2303* వ రోజు.......           17-Dec-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

వారం రోజుల శ్రమతో ముస్తాబైన వడ్లమర వీధి - @2303*

            ఏడెనిమిది నాళ్ల - పాతిక ముప్పై మంది శ్రమదాతల - 300 పనిగంటల ప్రయత్నంతో మెరుగులు దిద్దుకొని, కాస్త సోకులు కూడా చేసుకొని ఏ మాత్రం స్వచ్ఛ సౌందర్య స్పృహ ఉన్న వాళ్ళకైనా ముచ్చట గొలుపుతున్న రైసుమిల్లు వీధి సందర్శనకు గ్రామస్తులకిదే మా ఆహ్వానం!

            ఈ చిన్న వీధిని ఈ మాత్రం ముస్తాబు చేసేందుకు ఇందరు కార్యకర్తలు

ఈ డిసెంబరు/మార్గశిర మాసపు చలిలో ఎంతగా కంకణబద్ధులయ్యారో - ఇందులో వాళ్లకేం గిట్టుబాటయ్యిందో - అది వేరే సంగతి ! ఆ మాటకొస్తే - ఈ గ్రామంలోని ఇలాంటి ఒక వంద రోడ్లు - ఆయా వార్డు ప్రజల చొరవతో - ఇంతకింత సర్వాంగ సుందరంగా ఆనంద - ఆరోగ్యదాయకంగా - ఆదర్శప్రాయంగా ఎప్పటికైనా మారకపోతాయా అనేది స్వచ్ఛ కార్యకర్తల అత్యాశ అనుకొందాం!

            ఐదారేళ్ళ నాడు ఈ వీధి కొక గుర్తింపు తెచ్చిన విశ్రాంత శేషకీర్తి కోటేశ్వర్రావు కృషికీ, అంతకు ముందు నరక సదృశమైన ఈ బాటలో మార్పుకు చొరవచూపిన నాగళ్ల మధు గారి స్మృతికీ ఈ వారం రోజుల మన శ్రమను సముచిత అంకితంగా భావిద్దాం.

            “జై వాట్సప్ మాధ్యమచదువరులకు నా విన్నపమేమంటే - అతిశయోక్తులనిపించే ఈ వర్ణనలు నా ఒక్కడివి కావు. తమ కృషితో శుభ్ర - సుందర ధన్యమైన ఈ వీధిని తృప్తిగా మళ్ళీ మళ్ళీ చూసుకొని ఆనందించిన పెద్ద చదువులు లేని ఒక కార్యకర్త ఈ రోడ్డును అచ్చ తెలుగు ఆడపడుచు వాలుజడఅని వర్ణించాడు! స్వచ్చంగా మారిన ఈ బాటను మురిపంగా చూసి, చూసి ఒకాయన ఇది తెల్ల త్రాచులాగా ఉంది చూడండిఅని పోలిక తెచ్చాడు. (అలంకార పరిభాషలో వీటిని ఉపమాలంకారాలంటారు!).

            మరో కోణంలో చూసే వాళ్ళ దృష్టిలోను, ఈ రోడ్డు ప్రక్కల వారి అంచనాలలోను – “ఆ! ఏదో చేశారులే - బాగానే కనిపిస్తుందిలే...! అని కూడ మిగిలిపోవచ్చు!

- అందుకు తోడు చంద్రునిలో మచ్చల్లాగా అపార్ట్ మెంట్ల దగ్గర ఎదురెదురుగా మిగిలిపోయిన రెండు చిన్న రద్దు గుట్టలు!

- ఈనాటి పారిశుద్ధ్య అంకితులు కూడ పాతిక మందే! వీళ్లలో 18 మంది హాజరు 4.18 కే.

- ఐదారుగురు రెస్క్యూ దళం వారు అతిబరువైన కాంక్రీటు స్తంభాన్ని రోడ్డు దరికి చేర్చి, అమర్చి, ధాన్యం మరగేటు ఎదుటి రోడ్డునెంత విశాలంగా మార్చారో గమనార్హం!

- అలాగే అపార్ట్ మెంటు ఎదుట ఖాళీ స్థలాన్ని రాతి ముక్కలు ఏరి, ఎగుడుదిగుళ్ళను చదును చేసిన వైనం కూడ!

            6.30 తరువాత - 90 మంది గ్రామ వాలంటీర్లలో ఒకే ఒక్కడుగా వచ్చి, మూడు రోజులుగా, స్వచ్ఛ కార్యకర్తల్లో కలిసిపోయిన సురేష్ మూడు మార్లు పెద్దగా తడబడకుండా చెప్పిన స్వచ్చ - శుభ్ర - సౌందర్య సార్ధక నినాదాలతో నేటి కృషి పరిసమాప్తి!

            రేపటి వేకువ మనం కలిసి, పురోగమించదగిన చోటు కూడ ఈ బైపాస్ వీధిలోని సూర్యదేవర రాజేశ్వరి గారి వీథి మొదటనే!

 

            సమర్పిస్తున్నాం ప్రణామం – 62

 

ఎవరి ఎడదలు స్వార్థమున కొక్కింత దవ్వున నిలుస్తున్నవొ

ఎవరి చేష్టలు పొరుగు వారి కొకింత సాంత్వన ఇచ్చుచున్నవొ -

ఏ వినూత్న స్వచ్ఛ ఉద్యమ మింత ఊరి ప్రమోదకరమో

అట్టి ఉద్యమ కర్తలకె మే మందజేస్తుంటాం ప్రణామం!

 

ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

17.12.2021.