2307* వ రోజు....           21-Dec-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

 

రెస్క్యూ దళంఅనే పేరుబడిన స్వచ్చ కుటుంబీకులు 2307* వ నాటి చర్యలు.

 

            డిసెంబరు నెల చలి - అందులోనూ ఈ రెండు మూడు రోజులుగా దాని పంజా దెబ్బ ఇంకాస్త ఎక్కువగా ఉండగా - ఈ మంగళవారం నాటి వేకువ రెస్క్యూ టీమ్ మాత్రం ఇవేమీ పట్టించుకోక - రెండు ముఖ్య రహదార్లలో రోడ్డు భద్రతా చర్యలకు పాల్పడ్డారు! గ్రామస్తుల - ఇతర ప్రయాణికుల సౌకర్యం కోసం వారి వాహనాల మన్నిక కోసం తమ భద్రతను, తమ సౌఖ్యాన్ని లెక్కచేయని ఈ ఆరుగురికి ధన్యవాదాలు!

 

            ఏదో గుర్తింపు సౌలభ్యం కోసం కొందరు స్వచ్ఛ కార్యకర్తలకు ఎవరో ఎప్పుడో గ్రామ రక్షణ దళంఅనే బిరుదు తగిలించారు. వీళ్లేమో గత నాలుగేళ్ళ నుండి ఆ నిక్ నేమ్ ను 100% సార్థకం చేశారు! నిజానికి వీళ్లలో సగం మంది స్వచ్ఛంద శ్రమదానంలో ఆల్ రౌండర్సన్న మాట! వీళ్లు మోకాలి లోతుకు దిగి, శుభ్రం చేయని మురుగు కాల్వ ఉందా? బాగా ఎత్తుకెక్కి సుందరీకరించని చెట్లున్నాయా? శ్మశాన శుభ్రతలు కావచ్చు - రోడ్ల, వీధుల గుంటలు కావచ్చు - ఈ ఆరేడుగురి ఆపన్న హస్తాలు తగలని చోటులేవి?

 

            ఈ గజగజలాడే చలి వేకువలో బాలాజీ విభాగ భవన సముదాయం దగ్గర్లోని డ్రైన్ల అంచుల తారు పెచ్చుల్ని, రాతి -  పెంకు ముక్కల్ని ట్రక్కులో నింపుకొని - విజయవాడ రహదారిలోని 6 వ నంబరు పంటకాల్వ వంతెన రెండువైపుల గుంటల్ని పూరించడం ఒకటీ

 

            నడకుదురు మార్గంలో - ముఖ్యంగా మదర్ థెరిస్సా పాఠశాల ప్రక్కన గోతులు సరిజేసిన చర్యమరొకటీ

 

            ఈ సామాజిక పరోపకారానికి సదరు కార్యకర్తలే ప్రతిఫలమూ, కృతజ్ఞతా, గుర్తింపూ ఆశించకపోవడం వాళ్ల సౌజన్యమైతే ఒక గ్రామ సామాజికుడుగా ధన్యవాదాలు తెలపడం, చాతనైతే కాస్త అభినందించి, అనుసరించడం నాలాంటివారి వివేకం!

 

            తమ పని ముగింపు వేళ నడకుదురు రోడ్డు పరిసరాల్ని స్వచ్ఛ శుభ్ర సౌందర్య సాధనా సంకల్ప నినాదాలతో మూడు మార్లు మ్రోతెత్తించింది గంధం బృందావనుడు!

 

            రేపటి వీధి పారిశుధ్య సుందరీకరణల నిమిత్తం వేకువనే మనం కలిసి సాగవలసిన చోటు బైపాస్ మార్గంలోని అశోక్ నగర్ తొలి వీధి దగ్గరే!

 

   సమర్పిస్తున్నాం ప్రణామం – 66

చెయ్యెత్తిన  జై కొట్టిన స్వార్థాని కనర్థానికి

ఉపేక్షించి ఊరుకొన్న స్వచ్ఛ సైన్య శ్రమరీతికి

ఏం దక్కునొ ఏం మిగులునొ ఈ గ్రామం కథ చివరికి

ఆ దుస్థితి మాన్పబూను అందరికీ ప్రణామం!

          

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త &

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

21.12.2021.