1894 * వ రోజు....           18-Jan-2020

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!   

*స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం 1894** *వ నాటి గ్రామ బాధ్యతలు.* 

ఈ నాటి వేకువ 4.06-6.15 నిముషాల నడుమ 28 మంది కార్యకర్తలు తమ ప్రయోజనానికి కాక తమ గ్రామ సమాజ సౌకర్యం కోసం కృషి చేశారు. కార్యరంగం గంగులవారిపాలెం దారి లో పెద్ద మురుగు కాల్వ మూల మలుపు నుండి వంతెన మలుపు మధ్యస్థ ప్రాంతం. రెండు రోజులుగా బాట దక్షిణపు టంచులోనే ప్రధానంగా స్వచ్చీకరిస్తున్న ఈ గ్రామ శుభ్రతా బాధ్యులు ఈ రోజు దక్షిణపు దిశగా ఎక్కువగా కేంద్రీకరించారు.

 

అక్కడక్కడ పూల మొక్కల పాదుల్ని, కంపల్ని సరిజేసుకొంటూ – కలుపు గడ్డినీ, అన్ని రకాల తుక్కుల్ని గొర్రులతో, చీపుళ్లతో సేకరిస్తూ, పారలతో బాట దరులను చెక్కి, గోకుడు పారలతో గోకి, మార్గాన్ని శుభ్ర విశాలంకావిస్తూ, పంట చేల అంచు దాక ఆ చీకటిలోనే పిచ్చి మొక్కల్ని తీసి వేస్తూ సాగిన ఉదాహరణ ప్రాయమైన వీరి కృషి నేటి మన సమాజానికి ఆదర్శం కాదా?

 

శ్రీ శ్రీ “భిక్షు వర్షీయసి” గేయంలో ముసలి బిచ్చగత్తె మరణాన్ని “ ప్రశ్నిస్తూ వెళ్లిపోయిన వెర్రి గాలి” వలెనే- 28 వేల మంది సంక్షేమం కోసం 1894 రోజుల ఈ స్వచ్చ సైనికుల నిరంతర కృషిని కూడ దూరం నుండి చూసి పోతున్న వారి ప్రవర్తన ఉన్నదా?

 

కార్యకర్తలలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పాల బుగ్గల చిన్నారి కవలలు చీపుళ్లతో దారినంతా ఊడ్చి శుభ్ర పరుస్తూనే ఉన్నారు. వచ్చిన వ్యర్ధాలలో ఎక్కువ భాగం మురుగు కాల్వ ఉత్తరపు ఒడ్డుకు రక్షణగా సర్దడానికి సరిపోయింది.

 

నలుగురు మాత్రం ట్రాక్టర్ లో నాగాయలంక దారిలోని “స్వచ్చ సుందర మరుగు దొడ్ల” దగ్గరి డ్రైను లోని మురుగు మట్టిని అక్కడ ఉన్న పల్లాలలో సర్ది మిగిలిన మట్టిని వాహనంలో నింపుకొని చిల్లలవాగు వంతెన దగ్గరి కమలంలో సర్ది వచ్చారు.

 

కాఫీ-టీ కాషాయ ఆస్వాదన తర్వాతి సమీక్షా సమావేశంలో :

 

- నేటి కృషిలో కేవలం ఒక్క స్థానికుని పాత్ర మీద నలుగురు చర్చించారు.

 

- సామాజిక మాధ్యమ- ముఖ పుస్తక ప్రముఖుడు మన ఉదయ శంకర శాస్త్రి గారి మనవడు, విద్యాసాగర్ గారి ఏక పుత్రుడు- వివేకానందుని ఫిబ్రవరి 1 న భాగ్యనగరంలో జరిగే వివాహానికి, 2 వ తేదీ ఆదివారం సాయంత్రం విజయవాడ-బందరు మార్గంలోని స్వీకార (రిసెప్షన్) మహోత్సవ విందుకూ స్వచ్చ కార్యకర్తలందరూ ఆహ్వానితులు.

 

- 6.48 నిముషాలకు ఆర్య-ఆరవ్ లు వంతుల వారీగా చెప్పిన గ్రామ స్వచ్చ సుందర సంకల్ప నినాదాలతో నేటి కర్తవ్య దీక్షకు చెల్లు!

 

రేపటి మన శ్రమదానం కూడ ఈ గంగులవారిపాలెం దారి చివర మురుగు కాల్వ వంతెన దగ్గరే జరుగుతుంది.

 

   స్వచ్చ భోగి(14.01.20220) కథ వేరే!

సంకురాత్రి సంబరాలు జరగడమది మామూలే

ప్రతి పల్లె లొ- ప్రతి వీధిలొ- పరవశమొక రివాజే

స్వచ్చోద్యమ సందేశం అడుగడుగున ప్రసరించే

స్వచ్చోద్యమ చల్లపల్లి సంబరాల కథ వేరే!

 

   నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు,

శనివారం – 18/01/2020

                                                      చల్లపల్లి.