2293* వ రోజు....           07-Dec-2021

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

 

2293* వ నాటి వేకువ సైతం రెస్క్యూదళ రహదారి బాధ్యతా విన్యాసం.

 

          ఈ మంగళవారం వేకువసైతం రెస్క్యూదళం ఆరుగురు సభ్యులదీ అదే వరస! విజయవాడ మార్గానికిరు ప్రక్కల వృర్ధం గాను – అడ్డం గాను పడి ఉన్న తారు పెచ్చుల్ని, రాతి పెంకు ముక్కల్ని ఏరడం, ట్రక్కులో కెత్తడం, RTC బస్టాండు ప్రవేశ - నిష్క్రమణ మార్గాల (3 పెద్దవి + 1 చిన్న) గుంటల్లో శ్రద్ధగా, పొందికగా సర్దడం !

 

          ఇంత సుదీర్ఘ సమయంలో ఊరి వాళ్లెందరు కలిసి రాకున్నా తమ బాధ్యత తాము నెరవేరుస్తూ -చాతనైనంతగా మెరుగుపరుస్తూ పయనిస్తున్న ఈ కార్యకర్తలు కాక నిష్కామ కర్మిష్టులింకెవరు? వీళ్లది వ్యసనమంటారో – తిక్క అంటారో – వెఱ్ఱి అంటారో అనండి! కాని చల్లపల్లి సంపూర్ణ పరిశుభ్ర – స్వచ్చ – సౌందర్యాలు ఏనాటికైనా ఈ పిచ్చోళ్ళతోటే సాధ్యం!

 

          బస్టాండులోని 4 గుంటల పూడికలో సుమారు రెండు గంటలు శ్రమించాక - 6.50 సమయంలో కస్తూరి విజయ్ ముమ్మారు చాటించిన గ్రామ త్రివిధ సౌభాగ్య సంకల్ప నినాదాల పిమ్మట నేటి వీరి బాధ్యత ముగింపు.

 

          రేపటి మన గ్రామ సామాజిక విధి నిర్వహణ కోసం 1 వ వార్డులోని బాలికల హాస్టల్ దగ్గరే బుధవారం వేకువ మన పునర్దర్శనం!

 

          సాహో! రెస్క్యూ దళమా!

 

రోడ్లు మలిన పరచుటన్న - ఆక్రమించి చూపుటన్న

అంగళ్లకు రోజు వారి అద్దెకిచ్చుటన్న - నేటి

పచ్చినిజం; తద్భిన్నం స్వచ్ఛ కార్యకర్త మాట - 

గుంట పూడ్చి, జనం మేలు కోరెడి ఒక రాచబాట!

           

ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

07.12.2021.