2296* వ రోజు....           10-Dec-2021

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

 

నిన్నటి వీధిలోనే 27 మంది శ్రమదాతల 2 గంటల కృషి @2296*

 

          శుక్రవారం వేకువ 4.17 కే 15+12 మంది- అదే 1 వవార్డులో శ్మశాన సమీపం దాక చేసిన ప్రయత్నం ఫలించింది. 6.30 సమయానికి ఆఫలితం తాలూకు సంతృప్తి కార్యకర్తల ముఖాల్లో కనిపించింది. గ్రామ వీధుల- మురుగు కాల్వల- సందుగొందుల- కాల్వగట్టుల పరిశుభ్రతే, పచ్చదనమే సౌందర్య కృషే తమ జీవితంలో ఒక భాగంగా

8 ఏళ్లుగా ప్రస్థానిస్తున్న ఈ స్వచంద కార్మికులెంత ధన్యులో నాకు మరోమారు స్పష్టమైంది. 

 

          కార్యకర్తల శుభోదయ శ్రమదానం రోజులో 2 గంటలకే పరిమితం అనుకొనేరు! వాళ్ల మనసుల్లో గూడు కట్టుకొన్న  గ్రామ మెరుగుదల సంకల్పంతో ఈ స్వచ్చోద్యమ పతాకం ఇందులో ఏ కొందరి రూపంలోనో- ట్రస్టు కార్మికుల రకరకాల విన్యాసాలు గానో ఈ ఉద్యమ సైద్ధాంతిక కారుల మేథో శ్రమగానో ఊళ్లో ఏదో ఒక చోట ఎగురుతూనే ఉంటుంది. లేకపోతే ఇంత పెద్ద గ్రామం 150 మంది కార్యకర్తలతోనే ఈ మాత్రం శుభ్ర-సుందరంగాను, కొంత ఆదర్శం గానూ, ఎలా నిలుస్తున్నదనుకొన్నారు?

 

          చల్లపల్లి లో ఈ వేకువనే  నాకు కన్పించిన రెండు భిన్న దృశ్యాలివి:

 

చర్చిల్లో, మసీదులో, మందిరాల్లో బోధనలూ, ఆరాధనలూ, పడిపూజలూ- తత్సంబంధిత చిరు వ్యాపారాలూ ఒక ప్రక్క;

 

శ్మశాన వీధిలోను, సాగర్ బైపాస్ మార్గంలోను తమ లాభంకోసమో, మోక్షం కోసమో కాక- ఊరి స్వస్తత కోసం ఆహ్లాదంకోసం తపిస్తున్న శ్రమిస్తున్న కార్యకర్తల శ్రమజీవన సౌభాగ్యం మరో ప్రక్క ;

ఈ రెండిటిలో నా ఓటు మాత్రం స్వచ్చోద్యమానికే!

 

-సుందరీ కర్తల బృందం మాత్రం నిన్న ఇతర కార్యకర్తలు బాగుచేసిన చోటునే ఈ ఉదయం కూడ పట్టి పట్టి క్షుణ్ణంగా మెరుగు పరిచారు. వీరిలో ఒకరిద్దరికైతే 100 కు వంద మార్కులు పడకుంటే రాత్రికి నిద్రపట్టదనుకొంటా!)

-10 మంది కత్తుల వాళ్లు, వీళ్లకనుబంధంగా ఇద్దరు దంతెల, మరొకరిద్దరు చీపుళ్ల వారైతే-బైపాస్ వీధి రెండు ప్రక్కలా కాలుష్యం మీద వీరవిహారం చేశారు.  వాళ్లకు పోయిందేముంది - ఒంట్లో చెమట తప్ప!

 

-గడ్డిచెక్కే, మొక్కల్ని కత్తిరించే, పాదుల్ని నవీకరించే నానా రకాల చెత్తను- దుమ్మును- ఆకుల్ని ఊడ్చే- ఏరే ట్రాక్టర్లోకి చేరవేసే- ఏ కార్యకర్తల పని వాళ్లు నెరవేర్చారు.

 

          ప్రక్కనుండి మైకులో విన్పించే పాటలతోను, వీరిలో కొందరు పేల్చే జోకులతోను, హెచ్చరికల తోనూ, మంచి నీళ్లందించే వృద్ధ వైద్యుని పరామర్శలతోనుకార్యకర్తల కింకా శ్రమ అనేది తెలుస్తుందా? అందుకే ఇదేమీ, బలవంతపు బ్రాహ్మణ్యమో-ముక్కుతూ, మూల్గుతూ భారంగా చేసే శ్రమదానమో కానేకాదు-ఇదోక సందడి, ఇదొక వేడుక! అందుకే ఇది 2 వేల దినాలే కాదు-5వేల దినాలైనా- ఈ గ్రామం నూటికి నూరుశాతం మారేదాక నిరంతర ప్రక్రియగా సాగుతుందని నా నమ్మకం!

 

          కస్తూరి విజయ్ పట్టి పట్టి ముమ్మారు కీర్తించిన స్వచ్ఛ-పరిశుభ్ర సౌందర్య, సంకల్ప నినాదాలతో , DRK గారి సమయానుగుణ సమీక్షతో నేటి కృషికి ముగింపు.

 

ఇదే బైపాస్ వీధిలో ఇటు వడ్లమర రోడ్డునూ, అటు అశోకనగర దిశనూ సంస్కరించేందుకు గాను రేపటి వేకువ మన పునర్దర్శనం ఉండగలదు!

సమర్పిస్తున్నాం ప్రణామం – 55

పెంట కుప్పలు వీధిలోనా? గేదెలుండుట రోడ్లపైనా?

మురుగు గుంటలు చెత్త కొరకా- దోమలీగల నిలయములుగా?

 గ్రామమంతటి స్వచ్ఛబాధ్యత కార్యకర్తలె మోయవలెనా

ఇట్టి ధోరణి మార్చగలిగిన స్వచ్ఛసంస్కృతికే ప్రణామం!

           

ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

10.12.2021.

నిన్న
నేడు