2294* వ రోజు....           08-Dec-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

 

         బందరు రోడ్డు నుండి 1 వార్డు వడ్లమర దాక వీధి పారిశుద్ధ్యం @2294*

          ఈ బుధవారం (8-12-21) నాటి పారిశుద్ధ్య ప్రయత్నం 28 మంది కార్యకర్తలది. ప్రారంభం 4.17 కు, ముగింపు 6.10 నిముషాలకు - బాలికల వసతి గృహం కేంద్రంగా 2 వీధుల్లో ½ కిలోమీటరు పర్యంతం! ఇందులో కళాశాలకు ఉషోదయ వాహ్యాళికై వెళుతూ - ఆగిపోయిన పాత కార్యకర్త భాగస్వామ్యమూ ఉన్నది.

          నేటి 50 పనిగంటల శ్రమదాన వివరమూ, తన్మూలంగా శ్రమ, సమయ దాతల సంతృప్తి, మొత్తంగా ఊరికి దొరికిన ఫలితమూ ఏదనగా:

- బందరు రహదారి మొదలుకొని, చర్చి మీదుగా, బాలికల వసతి గృహం ఎదుట - పద్మాలు దాటి, ఇటు శ్మశాన వీధిలో కొంత భాగమూ, అటు భారతలక్ష్మి వడ్లమర దాక, కాస్తంత స్వచ్ఛ, శుభ్ర స్పృహ ఉన్న వారి దృష్టికి ఆహ్లాదకరంగా మారడం!

- మరి ఈ మాత్రం మెరుగుదల కోసమే 10 మంది మురుగు కాల్వ రెండు గట్ల మీద గంటకు పైగా శ్రమించారు; ఇక్కడి ఉద్యానం వెలుపల పెరిగిన గడ్డిని, పిచ్చి మొక్కల్ని ఐదుగురు వ్యవసాయ పొలంలో మునుంలో కూర్చొన్నట్లుగా శ్రద్ధగా కొడవళ్లతో తొలగించుకొంటూపోయారు!

- మరి కొందరైతే శ్మశాన వీధి మొదట్లో గొర్రు - చీపుళ్లతో కష్టపడితే గాని, క్రమశిక్షణ లేని చెట్ల కొమ్మలు కత్తిరిస్తూ పనిలో లీనమైతే గాని ఈ పాటి స్వచ్ఛ సుందర రహదారి ఆకృతి ఈ మాత్రంగా తయారైంది!

- ఇక సుందరీకరణ కార్యకర్తలైతే - గోకుడు పారల్తోను, రైల్వే పారల్తోను రోడ్డు మార్జిన్లను గోకి, చెక్కి పూల మొక్కలకి మర్యాద - మప్పితం నేర్పి, ప్లాస్టిక్ తుక్కును, ఖాళీ సారాసీసాలను సేకరించి..... వాళ్ల ప్రయత్నం షరామామూలే!

          ఐతే - ఏమాటకామాటే చెప్పుకోవాలి - ఈ రెండుగంటల, 28 మంది శ్రమదాన వేళలో పాతిక ముప్పై ద్విచక్రవాహనాలూ - 20 ఇసుక బళ్లూ వస్తూ పోతున్నా ఎవరు ఆగి, పరిశీలించి, స్వచ్చోద్యమాన్ని పరామర్శించి, అర్థంచేసుకొని, అభినందించారు గనుక? సామాజిక - సామాన్య - సగటు సజీవ పౌరుల జిజ్ఞాస ఇలా ఉంది మరి!

          6.30 కు పని ముగిసిన కాఫీ వేళ మనకోసం మనంమేనేజింగ్ ట్రస్టీకి ఎప్పటిలాగే 2,000/- నెలవారీ విరాళం సమర్పించినదీ, 83 ఏళ్ల వయసులో సైతం వేకువనే వచ్చి పాల్గొని ముమ్మారు స్వగ్రామ స్వచ్ఛ - పరిశుభ్ర సౌందర్యాల ఆరాటాన్ని నినదించినదీ డాక్టరు మాలెంపాటి గోపాలకృష్ణయ్య గారు. డిసెంబరు తొలివారం నాటి కర్నాటక పర్యాటకాన్ని ప్రస్తావించినదీ, నేటి కార్యకర్తల శ్రమను బాగా గుర్తించి - సముచిత సమీక్ష జరిపినదీ ఇంకో డాక్టరు - DRK గారు!

          1వ వార్డు ప్రధాన బైపాస్ వీధిలో మిగిలిన పారిశుద్ధ్యం సంగతి చూసేందుకు రేపటి వేకువ సైతం మనం బాలికల హాస్టల్ దగ్గరే కలువవలసి ఉన్నది!

 

      సమర్పిస్తున్నాం ప్రణామం – 53

చేజిక్కిన స్వస్త - సౌఖ్య చిద్విలాసములు పట్టక

స్వచ్ఛ సైన్య భగీరథ ప్రయత్నాలు గమనించక

సామూహిక - సామాజిక శ్రమదానం చవిచూడక

ఇంకా మిగిలిన ప్రజలకు ఇదిగో మా ప్రణామం!

 

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త &

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

08.12.2021.