ్చర్య సందోహమే! సాంప్రదాయబద్ధమైన సకల మర్యాదా సమంచితమైన వీడ్కోలుతో దావణగిరె వదలి మరల కార్యకర్తల హోస్ పేట ప్రయాణము.

శకుంతల గారి జ్ఞాపకార్ధంగా అర్జునరావు గారి స్వచ్చోద్యమ విరాళం 15 వేల రూపాయలు సరే, ఈ ఉదయం రైలు భోగీలో విలక్షణంగా కనిపిస్తున్న - ప్రవర్తిస్తున్న చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తలను పరిచయం చేసుకుని సుదీర్ఘ గ్రామ మెరుగుదల కృషిని తెలుసుకొని మహదాశ్చర్య చకితుడైన ఒక ప్రయాణికుడు రాజశేఖర రాయుడు అనే విశ్రాంత ఉన్నతోద్యోగి తన సద్యః విరాళంగా 1,000/- ఇవ్వడం అరుదైన విశేషం.

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

03.12.2021.