2299*వ రోజు....           13-Dec-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

 

అక్షరాలా 2299* వ నాటి శక్తి వంచన లేని గ్రామాభ్యుదయకరచర్యలు.

 

సోమవారం (13.12.21) ఉదయ కాలపు శ్రమదానం - అది ఐదారుగురు రెస్క్యూదళ సభ్యులదే కావచ్చు - బాగుపడినది 50 గజాల నిడివి గల చిన్న బజారే కావచ్చు - శుభ్రంగానే, అందంగానే, పూల మొక్కలతో - పచ్చదనంతో ఆహ్లాదంగానే ఉన్న ఇక్కడ కూడ పట్టి పట్టి ఇంతగా వీళ్లు శ్రమించాలా?” అని చూసే వాళ్లకనిపించవచ్చు - ఊరి భద్రతే ధ్యేయంగా పెట్టుకొన్న కార్యకర్తల ఆలోచనే వేరు.

 

          గుంటలుంటే పూడ్చడం, ఇరుకు రోడ్ల అంచుల్ని పటిష్ట పరచడం, మార్జిన్లలో రాతి ఇసుక - కంకరల్ని పరచి, బాటని విశాల పరిచి, వాహన చోదకులకు మరింత వెసులు బాటు కల్పించడం, తామే నాటి - పెంచిన చెట్ల కొమ్మలు అదుపు తప్పి రోడ్ల మీదికి దురాక్రమణ చేస్తుంటే తొలగించడం.. ఇవన్నీ పైపైన చూసే వాళ్లకి చిన్న పనులే గాని - ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మాత్రం చాల ముఖ్యమైన పెద్ద పనులే!

 

          భారతలక్ష్మి వడ్లమర ఎదురుగా శనివారం ఉదయాన మిగిలిపోయిన డ్రైను మురుగుడు మట్టి దిబ్బలకి ఈ వేకువ సమయాన మోక్షం కలిగింది - చెరువు గట్టున బుల్లి ఉద్యానం దగ్గర వానలకు కోతబడి - కొట్టుకుపోయిన మట్టి - గుంటల పూడికా జరిగింది, బాట మరింతగా వెడల్పూ అయింది, అటు మట్టి గుట్టల అడ్డమూ తొలగింది!

 

          స్వచ్చ కార్యకర్తలం, గ్రామస్తులం - అందులోనూ ఆ వార్డు వీధి జనం గుర్తుపెట్టుకోవలసినదేమంటే :

- ఈ వీధి 7 ఏళ్ల క్రితం దాక అత్యంత దుర్భరం! బహిరంగ మలవిసర్జనా కేంద్రం! ముక్కు మూసుకొని నడవవలసిన పూతిగంధ హేయం! ఒకే ఒక్కడి దివంగత వాసిరెడ్డి కోటేశ్వరుని తెగువతో - చొరవతో - శ్రమతో ఇప్పుడీ మాత్రం సౌకర్యంగా ఆహ్లాదంగా ఉన్నది! మన ఊరి స్వచ్చ - సుందర హాదాను, ఇందరు గ్రామస్తుల మేలుకై శ్రమించిన ఒక కీర్తిశేషుని మనం గౌరవించడమంటే - ఈ వీధిని స్వచ్ఛ శుభ్ర - సుందరంగా నిర్వహించడం ద్వారానే!

 

          కస్తూరి శ్రీనివాసుడు 6.45 కు ముమ్మారు ధ్వనించిన నినాద ఆకాంక్షలతో నేటి శ్రమదాన పరి సమాప్తి!

 

       సమర్పిస్తున్నాం ప్రణామం 58

 

ప్రాదేశిక - ప్రామాదిక పరిస్థితులు పట్టనపుడు,

మాటలొడారింపులు - పెనుబూటకములు రెచ్చినప్పుడు,

స్వచ్చోద్యమ సంగీతం చెవికెక్కని స్థితిలోనూ

మీ పునీత శ్రమదానం! మీకెందుకె ప్రణామం!

           

ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

13.12.2021.