2308 * వ రోజు....           22-Dec-2021

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎందుకు వాడాలి?

 

మంచి నీళ్ల ప్రాయంగానే 2308* వ నాటి వీధి శుభ్ర సుందరీకరణం.

 

            బుధవారం (22-12-21) నాటి వేకువ - 4.19 కే మొదలై, సజ్జా ప్రసాదు గారి (అశోకనగర్ తొలి) వీధి, బైపాస్ మార్గంలో కొంతమేర, కొసరుగా సబ్బినేని (చాపల) బోసు గారి ఖాళీ స్థలమూ ఇంత బాగా శుభ్రపడడానికి కారకులు 27 మంది. సమయం 50 కి పైగా పనిగంటలు! స్థానిక మహిళలు వేమూరి జయలక్ష్మి, వేమూరి వాణి, స్వచ్యోద్యమ పాత కాపు SBI ప్రసాద్, మూడో తరగతి మణికంఠ, ఏడో తరగతి జగదీష్ ల ప్రమేయం మరొక విశేషం!

 

            పోన్లెండి! 27 వేల మంది చల్లపల్లి ప్రజల్లో 27 మందైనా తమ సొంత లాభం కాక గ్రామ ప్రయోజనం కోసం ఇలా - ఇంత చలిలో, చీకటిలో తెగబడి గంటన్నరకు పైగా పాటుబడి, ఆలోచించి, బాధ్యత వహించారు! ఈ ఆలోచించడాన్ని గురించి బాగా ఆలోచించి, సమాజపరమైన సరైన ఆలోచన ఎలా ఉండాలో మహాకవి శ్రీశ్రీ ఇలా వ్రాసాడు:

 

            “ఆలోచించడం అంటే - ఊకను దంచడం కాదు

            ఊహల్ని పెంచడం - వ్యూహాలు రచించడం

            వృధల్ని చించడం - సుధల్ని పంచడం....

మరి - ఇంత గొప్పగా, తమ లాభం కాక - మందికి ప్రయోజనకరంగా - కాలం విసురుతున్న కాలుష్యం సవాళ్లకు చెంపపెట్టుగా - ఇంత సుదీర్ఘకాలంగా ఆలోచించడమూ, ఆచరణలో ఋజువు చేయడమూ, మన జీవితకాలపు కళ్ళెదుటి అద్భుతమూ, ఆదర్శమూ,... అని నేనంటే - ఇదేమన్నా పనిగట్టుకొని వర్ణించడమనో, అతిశయోక్తులనో అంటారా? ప్రతి రోజూ అనుభవంలోకి వచ్చే ఈ స్వాప్నిక దృశ్యాన్ని ఈ మాత్రం మంచి పదాలతో సానుకూల దృక్పథంతో వర్ణించకూడదా?

 

            డాక్టర్‌ డి.ఆర్.కె. వంటి శ్రమదాన ఉద్యమ సారధికి గాని, ఎక్కడెక్కడి అజ్ఞాత ధన - ధనేతర దాతృత్వాలకు గాని, ఈ గ్రామానికి దేశ - ప్రపంచ పరివ్యాప్త గుర్తింపుకు గాని - అఖరికి నాలాంటి వ్రాతగాళ్ల ఉత్సాహానికి గాని... అసలైన మూల కారణం సృచ్చ కార్యకర్తల నిరంతర నిర్నిబంధ నిస్వార్ధ శ్రమదానం కాక మరేమున్నది?

 

            ఇంతకీ ఈ 2308* వ నాటి శ్రమదాన ముఖ్య విశేషాలేమంటే:

 

1)  బైపాస్ మార్గంలో బంకు గంగాధరరావు గారి ఇంటి దక్షిణాన డ్రైను బారునా 40 గజాల స్వచ్ఛమైన పెద్ద అద్దం వంటి రోడ్డు మార్జిను! -  ఈ మంచి అద్దం రూపశిల్పులు నలుగురు సుందరీకర్తలు!

 

2) సజ్జా ప్రసాద్ నామధేయుని వీధి ఆసాంతం ఆమూలాగ్రంగా ట్రక్కు సగం నిండిన వ్యరాలు, తొలగిన అపరిశుభ్రతలు, బజారంతా పరచుకొన్న స్వచ్చ సౌందర్యాలు!

 

3) సుమారైన చిట్టడవిలా మారిన ఆరేడు సెంట్ల బోసు గారి ఖాళీ నివేశనంలో ఏడుగురి కృషితో తెగిపడిన - తొలగిన వివిధ పిచ్చి చెట్లు, తీగలు, వ్యర్థాలు! – (ఇవి ట్రక్కులో రెండవ సగాన్ని ఆక్రమించి, డంపింగ్ కేంద్రానికి చేరాయి!)

 

            6.40 సమయంలో గ్రామ పరిశుభ్ర స్వస్త సౌందర్య సంకల్పాన్ని ముమ్మారు ఎలుగెత్తి చాటినది అర్జా  రాజేంద్ర ప్రసాదు మహాశయుడు; చలిపులి నెదుర్కొనే చర్చ జరిపింది కార్యకర్తలు; దైనందిన స్వచ్ఛంద శ్రమదానం గురించిన నా వ్రాతల్ని ప్రస్తావించి, పర్యవేక్షించి, మెలకువలు చెప్పినది కొందరు పరిశీలకులు!

 

            రేపటి వేకువ మన గ్రామ వీధుల పారిశుద్ధ్య తపస్సును కూడ ఇదే బైపాస్ వీధిలో - విజయ్ నగర్ లో మిగిలిన వీధుల్లో కొనసాగిద్దాం!

 

     సమర్పిస్తున్నాం ప్రణామం – 67

 

లో కోత్తర సేవలనుచు బాకాలూదను గానీ

ఇదే అంతిమ విజయమనుచు వదరుట సరిగాదు గాని

సామాజిక - సామూహిక సదాచరణ కుదాహరణ

గా నిలిపిన స్వచ్చోద్యమ కర్తకె తొలి ప్రణామం!   

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త &

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

22.12.2021.