2305* వ రోజు.......           19-Dec-2021

ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

 

2305* వ నాటి 33 మంది గ్రామ వీధుల పారిశుద్ధ్య పరాయణత్వం.

 

          అదివారం (19-12-21) నాటి వేకువ 16 మంది కార్యకర్తల హాజరైతే మరీ 4.19 కే మొదలై, 4.25 కు ముందే అసంఖ్య 32 కు చేరింది (33 లక్కీ నంబరు నాది)! స్వచ్చోద్యమ తొలినాళ్ల నియమం కార్యకర్తలు వేకువ తలొక గంట శ్రమించాలనే! అది కాస్తా గంటన్నరకు, ఇక ఇప్పుడైతే 4.30 నుండి 6.30 దాక అని మారిపోయింది. ఆ పని కాలాన్ని సైతం అతిక్రమించి 4.17 కే కొన్నాళ్లుగా కొత్త సాంప్రదాయం వచ్చింది!

 

          వీళ్ల పని వేళల అతిక్రమణం చూస్తుంటే - చాల ఏళ్ల క్రితం దేవులపల్లి కృష్ణశాస్త్రి కవి వ్రాసిన సినిమా గేయం

 

          “ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకూ.. పూలిమ్మనీ రెమ్మరెమ్మకూ

          ఎంత తొందరయే హరి సేవకూ.. ప్రొద్దు పొడవక ముందే తొలిపూజకూ” ... అనేది గుర్తొస్తూ ఉంటుంది! అసలుఈ శ్రమదాన సమయపరమైన క్రమశిక్షణా రాహిత్యం ఒక డాక్టరమ్మతోనూ - ఆమెకు మద్దతిచ్చే బ్యూటిఫికేషన్ ముఠాతోనూ మొదలై కొనసాగుతున్నట్లు గుర్తు! వాళ్లు మాత్రం ఏం చేస్తారులే పని విరామ ఈల మ్రోగుతున్నా - మైకు నుండి పాటలు ఆగిపోయినా ఏ కొంచెమో మిగిలిపోయిన వీధి సుందరీకరణం వాళ్లను నడుములెత్తనీయనప్పుడు?

 

          ఆ ప్రకారం ఈ నాటి వీధి శుభ్ర - సుందరీకరణం అందరివీ గుణిస్తే 50 - 60 పనిగంటలో కొనసాగింది, విజయ్ నగర్ అశోక్ నగర్ల నడిమి బైపాస్ మార్గం ఇంతగా స్వచ్ఛ - సుందరంగా మారినప్పుడు (వాట్సాప్ చిత్రాలలో వీక్షించండి!) ఈ ముప్పై మంది కార్యకర్తలకింకా అలసట ఎందుకుంటుంది? శారీరకంగా ఇంత చలిలోనూ చెమట పట్టేంతగా ఊరి కోసం శ్రమించి, మానసికంగా ఇంత సంతృప్తిని ఏ రోజుకారోజు మిగుల్చుకొంటుంటే - వాళ్ల ఆరోగ్యానికి లోటు మాత్రం ఎందుకుంటుంది?

 

- ఇద్దరు కార్యకర్తలు డ్రైనులో చెత్త దరిద్రాన్ని తొలగించడాన్నీ, ఒక బక్క కార్యకర్త డ్రైను పైగా చెట్టెక్కి దాని కొమ్మల్నీ పిచ్చి తీగల్నీ ఆ చీకట్లోనే నరుకుతున్న వైనాన్నీ - అందుమూలంగా సదరు చెట్టుకు క్రమశిక్షణ, క్రొత్త పొందిక వచ్చిన సంగతినీ సామాజిక మాధ్యమ చితాల్లోనైనా చూడండి!

 

- నిన్నటిదాక లోడింగుకు భిన్నంగా ఒక క్రొత్త ఆజానుబాహుడు (తో. నా.) టక్కు మీద నిలిచి తుక్కునెంత బాగా సర్దుతున్నాడో తిలకించండి!       

          ఇవాళటి మరో విశేషమేమంటే - వీధి సుందరీకర్తల విభాగం వడ్లిమర వీధిలో మూడు చోట్ల - సుమారు 40 గద్దగోరు, చిలక ముక్కు పూలమొక్కల్ని నాటి ఆ వీధిని ఇంకొంచెం సౌందర్య సముజ్జ్వలం కావించడం!

 

          6.40 సమయంలో విశ్రాంత రెవిన్యూ ఉద్యోగి - రాయపాటి రాధాకృష్ణ దంపతుల మేనేజింగ్ ట్రస్టీ గారికి 2,700/- విరాళ సమర్పణా, అందులో తొలివారు స్థిరంగా ముమ్మారు తమ గ్రామ స్వచ్ఛ శుభ్ర -సుందరీకరణల్ని నినదించడమూ జరిగిపోయాయి!

 

          రేపటి వేకువ స్వచ్ఛ శ్రమదానానికి కాస్త ఆటవిడుపే గాని, 5.00 నుండి 6.00 దాక గంగులవారిపాలెం వీధి పండుగ కోసం (సరిగ్గా ఎనిమిదేళ్లనాడు చల్లపల్లి స్వచ్చోద్యమ గధ అప్పుడే మొదలయింది!) కార్యకర్తలను తూము వేంకటేశ్వర మహోదయుని ఆహ్వానం ఉన్నది!

 

          సమర్పిస్తున్నాం ప్రణామం – 64

 

ఇదేం కష్టం - ఇదేం నష్టం - ఇదేం అబ్బుర మిదేం చోద్యం?

నీ బ్రతుకు నువు దిద్దుకొంటూ ఇరుగు పొరుగుల మేలుకోసం

గంట సమయం పాటుబడితే ఇంటికీ - ఒంటికీ శ్రేయం

అట్టి ఆలోచనా పరులకే అందజేస్తాం సత్ప్రణామం!

         

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త &

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

19.12.2021.