2297* వ రోజు....           11-Dec-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

 

2297* వ నాటి శ్రమ త్యాగం కూడ భారత లక్ష్మిధాన్యం మర వీధిలోనే.

 

           శనివారం నాటి శ్రమదాతలు 28 మందైతే- సుముహూర్తం 4.20 నుండి 6.10 దాక! అక్కడి అపార్ట్ మెంట్లకు ఉత్తర, తూర్పు దిశగా, ప్రాతః స్మరణీయుడు వాసిరెడ్డి కోటేశ్వర రావు చిరు ఉద్యానవనం దాక- రోడ్లు బాగుపడడ మేముంది గాని – రోడ్ల మార్జిన్ల స్వచ్ఛ – పరిశుభ్రతా సాధనే ఇవాళటి ప్రధాన వ్యాపకం! వేకువ4.00  కు ముందున్న ఈ బాటకు – 6.30 తరువాత వీధికి ఎంత వ్యతాసం!

 

          "నాలుగైదు నాళ్లుగా రోజూ 30 మంది కార్యకర్తలుఊడబొడిచింది ఈ 1 ½  కిలోమీటర్ల కాలుష్యాన్నేనా...." అని నాకైతే అనిపించదు. వెయ్యి మంది బాధ్యతా రహితుల అవాంఛిత- అనాలోచిత నిత్యకృత్యాలతో పుట్టుకొచ్చే, కశ్మల శిరో భారానికీ, రకరకాల వ్యర్థాల గుట్టలకీ సమాధానం చెప్పబూనుకొన్నది ఈ పాతిక ముప్పై ముందే గదా మరి!

 

          నేటి కార్యకర్తల పారిశుద్ధ్య కృషి తర్వాత కూడ- 6.30 కు జై స్వచ్చ చల్లపల్లి సైన్యంవాట్సాప్ గ్రూపు లో ఏం కనిస్తున్నది? ఒక పాత సినిమాపాటలో ఆత్రేయ ఆహో! ఆంధ్రభోజా! శ్రీకృష్ణదేవరాయా....!

 

          ఒక వంక ఉరికించు యుద్ధ భేరీలూ. ఒక ప్రక్క “శృంగార మొలుకు నాట్యాలు...... “ అని వ్రాసినట్లుగానే నేటి 50 పని గంటల ప్రయత్నంలో అద్దంలా దర్శనీయంగా మారిన రెండు రోడ్లు ఒక ప్రక్క; రోడ్డు ప్రక్కనే ప్లాస్టిక్-కొబ్బరి టెంకల- వాడేసిన మందు సీసాల- ఇసుక- రాతి ముక్కల గుట్టల పెన్నిధులింకో ప్రక్క కనిపించడం లేదూ ? (వీటినీ ట్రాక్టర్ కెత్తి తొలగించి తరలించేవారే గాని- వాటి అజ్ఞాత యజమానులెవరో తెలియక- అనుమతి తీసుకోజాలక- కార్యకర్తలు వదిలేశారు).

 

          రోడ్లనో-ఇంటినో- పరిసరాలనో ఏ కాస్తయినా బాగుచేయడమెంత కష్టమో, నిముషాల్లోనే చెడగొట్టడమెంత సులభమో అటు  స్వచ్ఛ శ్రమదాతలకు – ఇటు కొందరు గ్రామస్తులకు అనుభవైక వేద్యం! ఐనా ఈ సహన శీలురు ఏ బాధ్యతా రహిత గ్రామస్తుల్ని నిందించలేదు; ఇలా మురుగుకాల్వలు బాగుచేయడాన్ని- వీధుల్ని తుడవడాన్ని- సుమ సుందర హరిత సౌకర్యాలను ఊరి కంకితం చేయడాన్ని అదృష్టంగానో- కనీస సామాజిక కర్తవ్యం గానో భావించి చేసుకుపోతూనే ఉన్నారు.

          ఈనాటి పారిశుద్ధ్య ప్రయత్నంలో ముఖ్యాంశాలు:

 

- వడ్లమర వీధి కూడలి మలుపులో ఏడెనిమిది మంది పారలతో, డిప్పలతో డ్రైన్ల ఎండు మట్టిని మోసి, ఎత్తు పల్లాల్ని సమంచేసి, ఇటుక రాళ్లు సర్ది వాహనదారులకు సౌకర్యం కల్పించిన కృషి ఒకటీ-

 

- అసహ్యంగా పడి ఉన్న (వీటన్నిటిని ఆ సమీప గృహస్తులెలా భరిస్తారో తెలియదు!)

కొబ్బరి బొండాల అవశేషాలను దూరంగా ఉన్న ట్రాక్టర్లోకి మోసిన మరొక చర్యా

 

- ట్రాక్టరు మీద ఎక్కిన ఒకాయన కుడి కన్ను బహుశా ఏ కందిరీగ కుట్టినందుకో-

రెట్టింపైన వైన మొకటీ...

 

- వేగంగా ఆకుల దుర్గా ప్రసాదు మూడుమార్లు నినదించడమొకటీ....

 

రేపటి వేకువ అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు ఏకరూప దుస్తులతో, గుర్తింపు కార్డులతో మన స్వచ్చ సుందర శ్మశానం దగ్గర కలుసుకోవలసి ఉన్నది.

 

          సమర్పిస్తున్నాం ప్రణామం – 56

ప్రజల చొరవకు- ప్రగతిమెట్లకు బాట చూపే మీ ప్రయత్నం,

స్వస్త సుందర గ్రామ సృష్టికి సాహసించిన మహోద్దేశం,

అందుకనువుగ వేలనాళ్లుగ అహోరాత్రము లింత సహనం,

నా కవిత్వపు సరుకు - లందుకె నా మనః పూర్వక ప్రణామం!

           

ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

11.12.2021.