2301* వ రోజు....           15-Dec-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

 

2301 * వ నాటి స్వచ్చ- సుందర శ్రమదాన వేడుక.

 

            పని రోజుల- పని గంటల- సామాజిక స్ఫూర్తి పంపకాల పరంగా నిన్నటి క్రొత్త మైలు రాయి తర్వాత ఈ వేకువ కూడ 24 మంది శ్రమ దాతల గ్రామ పురోగతి ప్రయత్నం భారత లక్ష్మి రైస్ మిల్ కేంద్రంగానే సాగింది. ఇద్దరు అనుభవజ్ఞ (సజ్జా-జ్ఞాన)ప్రసాదుల గైర్ హాజరీని ఇద్దరు వయోధిక విశ్రాంత ఉద్యోగినులు భర్తీ చేయగా మొత్తం 60-70 గజాల జాగాలోనే రెండు రోడ్ల కూడలి కటూ-ఇటూ గానే ఈ 20 మంది కృషి సఫలీకృత మయింది!

 

ఈ పెద్ద వడ్ల మర యజమాని కాకరపర్తి  సురేష్ గారి 1000/- వితరణా, గ్రామ వాలంటీర్ సురేష్ ఉనికీ నేటి విశేషాలు. ఎక్కడ వారం రోజులుగా వీధి కాలుష్యాల మీద కార్యకర్తల పోరు ముమ్మరంగా సాగుతున్నదో- ఎవరి ముంగిట పాతిక ముప్పై మంది శుభ్ర-సుందరీకరణ యజ్ఞం చేస్తున్నారో-  ఆ 30-40 ఇళ్ల వారు మాత్రం పట్టించుకోలేదు! మూడేళ్ల క్రిందటి దాక ఈ రోడ్డు కోసం త్యాగాలు చేసిన ఒక విశ్రాంత బడి పంతులు గారితో గాని-మూడు నెలల కొక మారు తమ మురుగు కాల్వను, పరిసరాలను బాగు చేస్తున్న స్వచ్చ కార్యకర్తలతో గాని-సంఘీభావం తెలపనంతటి క్షణం తీరిక దొరకని పౌరులు వాళ్లు!

 

తమ వీధి పారిశుద్ధ్యంలో సుందరీకరణలో కనీసం ముగ్గురు డాక్టర్ల, ఈ వార్డుకు చెందని వయో వృద్ధ పెన్షనర్ల, ఉద్యోగినుల , గృహిణుల ప్రమేయం ఎందుకున్నదో కూడ పట్టించుకోని ఈ గ్రామ పౌర సమాజనికి హాట్సాప్!

చల్లపల్లి జన సంఖ్యతో పోలిస్తే- అతి కొద్ది మందే గాని, కార్యకర్తల నేటి త్రివిధ గ్రామ మెరుగుదల ప్రయత్నాలిలా ఉన్నవి:

 

            1. వడ్ల మరకు పడమర దిశగా ఉన్న ఉభయ అపార్ట్ మెంట్ల ఎదుటి పాత్ర- సారి కొత్త రకరకాల వ్యర్థాల్ని  రోడ్డు మీదికి ఈడ్చి, డిప్పల్తోను, చేతుల్తోను చుట్టలు చుట్టి ట్రాక్టర్ లోకి ఎగుమతి చేసిన దొక దృశ్యం!

 

            2.  బైపాస్ వీధిలో గత ఆదివారం నాటి శుభ్ర-సుందరీకరణాన్ని ఈ వేకువ కూడ కొనసాగించిన ఒక సన్నివేశం! ఇద్దరు స్థానిక మహిళా కార్యకర్తల కిందులో భాగస్వామ్యం!

 

            3.  ఇక్కడికి దూరంగా- రవీంద్ర భారతి బడి దగ్గర్లో-ఎవరో కొట్టి, రోడ్డు మీద వదిలేసిన చెట్ల వ్యర్థాలను ట్రాక్టర్లో  నింపిన చాకచక్యం!

 

            ఎవరో ఒక నాయకుడు చెప్పినట్లుగా- దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఎ నిరంతర ప్రక్రియ!

            ట్రక్కులో వ్యర్థాలు పేర్చడంలో స్పెషలిస్టు-మాలెంపాటి అంజయ్య 6.30 కు మైకులో ముమ్మారు గర్జించిన స్వచ్చ-శుభ్ర-సౌందర్య సంకల్ప నినాదాలతో వీధి వీధంతామేల్కొనే ఉంటుంది.

            రేపటి వేకువకు కూడ మన అందరి శ్రమదానానికి సరిపడా ఈ వీధి కాలుష్యాలే మిగిలినందున- ఈ బైపాస్ మార్గమే మన పునర్దర్శన ప్రదేశం!

 

      సమర్పిస్తున్నాం ప్రణామం -60

 

కార్యకర్తకారోగ్యం- గ్రామానికి సౌకర్యం

స్వార్థం తీర్థం విరివిగ సమకూడిన ప్రస్థానం

ఈ సవనం కవనార్హం! కమనీయం! సంస్తుత్యం!

బహుళార్థక సాధకులకు ప్రత్యూష ప్రణామం! 

 

ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

15.12.2021.