2304* వ రోజు....           18-Dec-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

2304* వ వేకువ జాములో సైతం బైపాస్ మార్గం దగ్గరే! 

          ఇది డిసెంబరు - 18 వ రోజు. గాండ్రిస్తున్న చలిపులికి భయపడి మంచాలు దిగక - దుప్పట్లు వీడక – 1 -2 వార్డుల గ్రామస్తులు పడక గదులకే పరిమితులౌతున్న 4.20 సమయం. అటు ముక్తి కోసం అయ్యప్పస్వాములు, గ్రామ రోగకారక కాలుష్య విముక్తి కోసం ఈ స్వచ్ఛ కార్యకర్తలు! - ఒకరు దేవాలయం దగ్గర, రెండో వారు మలిన వీధి దేవాలయాలలోను! ఐతే - భక్త మహాశయుల్లాగా ఈ గ్రామ భక్త మహనీయులది సీజనల్ దీక్ష కాదు – వీళ్ళ పూజలు ఒక వార్డు తర్వాత మరొక వార్డుగా - 2304 నాళ్లుగా జరుగుతున్నవి!

          ఇవాళటి మార్పు ఏమంటే – 28 మందిలో సుందరీకర్తలు నలుగురుతప్ప – మిగిలిన వారు అశోక్ నగర్ చిరు వీధుల్లో జరిపిన స్వచ్ఛ – శుభ్ర విన్యాసాలు! విశ్రాంత RTC డ్రైవరు సుబ్బారావు గారి సకుటుంబ సృచ్ఛంద శ్రమదాన ప్రవేశం! 2 గంటల పని వేళ ముగిసే సరికి 2 ½  వీధుల మెరుగుదల! నలుగురు స్థానికుల ప్రమేయం తప్ప - సుమారు 20 ఇళ్ల వారికి స్ఫూర్తిదాయకమైన ఈ మైకు పాటలు మేలుకొలుపులయ్యాయో లేక జోలపాటలయ్యాయో – వారికే ఎరుక!

          కాని, తమ కష్టార్జితాన్ని - అంతకన్న విలువైన తమ సమయాన్ని - శ్రమను ఏ లక్ష్యం కోసం ఊరికి సమర్పిస్తున్నారో కార్యకర్తలకు మాత్రం మంచి అవగాహనే ఉన్నది. గుడ్డిగా – అమాయకంగా – అనాలోచితంగా - గుర్తింపు, ప్రచారం తదితర క్షుద్ర ప్రయోజనాల కోసం చల్లపల్లి స్వచ్చోద్యమం నడుస్తున్నదనుకొనే వాళ్లిప్పటికీ ఈ గ్రామంలో ఎవరైనా ఉంటే – ఆ రొడ్డ కొట్టుడు ధోరణులకు నా పునః పునః ప్రణామాలు!

ఈ శనివారం వేకువ శ్రమదాన విశేషాలలో :

- వడ్లమర ఎదుట పడమర దిశగా రోడ్డులో పాక్షికంగా మెరుగుదల;

- అపార్ట్ మెంట్ల వెనుక వీధిలో 8 మంది దండయాత్రకు బలైపోయిన - బాటకు ఉభయదిశల్లోని పిచ్చి ముళ్ల మొక్కలు, ప్లాస్టిక్ పదార్ధాలు, రాళ్లు రప్పలు;

- రాజేశ్వరి గారి వీధిలో 14 మంది పూనికతో తొలగిన పనికిమాలిన తీగలు, కొబ్బరి మట్టల – బొండాల - ఇతరేతర వ్యర్థాలు;

- పనిలో పనిగా తూర్పు పడమరల ఖాళీ స్థలాల్లో కూడా పాక్షిక పారిశుద్ధ్యం.

          వీటన్నిటి ఫలితమేమంటే - మళ్లీ ఒక ట్రక్కు నిండా సేకరించిన వివిధ వ్యర్ధాలు బుద్ధిగా డంపింగ్ కేంద్రానికి చేరిక!

          6.30 తరువాత కొందరు శ్రమదాతలు తమ ఏడెనిమిది నాళ్ల కష్టంతో శుభ్ర - సుందరమైన రెండు వీధుల్ని కళ్లార చూసుకొంటున్న దృశ్యం. ముఖ్యంగా భారత లక్ష్మి వడ్లమర వీధి ఒంపుల సొంపుల్ని మళ్లీ మళ్లీ పరిశీలిస్తూ – వర్ణనాత్మకంగా వ్యాఖ్యానిస్తూ - స్వచ్ఛ శుభ్రతల్ని తలచుకొంటూ పొందుతున్న తన్మయత్వం!

          తమ సుదీర్ఘ స్వచ్చోద్యమ ఆశయాన్ని జంకు కొంకు లేక ముమ్మార్లు పోస్టల్ - మెండు శ్రీను నినదించడంతో నేటి ఉద్యమ దృశ్యాలకు తెర!

          రేపటి మన శక్తి వంచన లేని గ్రామ వీధుల మెరుగుదల ప్రయత్నం కూడ - ఇదే చోట – బైపాస్ మార్గంలోనే కలుసుకొని కొనసాగిద్దాం!

          సమర్పిస్తున్నాం ప్రణామం – 63

పిలుస్తున్నది స్వచ్ఛ గ్రామం తలుస్తున్నది నీ సహాయం

ఊరి మేలుకు పాటుబడితే అదిక నీకే స్వయం క్షేమం

అదే తీర్థం - అదే స్వార్థం అదే సామూహిక ప్రమోదం

మనస్ఫూర్తిగ తరలి వస్తే మాటి మాటికి నా ప్రణామం!

 

ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

18.12.2021.