2300*వ రోజు....           14-Dec-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

 

రోజుల సంఖ్యాపరంగా (2300*) క్రొత్త మైలు రాయికి స్వచ్చోద్యమం.

            మంగళవారం వేకువ 4.29 సమయం నుండి కూడ రెస్క్యూ టీమ్ ది అదే కథ! ఒక ట్రస్టు ఉద్యోగితో సహా 8 మంది సంకల్పంతో - భారతలక్ష్మి వీధిలో నిన్నటి తరువాయిగా తీరిన రోడ్డు గుంటల వ్యథ! ఒంటి చేత్తో ఒకానొక విశ్రాంత బోధనా ఉద్యోగి - దివంగత వా.కో. నిర్మించి తీర్చిదిద్దిన ఉద్యానం కడ స్వచ్ఛ కార్యకర్తల వీధి సంస్కరణ గాథ!

            ఇలా చల్లపల్లి స్వచ్చోద్యమ కారులది 2300* నాళ్ళ - ఎనిమిదేళ్ల సుదీర్ఘ ప్రయాణం. వేకువల్లో 4.20 నుండి 6.20 దాక రెండు గంటల గ్రామ పారిశుద్ధ్య శ్రమదానం ఒకటేనా? అది ముగిసేంతలో ట్రస్టు కార్మికుల బహుముఖ కృషి గ్రామంలో ఏదో ఒక చోట మొదలౌతుంది. రహదార్ల చెట్ల పచ్చదనాలనీ, ఉద్యానాలనీ, ప్రయాణ భద్రత కోసం రోడ్ల గుంటల్నీ, ఇంకా ప్రధాన వీధుల మార్జిన్ల దురాక్రమణల సంగతుల్నీ... ఎన్నిటినో స్వచ్ఛ కార్యకర్తలు కన్నేసి ఉంచుతారు.

            గ్రామం స్వస్తత కోసం సౌకర్యం కోసం - ఆహ్లాదం కోసం - అయాచితంగా ఇంతటి శ్రద్ధ, పట్టింపు, తెగింపు ప్రదర్శించే కార్యకర్తలు రాష్ట్రంలోని 13000 ఊళ్లలోను - దేశంలోని 6 లక్షల గ్రామాల్లోను ఉంటే గనుక అది ఎంత అద్భుతమో గదా!

            కార్యకర్తలకు గ్రామస్తులు - గౌరవం కాదు - సంఘీభావం, సహకారం ఇస్తే గనుక అది ఇంకెంత మహత్తర పరిణామమో కదా!

            అదలా ఉంచి - అనుకొన్న వీధి భద్రత సాధించాక - ఈ కొద్దిమంది కార్యకర్తల ఆనందహేళిని వాట్సప్ చిత్రాలలో గమనించండి! సంతోషాతిరేకంతో కొండపల్లి బాబూరావు ముమ్మారు తన ఊరి స్వచ్ఛ శుభ్ర సౌందర్య సంకల్పాన్ని నినదిస్తున్న దృశ్యాన్ని గమనించండి!

            రేపటి - బుధవారం వేకువ మన స్వచ్చంద శ్రమదాన ప్రదేశం సాగర్‌ ప్రదర్శనశాల బైపాస్ మార్గంలోని భారతలక్ష్మి రైస్ మిల్ వద్ద.

 

             సమర్పిస్తున్నాం ప్రణామం 59

సొంత అతిశయ సూక్తులెందుకు? వింత మాయల మాట లెందుకు?

లక్ష పదముల కవితలెందుకు? వాదులెందుకు - బోధలెందుకు?

ఉన్న ఊరి ప్రయోజనార్థం ఒక్క గంట శ్రమిస్తె చాలును...

అనే నీతిని ఆచరించెడి స్వచ్ఛ భటులకె నా ప్రణామం!      

 

ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

14.12.2021.