1893* వ రోజు....           17-Jan-2020

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!   

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1893* వ నాటి శ్రమదాన ఆనందం.

 

డాక్టరమ్మ గారికి, హాస్పటల్ నర్సులకు - ఆఖరికి డి.ఆర్.కె. ప్రసాదు గారికి కూడ (కొంత సమయం) అత్యవసర శస్త్ర చికిత్స వలన రా వీలుపడక-స్థానిక మహిళలు కూడ పాల్గొనని-ఈ నాటి వేకువ 4.02-6.15 నిముషాల మధ్య గంగులవారిపాలెం బాట దక్షిణపు మలుపు నుండి తూర్పు దిశగా సాగిన స్వచ్చంద శ్రమదానం లో పాల్గొన్న కార్యకర్తలు 26 మందే. ఏకైక మహిళా ప్రతినిధ్యం నేటి విశేషం!

 

ఇతర విశేషాలు:  

- పెద్ద మురుగు కాల్వ మలుపు దగ్గర ఐదారుగురు స్వచ్చ కార్మికులు చేసిన చోటనే-నాలుగవ మారు కూడ మళ్లీ పారలతో, కత్తులతో, గోకుడు పారలతో మొన్నటి జారిపోయిన కొన్ని మొక్కలను సమూలంగా పెకలించి, చెక్కి, గోకి, అద్దంలా ఉందో లేదో పరీక్షించు కొని గాని వదలలేదు. అది వాళ్లు తల పెట్టిన కార్య పరిపూర్ణతానందం మరి!

 

- ఇదే బాట మలుపు నుండి తూర్పు దిశగా- ముఖ్యంగా దారి దక్షిణ భాగములో కొంత ఏడెనిమిది మందికి పని కల్పించింది. గతంలో తాము పెట్టి, పెంచిన మొక్కలిపుడు వృక్షాలై, కొమ్మలు అదుపు తప్పి, పాదుల్లో కలుపు పెరిగి పోగా అన్నిటినీ చక్కదిద్ది, సదరు వ్యర్ధాలను బండ్రేవు కోడు కాల్వ ఉత్తరపు టంచు కోసుకొని పోకుండ సర్ది వేశారు.

 

- ఒక జంటకు పని జరుగుతున్నంత మేర చీపుళ్లతో దారిని ఊడ్చి, శుభ్రం చేయడమే చేతి నిండా పని.

 

సామాజిక ఋణం చెల్లింపుకు, నిష్కామ కర్మకు అసలైన అర్థం ఈ 1893 రోజుల కార్యకర్తల ప్రజోపయుక్త కృషిలో చూడగలగడం నా అదృష్టం!

 

6.35 నిముషాలకు సమీక్షా సమావేశంలో ఉత్సాహంగా ముందుకు వచ్చి, స్వగ్రామ స్వచ్చ-శుభ్ర-సుందర సంకల్ప నినాదాలను గట్టిగా ప్రకటించిన అంజయ్య గారు 6.40 కు నేటి మన గ్రామ సామాజిక బాధ్యతను రేపటికి వాయిదా వేశారు.

 

రేపటి హరిత-స్వచ్చ- సుందరీకరణ కృషి కోసం గంగులవారిపాలెం మార్గంలో ని ఈ నాటి స్థావరం దగ్గరే కలుసుకొందాం!

 

          ప్రతి మారూ ప్రకటిస్తా

చెమటలు చిందిస్తే నర జన్మ ధన్యమౌతుందని..

అది ఉమ్మడి సంక్షేమానికి అర్పితమగుటే మేలని...

అందుకొరకే స్వచ్చ- శుభ్ర- సుందరీకరణం అని...

స్వచ్చోద్యమ చల్లపల్లి చాటుచుండె చూడండని...

   నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు,

శుక్రవారం – 17/01/2020

                                                       చల్లపల్లి.