2295* వ రోజు....           09-Dec-2021

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

ఎడతెగని ఊరి సంక్షేమ ప్రయత్నంలో ఇది 2295* వ నాడు.

          చల్లపల్లి స్వచ్చోద్యమ విలాసంలో నిన్నటిలాంటి కధే! గురువారం వేకువ 4.19 కే 15 మంది, కొన్ని నిముషాల ఎడంలో గబగబా వచ్చి కలిసిన అంతేమందీ వెరసి 30 మంది కార్యదక్షతతో 9-12-21 న మెరుగులు దిద్దుకొన్నది శ్మశానం దిశగా 1 వ వార్డుకు చెందిన వీధిలో 100 గజాలకు పైగా.

          ఈ 30 మందిలో దుబాయి నుండి రాత్రి వచ్చిన యువతి, ముగ్గురు డాక్టర్లు, సకుటుంబంగా గ్రామ సర్పంచి, ఉద్యోగ జీవులు, పింఛన్ల వృద్ధులు, రైతులు, గృహిణులు, మెకానిక్కులు.. అన్ని వర్గాల వారు ఉన్నారు; వాళ్ల వయసులు, స్థితి గతులు వేరైనా గమ్యం ఒకటే; వేలాది రోజులుగా వాళ్లు చెమటలు చిందించేది సొంతలాభం కొంచెం కూడాలేని ఊరి ఉమ్మడి స్పస్తతా సౌలభ్యం కోసం గనుకనే చల్లపల్లి స్వచ్ఛోద్యమాని కింతటి అనివార్యమైన గుర్తింపు!

          ఎవరో సినిమా కవి వ్రాసినట్లు ఒకటే జననం - ఒకటే మరణం - ఒకటే గమ్యం గెలుపు పొందువరకూ అలుపులేదు మనకూ .....అనుకొంటూ తమ కాలాన్ని, ధనాన్ని, శక్తియుక్తుల్ని తమకాశ్రయ మిస్తున్న గ్రామానికి సంతర్పణ చేస్తూ విక్రమిస్తున్న చల్లపల్లి స్వచ్ఛంద శ్రమదాతలంటే నాలాంటి రచయితల కింతటి ఎనలేని గౌరవం!

          వీళ్ల తాత్విక సంపద, క్షేత్ర స్థాయిలో సముచిత సదాచరణ, ఏనాటికైనా స్వగ్రామ స్వచ్ఛ స్వస్త శుభ్ర - సౌందర్యాలు సాధించాలనే ఉడుం - మంకు పట్టు ఎంతగా ఆదర్శనీయాలైతే కావచ్చు గాని, కార్యకర్తల 8 ఏళ్ల భగీరథ ప్రయత్నం పాతిక - ముప్పై వేల మంది జనంలో సగం మందిలో సరిపడినంత స్ఫూర్తిని రగిలించలేక పోతున్నదా అనే కొందరు సందేహజీవుల ప్రశ్న!

          ఈ వేకువ స్వచ్ఛ ప్రయత్న గణాంకాలకొస్తే :

1) నేనలా చూస్తుండగానే పెద్ద ట్రాక్టరు ట్రక్కులో పట్టక ఎత్తుగా పేర్చిన 20 మంది కార్యకర్తల సముపార్జిత వివిధ వ్యర్థాలు

2) అదేం తెగింపోగాని ఒక కసితో రోడ్డు కిరు ప్రక్కల పిచ్చిచెట్లు నరికి, ముళ్ల చెట్లు తొలగించి, ఎక్కడెక్కడి ఎంగిలాకుల్ని సారాసీసాల్ని చకచకాలాగి, ఊడ్చి, డిప్పల్లో సర్ది, ట్రక్కులోకి రవాణా చేస్తున్న స్త్రీ, పురుష, కర్మవీరులూ

3) కాల్వలో దిగి, కొబ్బరి బొండాల్ని - ప్లాస్టిక్ తుక్కుల్ని - పుల్లా పుడకల్ని తొలగించి, మురుగు గమనాన్ని సాఫీగా మారుస్తున్న ఇద్దరు ముగ్గురు ధన్యులూ

4) ఇవి గాక - కాలుష్యం మీద తమ కళ్ళెదుటే ఇంతటి కదనం సాగుతుంటే చోద్యం చూస్తున్న సమీప గృహస్తులూ -- ఇలాంటి వింత దృశ్యాలన్నీ షరామామూలే!

          కాఫీ సమయం పిదప ఊరి అద్భుత భవితవ్య త్రివిధ నినాదాలిచ్చింది ఫైడిపాముల రాజేంద్ర ఐతే - ముక్తాయించింది గ్రామ సర్పంచి కృష్ణకుమారి! పెద్ద వయసు అసౌకర్యాలను అధిగమించిన స్వచ్చ కార్యకర్త కోడూరి వేంకటేశ్వరరావు నెలవారీ విరాళం 520/- మేనేజంగ్ ట్రస్టీకి అందినది!

          రేపటి మన స్వచ్ఛోద్యమ వినోదం కూడ 1 వ వార్డు సమీప శ్మశాన రహదారిలోనే!

 

          సమర్పిస్తున్నాం ప్రణామం 54

ఏకధాటిగ మహోద్యమముగ - ఇన్ని వేలదినాల సేవలు

అహోరాత్రములొకే ధ్యాసై - అన్ని తలపుల దొకే బాటై

లక్ష్య సాధనకై తపించు విలక్షణులు ఈ కార్యకర్తలు

మహాదర్శాల విలువకు మేము అర్పిస్తాం ప్రణామం!

         

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త &

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

09.12.2021.