2306* వ రోజు....           20-Dec-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

 

2306* స్వచ్ఛ - సుందరోద్యమంలో సరిక్రొత్త అధ్యాయం వీధి పండుగ సంప్రదాయం!

ఔను మరి! సోమవారం వేకువ గంగులవారిపాలెం వీధిలో 64 మంది -  ఇటు శాయి, భవఘ్ని నగర్ పౌరులూ, అటు స్వచ్ఛ కారకర్తలూ, ముగ్గురు నలుగురు ఉషోదయ వాహ్యాళి వ్యక్తులూ గంటన్నర పాటు జరుపుకొన్నది అక్షరాలా పండగే! కాకపోతే ఇది కాస్త భిన్నమైన వేడుక. తక్కిన పండగల్లాగా తలంటులూ, క్రొత్త బట్టలూ, పిండి వంటలు లేని పండుగ! తిధి వార నక్షత్రాల ప్రమేయం ఈ పండుగకుండవు గాని వేల సంవత్సరాల చల్లపల్లి గ్రామ చరిత్రలో ఈ కాలానుగుణమైన - నేటి అత్యావశ్యకమైన స్వచ్ఛ - స్వస్త పరిశుభ్ర సౌందర్యసాధనా సంకల్పాన్ని జనం మనసుల్లో తట్టి లేపే ఒక స్ఫూర్తి మంత్రం ఈ ఉదయం జరుపుకొన్న కొంగ్రొత్త పండుగ!

 

            నిన్నటి వాట్సాప్ లో నేను వ్రాసినట్లు - ఈ వేకున సైతం 5.00 నిర్ణీత సమయానికి ముందే – 4.30 కే ఊరి సుందరీకర్తలు, ఇతర స్వచ్ఛ కార్యకర్తలు హాజరు కావడాన్ని గుర్తించారా? (అరగంట ముందే ఇంతమంచి కార్యక్రమానికి వస్తే అది సమయపాలన లోపం కాకపోవచ్చు!) అదే మరి - చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల కుటుంబ ప్రత్యేక లక్షణం!

 

            ఇక్కడ ఈ ప్రత్యేక సమయాను గుణంగా ప్రశంసించిన - ప్రసంగించిన వక్తలు చెప్పిన విశేషణాలన్ని యదార్ధాలే కావచ్చు! ఈ రెండు మూడు రాష్ట్రాల్లోని ప్రస్తుత అవాంఛనీయ పర్యావరణ విధ్వంసాన్నీ, జనం మనసుల్లో అడుగంటిపోయిన స్వచ్ఛ శుభ్ర సౌందర్య స్పృహనీ గుర్తు చేసుకొన్నప్పుడు మాత్రం మన చల్లపల్లి ఒకచిన్న ఆశాకిరణమే కావచ్చు - ఎడారిలో ఒయాసిస్ కావచ్చు మళ్ళీ ఈ ఊర్లో ఈ గంగులవారిపాలెం వీధి అన్ని హంగులతో చిన్న పాటి అద్బుతమే అనడంలో సందేహం లేదుగాని :

 

            ఈ పాటి అద్భుతాలు 50 – 60 ఏళ్ల క్రితమే ఐరోపా, అమెరికా వంటి ఖండాల్లోను, స్విడ్జర్లాండ్, స్వీడన్, ఫిన్లాండ్ వంటి చిన్న దేశాల్లోను గత చరిత్రలు!

 

            ఇంతటి స్వార్థ సంకల్పాలు, భూకబ్జాలు, రోడ్ల మార్జిన్ దురాక్రమణలు, వికృతమైన హిపోక్రసీలు - ఇన్ని జగన్నాటక ప్రదర్శనలు పోగుబడ్డ మన సువిశాల పవిత్ర - ప్రజాస్వామిక మహాదేశంలో తగు మాత్రం సామాజిక స్పృహ, స్వయం సేవా సంసిద్ధత ఇంకా ఎప్పటికి వచ్చేను? మన వేలకొద్దీ పట్టణాల్లో, ఆరు లక్షల గ్రామాల్లో - ఒక్కో ఊరికొక్క డి.ఆర్. కె పుట్టి నడుం కట్టి ఇక్కడి లాగే సహృదయాలతో జనం సహకరించి.. ప్రతి ఊళ్ళో స్వచ్చోద్యమాలు జరిగి.... వీధి పండగలు నడిచి... ఇలాంటి స్వప్నాలు నిజం కావడానికి ఇంకా ఎన్ని దశాబ్దాలు పట్టేనో!

 

            ఇవన్నీ అలా ఉంచి - నన్ను ఈ ఉదయం బాగా ఆకర్షించిన రెండు విషయాలేమంటే: 

 

- కాఫీల్నీ, కేకుల్నీ ఆస్వాదించి, స్వచ్ఛ కబుర్లు చెప్పుకొని, గంటన్నరపైగా ఆనందించిన సందర్శక కార్యకర్తల గృహిణుల - వక్తల - శ్రోతల వదనాల్లో తమ పరిసరాల - వీధి పారిశుద్ధ్యాల పరమైన ఒక దృఢ సంకల్పం, అభినివేశం!

 

- చివరగా ప్రసంగించిన స్వచ్ఛ వైద్యునిలో దశాబ్దాలుగా గూడు కట్టుకొన్న ప్రజాబాహుళ్య స్వచ్ఛ - శుభ్ర చింతనా రాహిత్యం పట్ల వేదన శ్రోతల మనసుల్లోకి ప్రవహించిన తీరు!

 

            ఈ వేదనా పరిష్కారంగా గ్రామ పౌరుల దృఢ సంకల్పం ఆచరణగా మారటమే స్వచ్ఛ కార్యకర్తల అభిలాష!

 

            బుధవారం - 22 వ తేదీ వేకువ స్వచ్ఛ కార్యకర్తల పరస్పర పునర్దర్శనా ప్రదేశం - బైపాస్ మార్గంలోని అశోక్ నగర్ ప్రాంతమే!

 

            సమర్పిస్తున్నాం ప్రణామం – 65

బ్రతుకు తత్త్వం తెలుసుకొంటే - పరమ మర్మం గుర్తుకొస్తే

సమష్టిలోనే వ్యష్టి సుఖమనుసత్య మొక్కటి తెలిసి వస్తే

చల్లపల్లి స్వచ్ఛ సుందర స్వభావం తమ ఒంట బడితే

ఊరు వాడల ప్రజానీకం వచ్చి చేరితె నా ప్రణామం!

 

ఒక సీనియర్ స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త

20.12.2021.