2302* వ రోజు....           16-Dec-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

ఏడెనిమిదేళ్ల స్వచ్ఛ - సుందరోద్యమంలో 2302* వ నాటి విశేషాలు.

        ఒకనాడు కాలు పెట్టడానికే భయపడ్డ పెద్ద వడ్లమర వీధిలోనే ఈ బుధవారం కూడ 25 మంది స్వార్థరహితుల శ్రమదానం! సిమెంటు బాట అంచులు విరిగిపోకుండ మురుగుకాల్వల వ్యర్ధాలతోను, రాతిముక్కల రద్దులతోను వంచిన నడుమెత్తని నలుగురి సర్దుబాటు ప్రయత్నం! 110 నిముషాల పాటు - పాతిక మంది శరీరాల చెమటలతో, బుర్రలకు పెట్టిన పదునులతో శేషకీర్తి వాసిరెడ్డి వారి శ్రమదమాదులతో రూపొందిన రోడ్డుకు మరిన్ని స్వచ్ఛ - శుభ్ర - సౌందర్యాలు సమకూడిన వైనం!

        ఐతే ఏం జరిగిందట! పదినాళ్ల - సగటున ముప్పైమంది కార్యకర్తల పట్టుదలతో ఈ రెండు -  మూడు రోడ్ల సంస్కరణ అద్భుతమే -  యదార్ధమేగాని - ఒకరిద్దరు విశ్రాంత వయోవృద్ధ ఉద్యోగినులు తప్ప క్రొత్తగా ఎవరు స్పందించారు కనుక! మైకులో శ్రావ్య సంగీతాలు ఈ సమీప గృహస్ధుల్ని నిద్రలేపాయో - లేక నిద్రపుచ్చాయో ఎవరి కెరుక? అది మొహమాట పడడమో - మొగంచాటేయడమో మనకు తెలియదాయె!

        స్వచ్ఛ కార్యకర్తలకిదేమన్నా క్రొత్తా? ఒకటి - రెండు - మూడు వీధుల్లో తప్ప గత ఏడెనిమిదేళ్ల అనుభవంలో వాళ్లకిది షరామామూలే గదా! అందుకే ఈ స్థిత ప్రజ్ఞుల - గ్రామ నిష్కామ కర్మిష్టుల శ్రమైక జీవనానందుల నిర్వికల్ప పని వైఖరికి ఏరోజుకారోజు నావంటి వాళ్లు ఆశ్చర్యపడేది!

        అన్ని వార్డుల - అన్ని వీధుల - అందరు గ్రామస్తులు ఏనాటికైనా స్వచ్చోద్యమ స్ఫూర్తిని అందుకోలేకపోతారా - చల్లపల్లి గ్రామ పరిపూర్ణ స్వచ్ఛ - సుందర - స్పస్తతల్ని సాధించుకోలేకపోతామా...అనే స్వచ్ఛ కార్యకర్తల ఆశావహ దృక్పథమే పరిశీలకుల్ని ఆకట్టుకొనేది!

ఈనాటి వీధి పారిశుద్ధ్య చర్యల విశేషాలు కొన్ని :

- నిన్నటి వడ్లమర యాజమాన్య విరాళం తప్ప నేడుకూడ ఈ వీథి నివాసులెవ్వరూ

బైటకు రాకపోవడం.

- మురుగు కాల్వ అంచున పనిచేస్తున్న ఒక పోస్టల్  కార్యకర్తను - కులమేంటో తెలియని ఒకానొక పొడవైన నాగరాజు గారు స్థిరంగా నిలబడి ఆశీర్వదించారో, అభినందించారో, తన స్థావరాన్ని శుభ్రపరచడాని కనుమతించారో తెలియదు గాని - నిశ్శబ్దంగా నిష్క్రమించారు.

- చెరువులో డ్రైను కలుస్తున్న చోట గాని, ప్రక్క సందులో గాని ఈ నాలుగో రోజు కూడ ట్రక్కు

నిండా వ్యర్ధాలు లభించడం మరొక విశేషం. 

[తమ వీధిలో కార్యకర్తల శ్రమదానానికి స్పందించని, పాల్గొనని ఈ వార్డు - వీథి ప్రజల తరపున నా వినయ - విధేయ - వినమిత విచారం ప్రకటిస్తున్నాను!]

        6.30 కు నేటి పారిశుద్ధ్య సమీక్షకు ముందు ముమ్మారు స్వచ్ఛ - శుభ్ర - సౌందర్య సందేశ నినాదాలిచ్చినది - త్వరగా ఇంటికి పోయి, పాఠశాల విధులకు చేరవలసిన ఉపాధ్యాయిని - లంకే సుభాషిణి.

        రేపటి ఉషోదయానికి ముందే మనం మరొక మారు కలిసి శ్రమించవలసినది కూడ ఈ బైపాస్ వీధిలోనే!

        సమర్పిస్తున్నాం ప్రణామం – 61

సమయోచిత నిర్ణయాలు - క్రమ శిక్షణ తో అడుగులు

ఊరి జనుల స్వస్తతకై వ్యూహాత్మక పరిచర్యలు

గ్రామ సమస్యల పట్ల అఖండ ధైర్యసాహసాలు

ప్రదర్శించు వీరులకే ప్రాతః ఘన ప్రణామాలు!

 

ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

16.12.2021.