2291* వ రోజు....           04-Dec-2021

ఒకే ఒక్క పర్యాయం వాడదగిన ప్లాస్టిక్ వస్తువులను వాడము గాక వాడం!

2291* వ స్వచ్చోద్యమకారుల విజ్ఞాన వినోద విహార యాత్ర - 2

          హోస్ పేట (నాగులాపురం) లోని ప్రియదర్శిని నుండి ఉదయం 7.30 కు మొదలైన హంపి చారిత్రక జిజ్ఞాసా విహారం 12 గంటల దాక కొనసాగింది. ఈ 29 మంది స్వచ్ఛంద శ్రమదాతలను అలనాటి 16 వ శతాబ్దపు వైభవోపేత విజయ నగర సామ్రాజ్య శిధిలావశేషాలను స్మరింపజేసి ఆంధ్ర భోజుని సాహిత్య - సమరాంగణ - కళా సార్వ భౌమత్వాన్ని అనుభూతి చెందించింది.

          అది తుళువ వంశస్తుల కుల దైవం విరూపాక్షాలయం కావచ్చు, నేల మట్టమైన రాజాధిరాజుల చందన సౌధాలు గానీ, గజశాలలే కావచ్చు, కృష్ణరాయల దేవేరి నర్తించిన నాట్య మండపమే కావచ్చు, దాని ఎదురుగా ఏక శిలా రధమే కావచ్చు, సప్త స్వర సంగీత స్తంభాలే కావచ్చు. ఏ ఒక్క దాని మీద అయినా ప్రతి అంగుళం - ప్రతి అణువు అద్భుత శిల్ప సుందరమే. ప్రతిదీ ఈ బృందాన్ని చారత్రక కాలంలోకి నడిపించినట్లుంది!

          అటు పిమ్మట ఆని గొంది మీదుగా సానాపుర వాస్తవ్యులు సాంబశివరావు గారి ఆత్మీయ ఆతిధ్యం - ఆ తరువాత హోస్ పేటకు తిరుగు టపా. మళ్లీ విజయవాడకు రైలు ప్రయాణం.

          హోస్ పేటలో హనుమంతరావు గారి ప్రత్యేక ఆతిధ్య పర్యవేక్షణ గాని దావణగిరెలో అర్జునరావు కుటుంబీకుల భోజన భాజనాలు గానీ చల్లపల్లి స్వచ్ఛంద సేవకులకు చిరస్మరణీయాలే.

          ఇక మన స్వగ్రామ బాధ్యతా నిర్వహణ సంగతికొస్తే - బుధవారం నాటి వేకువ మన శ్రమదాన కర్మక్షేత్రం 1 వ వార్డులోని బాలికల వసతి గృహం దగ్గరే మనం కలుసుకోవలసి ఉన్నది.

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

04.12.2021.