2298* వ రోజు....           12-Dec-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

 

2298*వ వేకువ సమయపు దహన వాటికావిష్కరణ వగైరాలు.

 

          అది చిల్లలవాగు గట్టు పైన –డంపింగ్ కేంద్రానికి ముందర గ్రామ ప్రధాన రుద్ర భూమి! ఈ ఆదివారం బ్రహ్మ ముహూర్తాన అక్కడ ఆసీనులైన 66 మందిలో స్వచ్చ కార్యకర్తలు కాక, కొందరు గ్రామ ప్రముఖులు, రెవిన్యూ, పంచాయతీ అధికారులు, పాలకులు!

 

          “... ఇది మరణ దూత తీక్షణ దృక్కులొలయ

                     అవని పాలించు భస్మ సింహాసనంబు” అని జాషువా కవి వర్ణించిన శ్మశానంలో 4.40 కి ఈ మంచులో – చలి గాలిలో ఏమిటట ఈ సమావేశం? అంటే- చల్లపల్లి స్వచ్చోద్యమ సంగతులన్నీ ఇలాగే ఉంటాయి మరి!

 

          అసలు విషయమేమంటే- తరిగోపుల వంశీకులైన బి.కాం. కోటేశ్వర రావు-బుల్లెమ్మ దంపతుల సంస్మరణంగా నిర్మించిన-సకల సౌకర్యవంతమైన దహన వాటికల్ని చల్లపల్లి కంకితమిస్తున్న సందర్భం!

 

          “మన గ్రామానికి నిన్న ఏ మంచి చేశాం? ఈ రోజు ఏం ఒరగబెట్టాం? నిన్నటి, నేటి అనుభవంతో గ్రామస్తుల సౌకర్యం, స్వస్తత కోసం రేపు ఇంకా ఏం చేయగలం.....?” అని అమాయకంగా ప్రశ్నించుకొనే- ఆరాట పడే స్వచ్చంద శ్రమ దాతల కాయ కష్టాలూ, ఆర్థిక-సమయ గుప్త దానాలూ, నిరాడంబరతలూ ఇలా కాక ఇంకెలా ఉంటాయి?

 

          ఈ వేళ కానీ వేళ స్వచ్చ కార్యకర్తలు సరే-ఇందరు సహృదయులు, MDO లు, సర్పంచ్ లు, వయో వృద్ధ గ్రామ పెద్దలు ఏ రాజకీయాలు అంటని- కుల మతాల కుళ్లు కంపు సోకని- ఆర్భాటాలు లేని- ఈ విలక్షణ సమావేశానికి వచ్చి,  శ్రమైక జీవన స్వచ్చోద్యమాన్ని ఇలా ఆశీర్వదించడం!  

 

          రాజకీయుల -  కుల సంఘాల గెలుపోటముల సభలకిది భిన్నం! ఆనువంశిక పదవీ లాలసలకిది కడు దూరం! స్వచ్చోద్యమ సారధి Dr.డి.ఆర్.కె. సునిశిత సింహావలోకనాలు గానీ- Dr. పద్మావతి అంతరంగ ఆవిష్కరణలు గానీ- ఇతరుల గ్రామాభ్యుదయ సూచనలుగానీ- ప్రణాళికలు గానీ- అందుకు కార్యకర్తల చప్పట్లు గానీ- అనుభవాల కలబోతలుగానీ ఒక ఉదాత్త స్వచ్చోద్యమానుగుణంగానే ఉంటాయి మరి!

 

       ఈ ఉదయం స్వచకార్యకర్తల శ్రమదానాని కొక ఆటవిడుపు! ఒకప్పటి నరకకూపమైన చోటు కాస్తా  తమ వేల పనిగంటల మొండి పట్టుతో,  వరప్రసాదరెడ్డి- గురవారెడ్డి తదితరుల భూరి విరాళాలతో సర్వాంగ సుందరమైన మహత్తర మహాప్రస్థానంగా మారిన సంఘటనల్ని స్మరించుకొనే- సంతృప్తి చెందే ఒక సమీక్షా వేడుక ఇది!

 

          సంకుచితత్వం, స్వార్థం, అహంభావం, అయోమయమే కాదు-చల్లపల్లిలో త్యాగం, సామాజికసంక్షేమ దృక్పథం, సాహసం, విస్పష్ట కార్యాచరణంకూడ ఉన్నవని ఈ శ్మశాన ప్రాంగణాన్ని , నిష్కల్మష స్వచ్చోద్యమ సంరంభాన్ని చూసి ఆ గ్రామస్తులు సగర్వంగా తలెత్తుకు తిరుగ దగిన ఉదాహరణలూ, సన్నివేశాలు ఇవే!

 

          నా దృష్టిలో –ఈ గ్రామ భవిష్యత్ స్వచ్చోద్యమానికి నేటి ఈ సభ ఒక దిక్సూచిక! ఈ 2021 వ ఏటి కల్మషమయ-స్వార్థపూరిత గ్రామ సమాజానికి ఒక కాంతి రేఖ!

 

బుధవారం వేకువ మనం గ్రామ మెరుగుదలకు దీక్ష వహించవలసిన చోటు సాగర్ టాకీసు ఉపమార్గంలోని అశోక్ నగర్- విజయనగర్ ప్రాంతమే!

 

     సమర్పిస్తున్నాం ప్రణామం – 57

వీధిలోపల - ఇంటి ముందర నిత్య శ్రమదానాలు చూసియు

ప్రతిదినం ఒక గంట కూడా పాల్గొనక - కష్టించకుంటే –

సిగ్గుకే సిగ్గేసి చావద? చీదరింపూ పుట్టి పోవద?

గ్రామ సోదర మహాశయులిక కదలివస్తే నాప్రణామం!

           

ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

12.12.2021.